బిగిసిన ఒక చిట్టి పిడికిలి

12 Nov, 2019 05:57 IST|Sakshi

ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు తెలియదు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాని ఆ అమ్మాయి కళ్లల్లో గూడు కట్టి ఉన్న కన్నీరు ఆ అమ్మాయి కథంతా చెబుతోంది. ఈ ఫొటో 2017 నవంబర్‌లో ‘ది అసోసియేటెడ్‌ ప్రెస్‌’ వార్తాసంస్థ తీసినది. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌ శరణార్థి శిబిరాలలో తల దాచుకున్న రోహింగ్యా ముస్లింలను ఆ సంస్థ ఇంటర్వ్యూ చేసినప్పుడు మొత్తం 27 మంది స్త్రీలు తమ కళ్లు మాత్రమే కనపడేలా మాట్లాడారు. వారంతా తమపై సైన్యం అత్యాచారం చేసిందని చెప్పారు. ఈ ఫొటోలోని అమ్మాయి బంగ్లాదేశ్‌ చేరుకునేలోపు జూన్‌లో ఒకసారి, తిరిగి సెప్టెంబర్‌లో ఒకసారి అత్యాచారానికి గురైంది.

2017 ఆగస్టులో మయన్మార్‌లోని మైనార్టీ వర్గమైన రోహింగ్యా ముస్లింలపై సైన్యం తెగబడింది. ఊళ్లను తగులబెట్టింది. ఖాళీ చేయించింది. దేశం బయటకు తరిమికొట్టింది. వందలాది మరణాలు, లెక్కకు మించిన అత్యాచారాలు జరిగాయి. దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని సొంత నేలను వదిలి బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. ఈ మానవ హననం పట్ల ప్రపంచంలోని చాలా కొద్ది దేశాలు మాత్రమే నిరసన వ్యక్తం చేశాయి. అన్నింటి కంటే గట్టిగా కెనెడా దేశం తన పార్లమెంట్‌లో ‘మయన్మార్‌లో జరిగినది జాతి హననం’ అని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మయన్మార్‌ సైన్యం మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని ఆ దేశ మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే కెనెడా కేవలం ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ఫిర్యాదు మాత్రమే చేయగలిగింది.

కాని ఇప్పుడు మయన్మార్‌ను పశ్చిమాసియాలోని అతి చిన్న దేశమైన గాంబియా బోనులో నిలబెట్టింది. మయన్మార్‌లో ముస్లిం మైనారిటీల పట్ల సైన్యం చేసిన అత్యాచారాలను విచారించాల్సిందిగా నిన్న (నవంబర్‌ 11, 2019)న ఫిర్యాదు చేసింది. ఆ దేశం తరపున కొందరు న్యాయవాదుల బృందం నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘మా దేశం చాలా చిన్నదే కావచ్చు. కాని న్యాయం పట్ల మేమెత్తిన గొంతు పెద్దది’ అని గాంబియా దేశ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇటువంటి ప్రతిస్పందనలు చూసినప్పుడు బాధితులకు అండగా నిలిచేవారు ఎప్పుడూ ఉంటారని అనిపిస్తుంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది.

మరిన్ని వార్తలు