మంత్రి యుక్తి

15 Sep, 2019 03:34 IST|Sakshi

మహారాజు విక్రమవర్మ మరణానంతరం విజయవర్మ అతి పిన్నవయసులోనే కళింగ సింహాసనం అధిరోహించాడు. తండ్రి విక్రమవర్మ మహావీరుడు, పరాక్రమవంతుడు అవడం వల్ల యుద్ధంలో చాలా రాజ్యలు గెలిచి తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. అంతేకాకుండా, విక్రమవర్మ పరిపాలన విషయంలో కూడా సమర్థుడవడం వల్ల అతని పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతూ వుండేవారు. అయితే విక్రమవర్మ కుమారుడు విజయవర్మ పూర్తిగా శాంతికాముకుడు. విజయవర్మ కూడా మహావీరుడేకాని యుద్ధం, రక్తపాతం అంటే పూర్తి విముఖత కలిగి ఉండేవాడు. అందుకే రాజ్య విస్తరణకి పూనుకోలేదు.

అతని పరిపాలనలో యుద్ధాలు లేక రాజ్యంలో శాంతి వాతావరణం నెలకొంది. ఇరుగుపొరుగు రాజ్యాలతో సఖ్యంగా ఉండేవాడు. రాజ్యపరిపాలన బాధ్యత తీసుకున్న తరువాత పరిపాలనా విషయంలో బోలెడన్ని సంస్కరణలు చేపట్టి అనతికాలంలోనే ప్రజల మన్నన చూరగొని తండ్రిని మించిన తనయుడని అనిపించుకున్నాడు. గ్రామాల్లో చెరువులు, బావులు తవ్వించి రైతులకి వ్యవసాయరంగంలో ఏ లోటు రాకుండా చేశాడు.

తనరాజ్యంలో పిల్లలు చదువుకోవడానికి ఉరూరా విద్యాలయాలు ఏర్పాటుచేశాడు.  తన రాజ్యంలో వ్యాపారం పుంజుకోవటానికి వివిధ కార్యక్రమాలు చేపట్టాడు. లలితకళలను పెంచి పోషించాడు. పండిత పామరులకు తన కొలువులో చోటిచ్చాడు.యుద్ధాలు లేకపోవడంతో రాజ్యం సర్వతోముఖంగా అభివృద్ధి చెందింది. అతని కారణంగా ఆ రాజ్య ప్రజలు కూడా శాంతికాముకులుగా మారారు. ఇలా ఉండగా, రాజు విజయవర్మకు ఓరోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా మహామంత్రి వివేకవర్ధనుడిని పిలిపించాడు.

‘‘మహామంత్రి!... ప్రస్తుతం మన రాజ్యం సుభిక్షంగా ఉంది కదా!  ఇరుగు పొరుగు రాజులందరితోనూ మైత్రి ఉంది.  అలాంటప్పుడు నాన్నగారి హయాం నుంచి ఉన్న అంత అధికసైన్యం ఇప్పుడు మనకు అవసరం అంటారా?  ఇప్పుడు ఇక యుద్ధభయం రాజ్యానికి లేదు. మనకి అంతసేన అక్కర్లేదు అన్నది నా ఉద్దేశం. సత్వరం సైన్యాన్ని తగ్గించే ఏర్పాట్లు చెయ్యండి.  అధిక సైన్యం కోసం వెచ్చించే ఆ ధనం మరేదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించటం మంచిదని నా అభిమతం’’  అన్నాడు విజయవర్మ.

అంతా విన్న మంత్రి చిన్నగా నవ్వి, ‘‘మహారాజా!  తమరు శాంతికాముకులు. మన రాజ్య ప్రజలందరూ కూడా మీ అడుగు జాడలలో నడిచేవారే! అయితే, ఇరుగుపొరుగు రాజ్యాల రాజుల మీద అంత నమ్మకం తగదు. వాళ్ళల్లో అందరూ శాంతికాముకులు కాకపోవచ్చు. పైగా మన సామ్రాజ్యాన్ని, విశాల సైన్యాన్నీ చూసి మనతో మైత్రి నెరపుతూ ఉండవచ్చు. అందువల్ల ప్రస్తుతం మనం సైన్యం తగ్గించుకోవడం అంత మంచిది కాదనిపిస్తోంది ప్రభూ!’’ అన్నాడు.

