నేనే మార్గం.. నేనే సత్యం... నేనే జీవం!

26 Mar, 2016 23:02 IST|Sakshi
నేనే మార్గం.. నేనే సత్యం... నేనే జీవం!

 ప్రేమ, కరుణ, దయ, త్యాగం, సేవ, పాపక్షమాపణలకు ప్రతిరూపం యేసు. విశ్వమానవ  పాపాలను తన పరిశుద్ధ రక్తంతో కడిగివేసి పాప క్షమాపణ కలిగేందుకు వచ్చిన మహనీయుడు యేసయ్య. దేవుని స్వరూపం కలిగినవాడై, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనక, మనుష్యుల పోలికలో పుట్టి, దాసుని స్వరూపాన్ని ధరించి, తన్ను తానే రిక్తునిగా చేసుకొన తలచి, ఈ లోకానికి దిగి వచ్చిన దైవకుమారుడు యేసు. తన సిలువ శిక్ష అనుభవించిన సిలువకు వన్నెతెచ్చి పూజార్హత కలిగించాడు యేసయ్య.

 అసలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే - దేవుడైన యెహోవా సృష్టించిన ఆదాము- అవ్వ దేవుని మాట అతిక్రమించి సాతానుతో మోసగించబడ్డారు. వారి సంతానమైన మానవకోటి అంతా పాప బంధకములలో పడిపోయి జీవించుట వలన అందరికీ మరణం సంప్రాప్తమైనది (రోమా 5:12). రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదని (లేవీ 17:11, హెబ్రీ 9:22) దానికి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాప రహితుడైన వాని రక్తం వలననే పాప క్షమాపణ జరుగుతుందని యెహోవా దేవుడు (త్రిత్వమైన దేవుడు) యేసుక్రీస్తు నామమున భూమిపై జన్మించి తన రక్తాన్ని సిలువలో చిందించి పాపులుగా చేయబడ్డ వారినందరినీ కృపాదానంతో నీతిమంతులుగా చేయుటకు వచ్చాడు.

 దేవుడు ప్రేమామయుడు. ఎందుకంటే మనం ప్రేమించితిమని కాదు.. తనే ముందుగా ప్రేమించి, మన పాపులకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను (1 యోహాను 4:10). అది కూడా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రైస్తవ మార్గం ప్రేమ మార్గం. ప్రభువు ప్రేమను వెల్లడిచేయు మార్గం. క్రీస్తు వద్ద నుండి ప్రేమను పొంది లోకానికి తెలియచేయడానికి పిలవబడిన వారము. రెండవ ఆజ్ఞ నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు. (ఇది వైయస్సార్ గారికి ఎంతో ఇష్టమైనది).

 తండ్రి ప్రేమచేత క్రీస్తు ప్రేమలో మనలను ఏర్పరచుకొన్న విధానం గొప్పది. ఎంతగా అంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరికీ అప్పగించాడు (రోమా 8:32). ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే పాపులమైన మనకోసం సిలువలో కొన్ని గంటలు యేసయ్య చేతిని వదిలాడు. అందుకు నాల్గవ మాటగా ‘నా దేవా నా దేవా ఎలా నా చెయ్యి విడిచితివి’ అంటాడు. ఎందుకంటే సిలువలో లోకపాపమంతయు ఆయన మీద మోపబడింది. ఆదాము పాపముతో దూరమైన ఆయన సన్నిధిలోకి యేసయ్య రక్తం మరల ప్రవేశం కల్పిస్తున్నది.

యేసయ్య చెప్పాడు - నేను మరల తీసుకోనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే పెట్టుచున్నాను (యోహాను 10:17-18).
ఆయన తనతో ఉండాలని కోరుకుంటున్నాడు ఎంతటి ఆధిక్యతను ఇస్తున్నాడంటే ఆదాము ద్వారా పోగొట్టుకున్న అధికారమును ఈ భూమి మీద ఆయన సృష్టి అంతటి మీద తిరిగి కల్పించాడు.

