ఆ ముగ్గురు స్త్రీలే మహా సైన్యం

19 Mar, 2017 00:09 IST|Sakshi
ఆ ముగ్గురు స్త్రీలే మహా సైన్యం

ఇశ్రాయేలీయులు లేదా హెబ్రీయుల ఐగుప్తు దాస్య విముక్తి, వారి వాగ్దాన దేశయాత్రలో ముఖ్య విలన్‌ ఫరో చక్రవర్తి కాగా, దేవుడు వాడుకున్న గొప్ప హీరో మోషే! కాని ప్రాణార్పణకు కూడా సిద్ధపడి ఆ మోషేను బతికించిన ముగ్గురు స్త్రీల పాత్ర చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం కూడా. హెబ్రీ మగపిల్లవాణ్ని పుట్టగానే చంపేయాలన్నది మంత్రసానులకు ఫరో చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ. ధిక్కరిస్తే మరణశిక్ష తప్పదు. అయినా తన కుమారుణ్ని బతికించుకోవాలని నిర్ణయించుకుంది మోషే తల్లి యోకెబెదు. షిఫ్రా, పూయా అనే ఇద్దరు హెబ్రీ మంత్రసానులు చక్రవర్తి ఆజ్ఞను ధిక్కరించి దైవభయంతో ఆమెకు సహకరించారు. అలా పురిటినాడే చనిపోవలసిన మోషే ఆ ముగ్గురి తెగువ, దైవభక్తి కారణంగా బతికాడు. ఆయనే ఇశ్రాయేలీయుల దాస్య విముక్తిని సాధించాడు. కండలు తిరిగిన యుద్ధవీరులే బలవంతులంటుంది లోకం. కాని దేవునికి లోబడి ఆయన మాట నెరవేర్చేవారే నిజమైన బలశూరులంటుంది బైబిల్‌ (కీర్తన 103:20).

దేవునికి భయపడటం అంటే హింస, దౌర్జన్యం, అశాంతి, మోసం లాంటి లోక వైఖరిని ధిక్కరించడమని బైబిలు వివరిస్తోంది. తెగువలేని దైవభక్తి చక్రాలు లేని బండిలాగే నిష్ప్రయోజనకరమైనది. విశ్వాసికి దైవభక్తి ఉండాలి, దాన్ని ఆచరణలో పెట్టగల అసమానమైన తెగువ కూడా ఉండాలి. మోషే ఉదంతంలో దేవుని సంకల్పం అనే దీపం ఆరిపోకుండా తెగించి తమ చేతులు అడ్డుపెట్టిన మహాసైన్యం ఈ ముగ్గురు స్త్రీలు. అందుకే మోషే ఉదంతమున్న బైబిలు నిర్గమకాండంలో మహాబలుడనని విర్రవీగిన ఫరో చక్రవర్తి పేరును దేవుడు ప్రస్తావించలేదు కాని ఏ విధంగా చూసినా అనామకులు, దుర్బలులైన ఆ ముగ్గురు సామాన్య స్త్రీల పేర్లు ప్రస్తావించాడు. స్త్రీలను చులకన చేసి మాట్లాడే పురుషాధిక్య సమాజానికి దేవుడు పెట్టిన చురక, నేర్పిన అమూల్యమైన పాఠమిది.

దైవభక్తిలో తెగింపు, చొరవ లేకపోతే అది ‘కొంగజపం’, ‘వేషధారణ’ అవుతుంది. దేవుని రాజ్యాన్ని, సమాజాన్నంతటినీ, చర్చిని, పరిచర్యను కాపాడుకోవలసిన బాధ్యత విశ్వాసులందరిదీ.  పాము ఇంట్లో దూరితే ఇంటిని, ఇంట్లోని చంటిపిల్లల్ని ఒదిలి ప్రాణభయంతో పారిపోయే తల్లిదండ్రులు ఇలాంటివారే! దైవభక్తి తెగింపు మిళితమైన పరిచర్య చేసిన ఒకప్పటి మార్టిన్‌ లూథర్, మదర్‌ థెరిస్సా, స్పర్జన్, నిన్నమొన్నటి మాసిలామణి, భక్తసింగ్, పి.ఎల్‌.పరంజ్యోతిగార్లు, ఇప్పటి స్వర్గీయ జాన్‌డేవిడ్‌ (చిలకలూరిపేట), రెవ.డా.జీ.శామ్యేల్‌ (హైదరాబాద్‌ బాప్టిస్టుచర్చి) అలా తెగించి దేవుని సంక్పల్పాలను నెరవేర్చినవారే!
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు