జ్ఞాపకాల బుల్లెట్‌

19 Aug, 2019 01:14 IST|Sakshi

కథాసారం

ఎన్నిసార్లో కామాయీ, తల్లీ, చిన్న తమ్ముడూ ఆ చెరువొడ్డున కూర్చుని వణ్ణం తిన్నారు. అదంతా జ్ఞాపకమొచ్చింది. వాళ్ళమ్మా, తమ్ముడూ, వణ్ణమూ, మెరపకాయల కారమూ, కాల్చిన రొయ్యిలూ అన్నీ జ్ఞాపకమొచ్చాయి.
కంకిపాటి కామాయికి ఇన్‌ఫెంట్రీలో ఇచ్చిన పేరు ప్రయివేటు సిపాయి నంబరు 58310 అని. ఆ చుట్టుగోడలో వున్న కంతలోంచి దూరి ఇవతల పడ్డాడు. బోర్ల నుంచి వెల్లకిల తిరిగాడు. ఆ వెధవ మణిపూరు రోడ్డు – కొండలూ, గుట్టలూ, పైగా ఎనిమీ కట్టే అడ్డుగోడలూ!
సూర్యుని కిరణాలు కామాయి బుగ్గల మీద తాండవిస్తుంటే ఆ చలికాలంలో వాడికి హాయిగా వున్నది. వాడనుకోవడం – ఆ గోడ కంతలోంచి దూరి హాయిగా ఇవతల పడ్డానని.
‘‘ఆ! యేడిసినట్టుంది. గౌహటీ నుంచి బయల్దేరి నవుగామ్‌ కొచ్చాం. ఆడనుంచి మణిపూరెళుతుండాం. నా కాలికేదో తగిలి నేనీడ పడ్డాను. యారయినా యింటే నవ్వుతారు. లేచీ మిగతావోళ్ళను కలుసుకోవాల. ఆళ్ళీపాటి కవతల కొండమీదకి పోయుంటారు’’ అనుకున్నాడు కామాయి.
చేతులూ కాళ్ళూ కదలడం లేదు. లేవాలని ఎంతో ప్రయత్నించాడు. దుఢీలున మహా భయం వేసింది వాడికి. సూర్యకిరణా లాగిపోయాయన్నట్లుగా వాడి శరీరమంతా చల్లబడడ మారంభించేసరికి వాడికి మహా గాభరా వేసింది.
‘‘అరే దేముడా! ఓ యాల నేనూ ఓ యాల నేనూ; కాదు కాదు’’ అని మళ్ళీ శాంతపడ్డాడు. ‘‘ఆ పడ్డంలో యెక్కడో బెణికింది గామోసు, అందుకనే లేవలేక పోతుండా’’ అనుకున్నాడు.
కొంచెం సేపటికి వాడి శరీరంలో ఉన్న చల్లదనం పోయింది. సూర్యకిరణాల వేడికి మళ్ళీ హాయి పొందుతున్నాడు కామాయి.
అదంతా అసలు సీఓ తప్పు. లేకపోతే ఏమిటి మరి? వాళ్ళందర్నీ సెలవ కిండ్లకు పంపిస్తానన్నాడు. వారం రోజులైనా కాలేదు, యేక్షన్‌లోకి పోవాలన్నాడు. ఇండ్ల మీద ప్రాణాలు పెట్టుకున్నవాళ్ళు ఎట్లా ఆ వెధవ మణిపూరు రోడ్డు మీద బార్బుడు వైరు వెనక పాకులాడుతూ పోతారు? ఆ పనిమీద మనసెలా వుంటుంది? న్యాయం కాదు.
ఆ మొదటి కొండ పక్కనుంచి ఆ గ్రామం గుండా గోడల సందుల్లో బోర్లపడి పాకులాడుతూ పోయినప్పుడంత కష్టంగా లేదు. అప్పుడు ముందర బోడిరాము డుండేవాడు. వాడి తలకాయి చూసుకుంటూ పాకాడు కామాయి. పాపం చాలా మంచివాడు బోడిరాముడు. ఎన్ని బాంబులు పడుతున్నా వాడి యాసలో వాడు ఏవేవో చమత్కారాలాడుతూ ఆ వున్నవాళ్ళ ధైర్యం పోకుండా చూసేవాడు.
అదైపోయింది. అసలు నాటకం – లేచి ఆ చుట్టూ గోడ పక్కనుంచి పాకులాడుతూ పోవాలని ఆర్డరొచ్చింది. కామాయి వెంటనే ఎదుట చూడంగానే గోడలో మనిషి దూరేంత కంత వుంది. మహా అదృష్టవంతుణ్ణనుకున్నాడు. దూరి అవతలకు పోతే ఫస్టు అనుకున్నాడు. అక్కడ్నుంచీ పాకటం ఉండదనుకున్నాడు. వాడి కోసమే ప్రత్యేకం, ఆ కంత ఉందనుకున్నాడు. దభాలున దూకాడు. అయితే కాళ్ళమీద లేవాల్సింది మొఖం బోర్లా పడ్డాడు – ఆ యెత్తు నుంచి!
ఆశ్చర్యం! ఆ దూకబోయే ముందర ఓసారి చుట్టూ చూశాడు. కంకిపాటి చెరువల్లే ఓ చెరువూ, అక్కడ మోస్తరే ఓ వరిపొలం కనబడ్డాయి. ఆశ్చర్యం సుమా! ప్రపంచంలో రెండుచోట్ల ఒకే మాదిరుండడం.
ఎన్నిసార్లో కామాయీ, తల్లీ, చిన్న తమ్ముడూ ఆ చెరువొడ్డున కూర్చుని వణ్ణం తిన్నారు. అదంతా జ్ఞాపకమొచ్చింది. వాళ్ళమ్మా, తమ్ముడూ, వణ్ణమూ, మెరపకాయల 
కారమూ, కాల్చిన రొయ్యిలూ అన్నీ జ్ఞాపకమొచ్చాయి. పాపం ఎన్నిసార్లు వాళ్ళమ్మ ఎండలో ఆ పొలంలో చమటలు కమ్ముతూ పని చేయలేదు? నిజం – అదంతా కళ్ళకు కట్టినట్లు కనపడ్డాది వాడికి – ఆ గొంతుకలు కూడా వినబడ్డాయి.
  నిజంగా ఆ గొంతుకలు వినబడ్డాయి. తమ్ముడు చెట్టెక్కాడు. ‘‘రేయి నీ జిమ్మ తియ్యా! ఆ వున్న ఒక్క గంతా సింపుకుంటావు. దిగి రాయేంరా!’’ అనేది అమ్మ. కామాయి చెర్లో చేపలు పడుతుంటే ‘‘రాయేంరా! ఈ మట్టి తియ్యాలి రారా!’’ అనేది.
వాళ్ళు ముగ్గురే! ఆ గ్రామంలో ఇంకా వున్నారు గాని వీళ్ళ ముగ్గురికీ వీళ్ళు ముగ్గురే అన్నట్లుండేది.
అప్పుడే – అప్పుడే సుబ్బిని కలిశాడు కామాయి. సుబ్బిని కలిసిం తర్వాత మారాడు. అప్పట్నుంచీ అమ్మా కాదు, తమ్ముడూ కాదు – ప్రపంచమంతా సుబ్బే! సుబ్బి ఇప్పుడుంటే ఎంతిచ్చుకోడు? ఆ నున్నగా, నల్లగా చంపలమీదానిస్తే ఏమివ్వడు? పక్కన పడుకుంటే చాలు – ఆ గుండెలో వేత్తున్న నొప్పంతా పోతుంది. ఆ గుండెలో నొప్పి, మొఖం మీద మంటా వాడ్ని ముందుకు లాక్కెళ్ళుతున్నాయి – సుబ్బిని కలుసుకోడానికి.
