బ్రహ్మోత్సవ భైరవుడు

17 Nov, 2019 05:43 IST|Sakshi

ఇసన్నపేటలో నేటి నుంచి ఉత్సవాలు

‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమగల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేస్తాడని నమ్మకం. అందుకే నిత్యం భక్తుల తాకిడితో ఇసన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది.

దిగంబరునిగా కాలభైరవుడు...
ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. మూల విగ్రహం ఎçప్పటిదో కచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. క్రీ.శ 13వ శతాబ్దంలో జైన మతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని, అందుకే దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. ఇసన్నపల్లి గ్రామం ప్రారంభంలోనే శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఉంటుంది. అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడు గ్రామాన్ని రక్షిస్తుంటారని నానుడి. ఈ అష్టభైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాలప్రవాహంలో కనుమరుగైపోయాయి. గ్రామానికి కొద్దిదూరంలోని కాశిపల్లిలో విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందు భాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం ఉన్నాయి.

ఇలా రామారెడ్డి గ్రామం చుట్టు కాశీ (కాశిపల్లి), రామేశ్వరం (రామేశుని కుంట) ఇలాంటి పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవస్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకుని నిరంతరం గ్రామాన్ని, భక్తులను ర„ì స్తుంటాడని స్థలపురాణం. శ్రీ కాలభైరవస్వామి ఆలయంలో ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద గల పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే వారికి అన్నిరకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. నిత్య పూజలతో పాటు ప్రతీ మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి కార్తికమాసంలో స్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.  

 బ్రహ్మోత్సవ క్రమ మిది..
 ఆదివారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంతతధారాభిషేకం, అగ్నిప్రతిష్ట, గణపతిహోమం, రుద్రహవనం, బలిహారణం అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. 18న లక్షదీపార్చన, 19న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, 20 న ధ్వజారోహణ, మహాపూజ, సింధూరపూజ, డోలారోహణం, అన్నదానం, సాయంత్రం ఎడ్ల బళ్ల ఊరేగింపు, రాత్రి భద్రకాళిపూజ, పల్లకీసేవ, రథోత్సవాలు జరుగుతాయి. 21న అగ్నిగుండాలు నిర్వహిస్తారు.
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి, ఫొటోలు: అరుణ్‌

మరిన్ని వార్తలు