అమ్మ.. బ్రహ్మ

22 Dec, 2019 00:04 IST|Sakshi

స్త్రీ వైశిష్ట్యం–21

అమ్మ పరబ్రహ్మం. వేదం అందుకే ‘మాతృదేవోభవ’ అంటూ మొదటి నమస్కారం అమ్మకే చేయించింది. అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రిని పరబ్రహ్మంగా చెప్పడం చాలా కష్టం. నమశ్శంకరాయచ..అంది యజుర్వేదం. అన్నివేళలా బిడ్డల సుఖం కోసం ఆరాటపడతాడు కనుక ఈ భూమిమీద తిరుగాడుతున్న శివ స్వరూపం తండ్రి. అంతవరకే. కానీ తల్లి పరబ్రహ్మ స్వరూపం. బిడ్డ పుట్టడానికి తల్లి తన గర్భాన్ని గర్భాలయం చేస్తుంది. ఇంగ్లీష్‌ లో ఒక సామెత ఉంది. From womb to tomb, she is the most innocent lamb..అని. తల్లి కడుపు దగ్గరినుంచి సమాధి వరకు ఆమె స్పర్శ లేకుండా అసలు జీవనం సాగదు. అంత రాశీభూతమైన అమాయకత్వం. ఏ ప్రతిఫలాన్ని కోరదు. అమ్మ దగ్గర పిల్లలు సేదదీరినట్లుగా లోకంలో మరెక్కడా సేదదీరలేరు. అందుకే శంకరాచార్యులంతటివాడు అయ్యవారి స్తోత్రం చేస్తూ ‘శివానంద లహరి’ అని, అమ్మవారి దగ్గరకు వచ్చేసరికి ‘సౌందర్యలహరి’ అన్నారు తప్ప ‘అంబానంద లహరి’ అనలేదు.సౌందర్యం.. అన్నమాటకు అర్థం బాహ్యంలో శరీరంలో ప్రకాశించే అందం కాదు.

అది ఈవేళ ఉంటుంది. ఒక దుర్ఘటన జరిగితే పోతుంది. అందుకే –‘‘మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా’’ అని అంటారు శంకర భగవత్పాదులు. అమ్మది అందం కాదు...సౌందర్యం. అది ఎంత వయసొచ్చినా పెరుగుతుంది తప్ప తరిగేది కాదు. అమ్మ కడుపులో ఉండగా నాభీ బంధం. అమ్మ తాను తిన్న అన్నసారాన్ని నాభిద్వారా బిడ్డకు అందిస్తుంది. కడుపులోంచి బిడ్డ బయటకు వచ్చిన తరువాత నాభి కోస్తారేమోకానీ హృదయబంధం అలాగే నిలబడి పోతుంది. ఈమె నా తల్లి. వీడు నా బిడ్డడు. ఆ సంబంధం పోదు. చిట్టచివరకు  ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, నాగ, కుర్మ, క్రౌకార, ధనంజయ, దేవదత్తములనబడే పది వాయువులలో వ్యాన వాయువు శిథిలమైన ఆస్తిమీద యాజమాన్యపు హక్కు పెట్టుకున్నట్లు శరీరాన్ని ఆశ్రయించి ఉండిపోతుంది...అంటే ఏదో పాడుపడిపోయిన ఒక భవనం ఉంది.

దాన్ని ఎవరయినా ఛటుక్కున అమ్మేస్తారేమోనని ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక ఫలకం పెట్టినట్లు... శరీరంలోంచి జీవుడు వెళ్లిపోయినా ఈ శరీరం నాది అని ఒక అభిమాన దేవత ఉండిపోతుంది. అదెప్పుడు పోతుందో తెలుసా... కడుపున పుట్టిన కొడుకు శ్మశానంలో ఆనంద హోమం చేసి ‘‘పిచ్చి అమ్మా! ఈ శరీరం జర్జరీభూతం అయిపోయింది, ముసలిది అయిపోయిందమ్మా ... ఎందుకూ సహకరించదు. దానిలో ఎందుకుంటావ్‌... మా మీద మమకారంతో కదూ... అమ్మా, మేం యోగ్యమైన మార్గంలో నడుస్తున్నాం. నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలో ప్రవేశించు’’–అని కొడుకు ప్రార్థన చేస్తే వ్యాన వాయువు వదిలిపెడుతుంది. అంటే అమ్మకూ, బిడ్డలకూ ఉండే అనుబంధం ఎంత గాఢంగా ఉంటుందో చూడండి.

మాతృత్వంలో ఉండే అద్భుతం అటువంటిది. ఆమె పడని కష్టం ఉండదు. కాలు ఎక్కడ జారుతుందేమో నన్న భయంతో లోపల పెరుగుతున్న పిండంపట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటుంది. లోపల భయంకరమైన పంజరం తయారయి సప్తధాతువులు–చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ ఏర్పడు తుంటే... జీవుడు అందులో ప్రవేశిస్తుంటే... కాలు పెట్టి పిల్లవాడు లోపల కడుపులో తంతే... కిలకిలా నవ్వుతూ.. తన అమ్మతో–‘‘చూడమ్మా!  ఇక్కడ వాడు తంతున్నాడమ్మా’’ అని పొంగిపోతుంటుంది. ఫలితం ఆశించని అమ్మ– ‘సౌందర్యం’ అన్న మాటకు పర్యాయపదమయింది.

మరిన్ని వార్తలు