అవును సీఓ లీవిస్తానన్నాడు. వెళ్ళి సుబ్బిని పెండ్లాడవచ్చు. సుబ్బి పెండ్లాడుతుందా? కంకిపాటి సుబ్బి అవుతుందా? అయితే ఆ పొలం పక్కన, ఆ చెరువొడ్డున, ఆ వేపచెట్టు పక్కనున్న గడ్డివామి మద్దెన పడుకున్నప్పుడాడిన మాటలు మాటాడుతుందా?
మళ్ళీ వొకసారి లేవడానికి ప్రయత్నించాడు కామాయి. ఉహు! ఏ అవయవమూ కదల్దే!
పోనీలే. కదలకపోతే నేమాయె. ఇప్పుడు కదిల్తేనేం, కదలకపోతేనేం. అంతా అయిపోయినట్లుంది. ఏమిటా చీకటి? గ్రహణం పట్టిందా? గ్రహణంలో కదలకూడనివాళ్ళు గర్భిణీ స్త్రీలు. తాను సిపాయి. ఎందుకు కదలకూడదూ?
మూతి బిగించి లేవబోయాడు. కదలలా! వాడికే నవ్వొచ్చింది. మెడ ఓ వైపు తిప్పాడు. ఆ చెరువు వొంక చూశాడు – నవ్వుతూ.
శవాలను వెతుక్కుంటూ గాయపడ్డవాళ్ళను మోసుకెళ్ళే పార్టీ ఒకటక్కడికి వచ్చింది. వాళ్ళ లీడరు అటూ ఇటూ చూసి కామాయిని కనిపెట్టాడు. దగ్గరకు పోయాడు. చచ్చి చాలా సేపయిందనుకున్నాడు. ముఖం చూశాడు. ఆ వేపు చెరువును చూస్తునట్లుగా వుంది. పెదిమల మీద చిర్నవ్వుంది.
లీడరు కామాయి బ్లవుజు విప్పాడు. మెళ్ళో ఉన్న రెండు ఐడెంటిటీ డిస్కులు చూశాడు. చదివాడు. కంకిపాటి కామాయి – నంబరు 58310 అని వుంది. ఎదురుగా కొండ వేపు చూశాడు. కామాయి పుర్రెలో వున్న గుండు దెబ్బ చూశాడు.
‘‘ఈడీ కంతలోంచి ఈతలికి సూసేసరికాదెబ్బ తగిలుంటుందిరా. ఇంటికి ఐడెంటిటీ తీస్కోండి. ఆ తర్వాత ఏదైనా వస్తుంది!’’ అని తక్కిన వాళ్ళతో అన్నాడు.
శవం నక్కల పాలైంది. 

శిష్టా ఉమామహేశ్వరరావు కథ ‘పడిపోయిన సిపాయి’ ఇది. తెలుగులో సైన్యం నేపథ్యంలో రచనలు చేసిన అరుదైన రచయిత శిష్టా. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్‌ సైన్యంలో పనిచేశారాయన. ‘సిపాయి కథలు’ కథాసంపుటి. వీటి ప్రచురణ 1946–1948. ఆకాశవాణి కథలు మరో సంపుటి. కథకుడిగా కన్నా కవిగా ఎక్కువ చర్చల్లోకి వచ్చాడు. విష్ణు ధనువు, నవమి చిలుక ఆయన కవితాసంపుటాలు. అతి నవీనుల్లో నవీనుడు అనీ, కవిత్వంలో రౌడీవేషం అనీ, వ్యక్తిగత జీవితంలో అరాచకుడు అనీ అనిపించుకున్నాడు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితకు శిష్టా కవిత ‘మారో మారో మారో’ ప్రేరణ అని శ్రీశ్రీయే చెప్పుకున్నారు. శిష్టా జనన మరణ తేదీల్లో (1909–1953) కొంత సంశయాలు ఉన్నప్పటికీ చిన్న వయసులోనే మరణించాడన్నది మాత్రం విషాదకరంగా నిస్సంశయం. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా