ఒకప్పటి మన ఆటలు

20 May, 2019 00:20 IST|Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం 

‘రెడ్డిరాజుల కళా, సాహిత్య పోషణ, వారి కాలంనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులు, వివిధ రాజుల వ్యక్తిత్వ విశేషాలు– వీటిని గురించి’ మల్లంపల్లి సోమశేఖర శర్మ(1891–1963) ఇంగ్లీషులో రచించిన అపూర్వ పరిశోధక గ్రంథం ‘హిస్టరీ ఆఫ్‌ ది రెడ్డి కింగ్‌డమ్స్‌’(క్రీ.శ. 1325–1448). దీన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం 1948లో ప్రచురించింది. దీన్ని తెలుగులోకి ఆర్వియార్‌ అనువదించగా అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య ప్రచురించింది. అందులోని అప్పటి ఆటల గురించిన కొంతభాగం ఇక్కడ:

అప్పట్లో పిల్లలు ఆడుకునే ఆటల గురించి తెలుగు సాహిత్యంలో ప్రస్తావన వుంది. గాలిపటాలు యెగరెయ్యడం, బొంగరాలతో ఆడుకోవడం వుండేవి. బొంగరాల ఆటని పల్నాటి వీరచరిత్రలో బాగా వర్ణించాడు కవి. యివిగాక రాగుంజు పోగుంజులాట, కుందెన, గుడి గుడి గుంజాలాట, అప్పల విందులాట, సరిగుంజులాట, బామ్మ పోట్లాట, గోరంటాట, చెరబొంతల యాట, చప్పట్లు పెట్టడం, దిగుదిగు డిక్కను నాట, దాగుడుమూతలాట వుండేవి. వీటిల్లో కొన్ని పూర్తిగా మరుగున పడిపోయేయి. గుడి గుడి గుంజం, చిట్లపొట్లాట, కుందెన, దాగుడుమూతలాట యివాల్టికీ పల్లె ప్రాంతంలో బాగా వున్నాయి.

ఇక యిళ్లలో ఆడుకునే ఆటలు వున్నాయి. యువకులు, స్త్రీలు వాటిని ఆడుకునేవారు. సంపన్న కుటుంబాల్లో యెక్కువగా వాటిని ఆడేవారు. అంజి సొగటాలు, అచ్చనగండ్లు, ఓమనగుంటలు, జూదం లాంటివి. వీటిల్లో సొగటాలు, జూదం, పాచికలాటలు తప్ప వేరే యేంకాదు. యువరాజులకు, యువరాణులకు యివి మంచి వినోదం. రాజులు, రాణులు ఆడుకునేవారు. విటులు ప్రియురాళ్లు ఆడుకునేవారు. పాచికలాటలో అయిదు పాచికలు వుండేవి. దాన్ని అంజి సొగటాలు అనేవారు (అంజి అంటే అయిదు). నెత్తం అంటే జూదం అనీ, పందెం అనీ కూడా అర్థాలు. పది రకాల పందేలు వుండేవి. నెత్తం గురించి తెలుగు కావ్యాల్లో వుంది. అచ్చనగుండ్లు యివాల్టికీ యిష్టంగా ఆడుకునేదే. అమ్మాయిలు ఆడతారు. తెలుగునాట అన్ని కులాల పిల్లలూ యీ ఆట ఆడతారు.

యి పేరులోనే వున్నట్టు దీన్ని చిన్న గులకరాళ్లతో ఆడతారు(కల్లు: రాయి, కండ్లు దీనికి బహువచనం). వాటిని ఎగరేసి చేతి వెనక పట్టుకోవాలి. దీన్నే అచ్చనాగాయలు అనీ అంటారు. యిద్దరు, అంతకుమించీ ఆడతారు. ఓమనగుంటలు మరో గృహ వినోదం. యివాల్టికీ చాలా తెలుగు కుటుంబాల్లో ఆడే ఆట యిది. దీన్ని సామాన్యంగా వామనగుంటలు అంటారు. లోహంతోగాని, చెక్కతోగాని చేసిన మడత పలక వుంటుంది. అది చేప వగైరాల ఆకారంలో వుంటుంది. ప్రతి చెక్కలోనూ యేడు పల్లాలు వుంటాయి. దీన్ని సాధారణంగా యిద్దరు కలిసి ఆడతారు. ఒక్కొక్కళ్లూ తమ వేపు వున్న యేడుగళ్లకీ బాధ్యులు. ప్రతి గుంతలోనూ ఆ చెక్కలో 13 గులకరాళ్లు పెడతారు. లేకపోతే ఇవాళ వున్నట్టు చింతపిక్కలు పెడతారు. అవతలి చెక్కమీద వున్న వాటిని తప్పించాలి. యెవళ్లు అన్నిట్నీ ఆక్రమించుకుంటారో వాళ్లు విజేతలు. దీన్ని తమిళంలో పల్లాంగుడి అంటారు. పద్నాలుగు గుంతలు అని అర్థం. ఒకోసారి ఒక్కళ్లే యీ ఆట ఆడుకుంటారు. అదప్పుడు ఒంటి ఆట అవుతుంది.

మరిన్ని వార్తలు