కొడుకు కోసం అన్వేషణ

8 Jun, 2020 01:36 IST|Sakshi

పుస్తకం

కన్నీరింకని కనులతో కానరాని కొడుకు కోసం ఓ వృద్ధ తండ్రి సాగించిన నిరీక్షణ ‘నాన్న–రాజన్‌ తండ్రి అన్వేషణ’. నలభై రెండు పేజీల ఈ పుస్తకానికి ప్రొఫెసర్‌ టి.వి. ఈచరవారియర్‌ మలయాళ మూల రచయిత కాగా నీలన్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించారు.  సి.వనజ తెలుగులోకి తర్జుమా చేశారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. 

ఎమర్జెన్సీ కాలంలో పోలీసుల చేతులకివ్వబడ్డ అపరిమిత అధికారం ఒక నిరపరాధిని నిర్జీవంగా మార్చేసిన అమానవీయతకు ఆనవాలు ఇది. తన ఒక్కగానొక్క యువ శిశువును ప్రాణాలతో కాపాడడం కోసం ఓ తండ్రి జరిపిన న్యాయపోరాటమిది. కొడుకు ఆకలి గొని తిరిగివచ్చే వేళలకై ఎళ్లవేళలా తలుపులు తెరిచిన గదిలో ప్రతీ పూటా సిద్ధంగా ఉంచిన అరటాకు – అన్నం గిన్నెతో ఎదురు చూసే తండ్రి ఆత్రం ఇది. కొడుకును వెంటబెట్టుకురాని భర్తను నిందిస్తూ తన చిట్టి తండ్రి కోసం బిస్కెట్లు కొని, చిల్లర దాచిపెట్టిన రాజన్‌ తల్లి రాధ ఆఖరి కోరిక అనాథలా మిగిలే ఉంది. ‘నాకు తెలియని నిగూఢమైన అడవిలోంచి తగలబడిపోయిన ఆ ఆత్మ గొంతెత్తి పిలుస్తోంది’ అని ఈచరవారియర్‌ అంతరాళం నుండి సుడులు తిరుగుతూ ఉబికివస్తున్న పెను రోదనిది. వెంటాడే తలపుల అంతులేని సలపరింత ఇది. ఈ ఈవాస్తవ గాథ మరణం కంటే కటువైన వియోగభార తీవ్రతతో కలచివేస్తుంది.

ఈ వేదన యుగాల దుఃఖాన్ని అనాదిగా కురుస్తోన్న వర్షానిదా? అమాయక అడవితల్లుల చకోరపక్షి చూపులదా? కొడుకు కోసం అంతులేని నిరీక్షణతో గడిపి అంధకారంలోకి మాయమైన పిచ్చితల్లి రాధదా? మనమే పనిలో ఉన్నా రాజన్‌ కలుక్కుమంటూ ఉంటాడు. ఎంత ఏడ్చినా శరీరంలో ఎక్కడో మిగిలిపోయిన కన్నీటిలాగా మనల్ని వెంటాడుతాడు. కొడుకు తిరిగి వస్తాడన్న ఆశ దిక్కులేని అరణ్యాలలో దగ్ధమైపోయాక ‘నా చిన్నారిని అలా వర్షంలో వదిలేశారే’ అన్న ఈచరవారియర్‌ ప్రశ్న గుండెల్ని మెలిపెడుతుంది. ‘మనుషులలో జ్ఞానాన్నీ, దయనీ భిక్షగా వేయమని అర్థిస్తూ’ అంతుచిక్కని తన అమాయక శిశువు ఆచూకీ కోసం కాలాతీత కాంక్షతో ఈచర వారియర్‌ సాగించిన వేదనామయ అన్వేషణకి అక్షరరూపమిది.  ఈ ఘనీభవించిన కన్నీటి చారికల్ని మన చేతివేళ్లతో తడమకపోతే, ఈ దుఃఖగాథను మనసొగ్గి వినకపోతే, మనపైగల బాధ్యతల భారాన్ని భరించలేము.
-బడుగు భాస్కర్‌ జోగేష్‌ 

మరిన్ని వార్తలు