కల్లోల కడలి తరంగం

13 Jun, 2018 00:03 IST|Sakshi

పోరాట పటిమ

ఇరోమ్‌ ఛాను షర్మిల! మణిపూర్‌ ఉక్కు మహిళ. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాలను (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్స్‌) రద్దు చేయాలంటూ 16 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు నిరాహారదీక్ష చేసిన యువతి, పౌరహక్కుల కార్యకర్త, రాజకీయ నాయకురాలు, కవయిత్రి ఇలా భిన్న భూమికలు పోషించిన వ్యక్తి. ఇప్పుడు సామాజిక సేవ చేసేందుకు జమ్మూ, కశ్మీర్‌కు పయనమవుతామంటున్నారు. అక్కడ మహిళా సాధికారత సాధన కోసం కృషి చేస్తామంటున్నారు. మళ్లీ నిరాహారదీక్ష జోలికి వెళ్లనని, దానికి బదులు మహిళలను చేరుకుని, సమకాలీన ప్రాముఖ్యం ఉన్న అంశాలపై చర్చలు కొనసాగిస్తానని చెబుతున్నారు.

ఇప్పుడిక భారత్‌ బోర్డర్‌కి
మణిపూర్‌లో మాదిరిగానే కశ్మీర్‌లోనూ భద్రతాదళాల ప్రత్యేక చట్టాలు అమలవుతున్నాయి. అందువల్లే అక్కడకు వెళ్లి కశ్మీర్‌ మహిళలకు వారి హక్కుల పట్ల అవగాహన, చైతన్యాన్ని కలిగించి ఈ నిరంకుశచట్టాలపై గళమెత్తేలా చేస్తానంటున్నారు షర్మిల. ‘‘కశ్మీర్‌లో వివిధ వయసుల్లోని మహిళలను కలుసుకుని వారి సమస్యలేమిటో తెలుసుకుంటాను. వాటికి పరిష్కారాలేమిటన్న దానిపై చర్చిస్తాను’’ అని ఆమె అంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదని, కేవలం ప్రజలనే కలుసుకుంటానని కూడా ఆమె స్పష్టం చేశారు. తన ఉద్యమం ద్వారా అక్కడి మహిళలు ప్రభుత్వాన్ని సరైన దిశలో కదిలించగలగాలన్నదే తన ఆశ, తాపత్రయమని అన్నారు.‘‘భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య సుదీర్ఘకాలం పాటు ఘర్షణలు కొనసాగడం బాధాకరం. పొరుగు దేశాలుగా స్నేహసంబంధాలుంటే బావుంటుంది.  ఈ రెండుదేశాల మధ్య శాంతిస్థాపనకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు తాను సిద్ధమే’’నని కూడా ఇరోమ్‌ ప్రకటించారు! 

ఓటమి మంచి అనుభవం!
ప్రత్యేక అధికారాల పేరిట సైనిక దళాలు ప్రజల హక్కులు హరించడాన్ని ఎలుగెత్తి చాటి, విస్తృత అధికారాలు కల్పించే ఈ చట్టాల రద్దు కోసం పోరాడిన ధీర వనితగానే షర్మిల గుర్తిండిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం నిరాహారదీక్ష చేసిన వ్యక్తిగా (ముక్కుకు అమర్చిన గొట్టం ద్వారా ఆహారం ) అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నా, రాజకీయ నాయకురాలిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రం ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి! ఈ ఎన్నికల ఫలితం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడం తప్పిదం కాదని, అదో మంచి అనుభవం కింద గుర్తుంచుకుంటానని షర్మిల అంటున్నారు. ‘నా రాష్ట్ర, దేశ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకుని వారిని నేరుగా కలుసుకునేందుకు ఇదొ సువర్ణావకాశం’ అంటారు తన ఈ రెండో ప్రస్థానం గురించి.  
‘ఓ మనిషిగా జీవించేందుకు, నేను కోరుకున్న హక్కుల సాధనకు కట్టుబడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాను. అందువల్లే నా మనుషులను, నా బంధువులను కాదని,  నేను పుట్టిన నేల, సొంత ప్రాంతాన్ని విడిచి వచ్చేశాను’ అంటారు షర్మిల. అంతేకాదు, ఇక ప్రతీరోజు నేను పాటలు పాడుతూ, కూనిరాగాలు తీస్తూ, స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం ప్రార్థిస్తాను అని కూడా ప్రకటించేశారు ఇరోమ్‌ షర్మిలా! ప్రస్తుతం ఆమె తరచు మణిపూర్, కశ్మీర్‌ల మధ్య ప్రయాణిస్తున్నారు. 

అన్నీ ఆశ్చర్యపరిచే నిర్ణయాలే!
2000 నవంబర్‌లో భద్రతాదళాల కాల్పులకు 10 మంది అమాయకులు బలికావడాన్ని నిరసిస్తూ అనూహ్యంగా ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నట్టు ప్రకటించి, పదహారేళ్ల పాటు కొనసాగించడం.. ఈ దీక్ష సందర్భంగా కన్నతల్లిని సైతం ఒకే ఒకసారి కలుసుకోవడం ఒక ఆశ్చర్యం! మాతృమూర్తిని పదే పదే కలిస్తే నిరాహారదీక్షపై తన ధృఢచిత్తం ఎక్కడ సడలుతుందోననే ఆమె భయం. అలాగే.. ఎంత సుదీర్ఘకాలం దీక్షలో కూర్చున్నా.. అంతే అకస్మాత్తుగా దీక్ష విరమించి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించడం, అందుకోసం రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం మరో ఆశ్చర్యం. పుట్టినగడ్డ అయిన మణిపూర్‌లో స్థానికుల హక్కుల పరిరక్షణకు వీరోచితంగా పోరాడి, ఆ నేలను  విడిచిపెట్టి తమిళనాడులోని కొడైకెనాల్‌కి వచ్చి స్థిరపడాలని అనుకోవడం, అదీ కూడా.. గోవా మూలాలున్న బ్రిటిష్‌–భారత సంతతికి చెందిన డెస్మండ్‌ కౌటిన్హొతో లేఖల ద్వారా ప్రేమలో వాళ్లిద్దరూ ప్రేమలో పడి అది పెళ్లికి దారితీయడం వరకు.. ఇలా షర్మిల జీవితంలోని ప్రతి మలుపు, ప్రతి నిర్ణయం ఆశ్చర్యం గొలిపేదే. 
– కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

మరిన్ని వార్తలు