ఒత్తిడితో మెదడుపై పెనుప్రభావం..

26 Oct, 2018 13:16 IST|Sakshi

లండన్‌ : మధ్యవయస్కుల్లో ఒత్తిడితో మెదడు కుచించుకుపోయి జ్ఞాపక శక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో ఒత్తిడి హార్మోన్‌ కార్టిసోల్‌ ప్రభావంతో మెదడు కుచించుపోతున్నట్టు గుర్తించారు. ఒత్తిడి హార్మోన్‌ అత్యధికంగా విడుదల కావడం మున్ముందు డిమెన్షియా ముప్పుకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి ప్రజల ఆలోచనా ధోరణిని కూడా ప్రభావితం చేస్తుందని జర్నల్‌ న్యూరాలజీలో ప్రచురితమైన హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ అథ్యయనం వెల్లడించింది.

పరిశోధన కోసం 49 ఏళ్ల సగటు వయసు కలిగిన 2231 మందిని డాక్టర్‌ జస్టిన్‌ నేతృత్వంలో శాస్త్రవేత్తలు పరీక్షించారు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ డిమెన్షియా ప్రారంభ లక్షణాలైన మెదడు కుచించుకుపోవడం, జ్ఞాపకశక్తి మందగించడాన్ని ఆయా వ్యక్తుల్లో తమ పరిశోధనలో భాగంగా గుర్తించామని డాక్టర్‌ జస్టిన్‌ వెల్లడించారు.

తగినంత నిద్ర, సరైన వ్యాయామం, ఆహ్లాదంగా గడపటం వంటి చర్యలతో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రజలు చొరవ చూపాలని సూచించారు. అవసరమైతే ఒత్తిడిని పెంచే కార్టిసోల్‌ను నియంత్రించే మందులను వైద్యులను సంప్రదించి తీసుకోవాలన్నారు. కార్టిసోల్‌ అధికంగా విడుదలయ్యే రోగుల పట్ల వైద్యులు తగిన శ్రద్ధ చూపాలని సూచించారు.

మరిన్ని వార్తలు