బలవర్ధకమైన ఆహార ధాన్యం

29 Apr, 2017 01:22 IST|Sakshi
బలవర్ధకమైన ఆహార ధాన్యం

తిండి గోల

భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో గోధుమలు ఒకటి. భారతదేశంతోబాటు చైనా, అమెరికా, రష్యాలలో కూడా గోధుమలను విస్తారంగా పండిస్తారు. గోధుమలను, గోధుమపిండిని ప్రపంచ వ్యాప్తంగా వాడతారు. కొన్ని దేశాలలో అయితే గోధుమలే వారి ప్రధాన ఆహారం. మనదేశంలో దీన్ని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండిస్తారు. పండిన దానిలో వారే ఎక్కువగా వినియోగిస్తారు. కారణం గోధుమ పిండితో చేసిన రొట్టెలు వారి ప్రధాన ఆహారం. గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడతారు. ఇళ్ల పైకప్పుగా వాడతారు. గోధుమ గడ్డి నుంచి తీసిన రసం ఆరోగ్యానికి చాలా మంచిది.

గోధుమ రవ్వతో ఉప్మా చేస్తారు. లడ్డూలు కూడా  చేస్తారు. బ్రెడ్‌ తయారీకి కూడా గోధుమలే వాడతారు. అంతేకాదు, అత్యంత బలవర్ధకమైన ఆహారం గోధుమలు. ఎదిగే పిల్లలకు గోధుమలు ఎంతో ఉపయోగపడతాయి. ఎముకల పెరుగుదలకు, రక్తహీనతకు, మలబద్ధకానికి ఆయుర్వేదంలో గోధుమలను ఉపయోగించి రకరకాల ఔషధాలను తయారు చేస్తారు. గోధుమలలో బీకాంప్లెక్స్‌ విటమిన్లు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉంటాయి. గోధుమ లడ్డూలు ఎంతో రుచికరమైన చిరుతిండి. భిన్నమైన వాదనలు వినిపిస్తున్నప్పటికీ బరువు తగ్గాలనుకునేవారు ఒకపూట అన్నం తినడం మాని గోధుమ రొట్టెలను తినడం మనకు అనుభవంలో ఉన్నదే. గోధుమలను నూనె లేదా నీరు లేకుండా ఒక మూకుడులో వేసి మాడ్చి చూర్ణం చేసి పూటకు పదిగ్రాముల చొప్పున రోజూ రెండుపూటలా తేనెతో కలిపి తింటూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయని ఆయుర్వేద వైద్యచిట్కా.

మరిన్ని వార్తలు