మహామంత్రి మాటవిన్న విజయవర్మ, ‘‘మనది విశాల సామ్రాజ్యం కదా, మన రాజ్యంవైపు కన్నెత్తి చూడటానికి కూడా ఎవరూ సాహసం చెయ్యరు. పైగా మనతో మైత్రి, స్నేహభావం కలిగిన రాజులు మనరాజ్యంపై దండెత్తుతారని నేననుకోవడంలేదు.  పైగా నా శాంతి సందేశాన్ని అన్ని రాజ్యాల రాజులు హర్షిచారు కూడా. మరేమీ ఆలోచన పెట్టుకోకుండా సత్వరమే సైన్యం తగ్గించే ఏర్పాట్లు చెయ్యండి’’ అన్నాడు.
మరేమీ చేయలేక మహామంత్రి వివేకవర్ధనుడు సరేనన్నాడు. ఆ విధంగా రాజ్యంలో సైన్యం తగ్గించడం ఆరంభించాడు మహామంత్రి.  

ఈ వార్త ఇరుగుపొరుగు రాజ్యాలకు చేరింది. అంతే!  అంతవరకు విజయవర్మతో స్నేహంగా మసలుతున్న రాజులు ఒకరితో ఒకరు కూడబలుక్కుని కళింగరాజ్యంపై దండెత్తడానికి యుద్ధసన్నాహాలు ప్రారంభించసాగారు.అప్పుడు వేగుల ద్వారా ఈ వార్త విన్న విజయవర్మ నివ్వెరపోయాడు. తనతో మైత్రి కలిగిన రాజ్యాల నుంచి ఈ విధమైన ప్రతిక్రియ కలుగుతుందని ఊహించలేదు అతడు. వెంటనే మహామంత్రి వివేకవర్ధనుడిని పిలిపించి విషయం చెప్పాడు.విషయం విన్న వివేకవర్ధనుడు ఇలా అన్నాడు: ‘‘ప్రభూ!... అనాడే నేను ఈ విషయం విన్నవించుకున్నాను.  ఇరుగుపొరుగు రాజులు మనతో స్నేహం చేయడానికి కారణం మన అపార సైన్యం చూసి భయపడి మాత్రమే. అంతేకాని మన శాంతికాముకత్వం చూసికాదు. ఎప్పుడైతే మనం సైన్యం తగ్గించుకుంటున్నామని విన్నారో అప్పటినుంచే మనరాజ్యాన్ని జయించడానికి వాళ్ళల్లో యుద్ధకాంక్ష మొదలయింది.  అందుకే ప్రభూ! యుద్ధం ఉన్నా, లేకున్నా తగినంత సైన్యం కలిగి ఉండటం తప్పనిసరి.  తగినంత సైన్యం ఉంటే మనవైపు ఏ రాజూ కన్నెత్తి చూడలేడు.యుద్ధ భయం లేకపోతేనే కదా ప్రజలందరూ శాంతిసౌఖ్యాలతో కాలంగడిపేది.’’

‘‘మంత్రివర్యా! సరిగ్గా చెప్పారు, అయితే ప్రస్తుతం ఏం చేయడం?’’ ఆందోళనగా అడిగాడు విజయవర్మ.అందుకు వివేకవర్ధనుడు, ‘‘ప్రభూ!  నన్ను  క్షమించాలి. ఈ సంగతి నాకు ముందే తెలుసు, అందుకే నేను నిజంగా సైన్యం తగ్గించే ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదు.  ఈ వార్త పొరుగు రాజ్యాలకు చేరేలా మాత్రమే చేశాను. దాంతో వాళ్ళ అసలురంగు బయటపడింది.’’ అన్నాడు.వివేకవర్ధనుడి యుక్తిని మెచ్చుకుని, తక్షణం సైన్యం తగ్గించే ఆలోచన విరమించుకున్నాడు విజయవర్మ. ఆ విషయం చారుల ద్వారా గ్రహించిన పొరుగు రాజులు యుద్ధ ప్రయత్నాలు మాని ఎప్పటిలాగానే విజయవర్మ పట్ల తమ మైత్రిభావాన్ని ప్రకటించుకున్నారు.

మరిన్ని వార్తలు