యోహాను 17:23 - నీవు నేను ఏకమై ఉన్నట్లుగా నీవు నాకనుగ్రహించిన వారందరు ఏకమవ్వాలని నీవు నాకిచ్చిన మహిమను వారికి ఇచ్చితిని.
యోహాను 17:24 - నేను ఎక్కడ ఉంటానో నీవు నాకనుగ్రహించిన వారందరు నాతో కూడ ఉండాలని, నీవు ఇచ్చిన మహిమను చూడాలని ప్రార్థన చేశాడు.
ఎఫెసీ 2:7 - క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టును.
ప్రకటన 3:21 - నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండనిచ్చెదను.
యోహాను 17:3 - సర్వశరీరులకు నిత్యజీవమిచ్చుటకు.
ఎఫెసీ 1:7 - మన అపరాధములకు క్షమాపణ, విమోచన ఇవ్వటానికి వచ్చాడు.
ఎఫెసీ 1:6 - జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు. తన చిత్త ప్రకారమైన దయాసంకల్పమును బట్టి కుమారులుగాను స్వీకరించుటకు మనలను ముందుగానే నిర్ణయించుకున్నాడు.
రోమా 3:24 - క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు.
రోమా 8:39 - ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని వాక్యము సెలవిస్తుంది.
రోమా 8:37 - మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఆయన ప్రేమ శాశ్వతమైనది (యిర్మీ 31:3)
కొలస్సీ 2:10 - మనం ఆయన యందు సంపూర్ణులమై యున్నాము
హెబ్రీ 10:14 - ఆయన అర్పణచేత పరిశుద్ధపరచబడు వారికందరికి (నిన్న నేడు రేపు) వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు.
హెబ్రీ  8:12 - నీ దోషముల విషయమై నీ పాపాలను ఇక ముందు ఎన్నడూ జ్ఞాపకం చేసికొననని వాగ్దానం.
యోహాను 15:27 - ఆయన శాంతిని మీకిచ్చి వెళ్లుచున్నాను.
యోహాను 20: 19 - యేసు ఆరోహణమైన తరువాత శిష్యులకు కనబడి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పెను.
యెషయా 53:5 - ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత.
రోమా 10:9 - యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల రక్షించబడెదవు. ఆయన రక్తం ద్వారా కడిగి మనలను పరిశుద్ధులలో నడిపిస్తున్నాడు.
హెబ్రీ 10:19 - ఆయన రక్తం ఆయన సన్నిధిలోకి ఆయన సహవాసంలోకి నడిపిస్తుంది.
యోహాను 3:16; యోహాను 6:40 - కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవము పొందుటయే తండ్రి చిత్తము.
మార్కు 16:17 - నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. నీ నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు. కొత్త భాషలు మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది తాగినను హాని చేయదు. నమ్మిన వారికి అధికారమును ఇస్తున్నాను.
2 కొరింథీ 8:9 ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్య్రం వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తం తాను దరిద్రుడాయెను.
రోమా 8:30 - ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వానిని మహిమపరుస్తున్నాడు.
ప్రకటన 5:12 - వధింపబడిన గొఱ్ఱెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమ నేత్రమును పొందనర్హులని చెప్పబడుతుంది.
యోహాను 14:26 - మీకొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపెదను.
ప్రకటన 1:6 - రాజులుగా, యాజకులుగా చేసినాడు.
నిర్గమ 19:5-6 - ఆయన మాట వినేవారు నా స్వకీయ సంపాద్యమగుదురు.
మత్తయి 1:23 - ఇమ్మానుయేలు దేవుడు తోడు.
రోమా 8:14-16 - అబ్బా తండ్రీ దత్తపుత్రులుగా వారసులుగా చేసినాడు.
యోహాను 14:6 - నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును.
యోహాను 4:23 - ఆత్మతో ఆరాధించువారు కావలెనని వెదుకుచున్నాడు.
♦  ఆయన సిలువ ద్వారా కృప చేత ప్రేమ కుమ్మరించబడుచున్నది.

 అబ్రహాముకిచ్చిన వాగ్దానానికి వారసులుగా చేస్తాడు. ఆది 12:2-3 - నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించువారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. యేసయ్య మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మనలను వెలిగించు జీవపు వెలుగు.

 మనం ప్రేమించే దానికంటే ప్రేమించబడుటయు అది కూడ దేవునితో ప్రేమించబడటం గొప్ప వరం. మనం చూపే ప్రేమ మనం చేసే పుణ్యకార్యాలు ఏమీ ఆధారం కావు. అవి ఏవీ దేవునికి ఒరగబెట్టేవి కావు. మనం చేసే కార్యాలు మనం చూపే ప్రేమ మాత్రమే మన కళ్లకు కనిపిస్తుంటుంది. కాని మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రాము. చనిపోయేటప్పుడు మామూలుగా అయితే ఏమీ తీసుకొనిపోము. అదే క్రైస్తవునికి అయితే ఇక్కడ నుండి స్థల మార్పు. పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాము. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. యేసయ్యతో సమానముగా అంటే అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనం అనుకోవాల్సింది మన కోసం కాదు, నా కోసం యేసయ్య సిలువలో మరణించాడు అని. అవును ఇది సత్యం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని క్రీస్తుతో సజీవులుగా లేపుతున్నాడు. పరలోక ఆశీర్వాదములు ఇహలోక ఆశీర్వాదములు ఆయన సిలువలో చేసిన ఆర్పణ కారణం. ఆయన లేచిన రోజు ఈస్టర్. ఒకవేళ ఆయన చనిపోయి ఉండకపోతే మన పరిస్థితి నరకంలోనే పాపంలోనే ఉండేది. సాతానుకు ఏమాత్రం తెలిసినా యేసయ్య సిలువను ఆపి ఉండేది. ఆయన కృప ప్రేమ పొంగి పొరులుతూ ఉంటుంది.

ఆయన సంకల్పం (1 తిమోతి 2:4-6): మనుష్యులందరు రక్షణ పొంది సత్యమందు జ్ఞానము గలవారైయుండవలెనని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తుయేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అందరూ రక్షణ పొందాలని రెండవ రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అందరికీ ఈస్టర్‌కు క్రీస్తు యేసునామమున శుభములు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.

క్రీస్తు పునరుత్థానమే మనం పండుగ చేసుకోవడానికి కారణం. మనందరికి తెలిసినది యేసయ్య ఒక్కమారే చనిపోయాడని. మృతులలో నుండి తిరిగి లేచాడనేది. ఇది సత్యం. అదే పౌలు తన పత్రికల్లో వెల్లడి చేస్తున్నాడు (రోమా 6:10; 10:12). ‘‘లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతిపొందెను. సమాధి చేయబడెను. మూడవ దినమున లేపబడెను’’ (కొరింథీ 15:3-4). ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచ వెళ్లుచున్నానని (యోహాను 14:1-4) మరల ఒక దినమున దిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు.

నేనే మార్గమును.. నేనే సత్యమును... నేనే జీవమును. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు వెళ్లలేరు అని చెప్పాడు (యోహాను 14:6). అవును మరి ఆయన సిలువపై మన పాపాల ప్రాయశ్చిత్తం చెల్లించి, మూడు రోజులైన తరువాత పాపరహితుడైన యేసు సమాధి నుండి లేచుట ద్వారా మరణంపై విజయం సాధించాడు. పాపం మీద, మరణం మీద, సాతాను మీద, అపవాది క్రియల మీద, దాస్యపు ఆత్మ మీద విజయం సాధించాడు. మనం ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి ఆయనతో పరలోకంలో శాశ్వతంగా ఉండటానికి యేసయ్య మార్గమును సిద్ధపరిచాడు. మనం కూడా మరణించి పునరుత్థాన ం చెందటానికి మన ం ప్రభువుతో ఉంటామని, మన ప్రియులతో ఉంటామన్న గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు. అవి మన హృదయాలకు ఎంతో సంతృప్తినిస్తుంది.

నిజం చెప్పాలంటే ఈస్టర్ నాడే మనకు పండుగ కాదు. ప్రతి రోజూ పండుగే. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఆయన పునరుత్థానుడు కాకపోతే మనకు రక్షణ ఎక్కడిది? మనకు దేవునితో ఉండే భాగ్యమేది? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాడు, ఈ లోకములో ఎప్పటికీ. అందుకే ప్రతి రోజూ ప్రతి సెకనూ స్తుతించాలి, కొనియాడాలి. అందుకే దావీదు అంటాడు ‘‘మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము... నా కోట... నేను నమ్ముకొను నా దేవుడు’’ అని. అవును మరి!

 

నిజం చెప్పాలంటే ఈస్టర్ నాడే మనకు పండుగ కాదు. ప్రతి రోజూ పండుగే. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఆయన పునరుత్థానుడు కాకపోతే మనకు రక్షణ ఎక్కడిది? మనకు దేవునితో ఉండే భాగ్యమేది? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాడు, ఈ లోకములో ఎప్పటికీ. అందుకే ప్రతి రోజూ ప్రతి సెకనూ స్తుతించాలి, కొనియాడాలి.
       - వై.ఎస్.విజయలక్ష్మి

 

 

మరిన్ని వార్తలు