దానం... ఫలం

13 May, 2017 23:41 IST|Sakshi
దానం... ఫలం

దానాలకు వైశాఖమాసం ఎంతో ప్రాశస్త్యమైనదని పురాణోక్తి. సర్వతీర్థాలలోనూ స్నానం చేస్తే వచ్చే ఫలం, అన్ని దానాల వల్ల వచ్చే పుణ్యఫలం ఒక జలదానం చేస్తే వస్తుందట. వేసవి కాలంలో వచ్చే వైశాఖమాసంలో ఎండనబడి వెళ్లే బాటసారులకోసం, ఒక కుండలో నీళ్లు నింపి అడిగిన వారికి నీరందించటమే జలదానం. ఇలా ఈ మాసంలో జలదానం చేసినవారు విష్ణుసాయుజ్యం పొందుతారని, వారి ఆప్తులు పుణ్యలోకాలను చేరుకుంటారనీ ప్రతీతి. అన్నదానం చేసిన వ్యక్తికి సర్వధర్మాలను ఆచరించిన ఫలితం లభిస్తుంది.

వారిని సకలదేవతలూ దీవిస్తారు. ఎండ వేడిమితో బాధపడే వారికి తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్లయితే, పూర్ణ ఆయుర్దాయం పొంది తుదకు మోక్షాన్ని పొందుతారని పురాణోక్తి. ఎండావానలకు పనికివచ్చే ఛత్రం అంటే గొడుగుని దానం చేసినవారికి ఆధిభౌతిక, ఆధి దైవిక దోషాలు, దుఃఖాలు నివారణ అవుతాయి. సుఖనిద్రకు అవసరమైన మంచం, పరుపు, దిండు  దానంగా ఇవ్వటం వలన విష్ణుమూర్తి కృపకు పాత్రుడు కాగలడని, ప్రతి జన్మలోనూ ధర్మపరాయణుడిగా సుఖజీవనాన్ని కొనసాగించగలడని పురాణకథనం.

మజ్జిగ దానం చేయటం వల్ల మరుసటి జన్మలో విద్యావంతులు, ధనవంతులు అవుతారని పురాణోక్తి.బియ్యాన్ని దానం చేసిన వారికి పూర్ణాయుర్దాయం లభిస్తుందట. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దానం చేస్తే అశ్వమేథ యాగం చేసిన పుణ్యం, విష్ణుసాయుజ్యం లభిస్తాయట. వేసవికాలంలో విరివిగా వచ్చే మామిడిపళ్లను దానంగా ఇచ్చిన వారి పితృదేవతలు ప్రీతిచెందుతారు. దాత, అతని పూర్వీకులకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. పానకం నిండిన కుండని దానంగా ఇవ్వడం వలన నూరుసార్లు గయాశ్రాద్ధం చేసిన ఫలితం కలిగి తద్వారా పితరులు తరిస్తారు. అలాగే దోసపండు, బెల్లం, చెరకుగడలు దానం చేసినవారి సమస్త పాపాలు తొలగిపోతాయి. చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు ఇంకా నీటితో నింపిన కుండని దానం చేయటం అన్ని విధాలా మేలుని కలిగిస్తుంది. పైన చెప్పినవే కాదు... అవకాశం ఉన్న ఏ వస్తువులను దానం చేసినా మంచిదే.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు