నేను చెయ్యను

14 Oct, 2019 00:47 IST|Sakshi

చిన్నారి చేతన

రిథమ్‌కు పదేళ్లు. నాలుగో తరగతి చదువుతోంది. స్కూల్‌ నుంచి ఇంటికొచ్చి హోమ్‌ వర్క్‌ మొదలు పెట్టింది. పాఠ్యపుస్తకం చూసి రాసే హోమ్‌ వర్క్‌ కాదది. మ్యాథ్స్‌ టీచర్‌ ఇచ్చిన పట్టికను చూసి ఆన్సర్‌ రాయడం. అయితే హోమ్‌వర్క్‌లోని ఒక ప్రశ్న రిథమ్‌కు నచ్చలేదు. నచ్చకపోవడం ఏంటి? టీచర్‌ చెప్తే చెయ్యాల్సిందే కదా! కానీ చెయ్యకూడదు అనుకుంది. చెయ్యకపోవడం తప్పు కాదు, చేస్తేనే తప్పు అని కూడా అనుకుంది. ఆ వయసు పిల్లకు తప్పొప్పులు తెలుస్తాయా! తెలిశాయి.

ఇంతకీ ప్రశ్న ఏమిటంటే.. ‘ఈ పట్టికలో ఇచ్చిన ముగ్గురు విద్యార్థుల బరువులను బట్టి ఆ ముగ్గురిలో అందరికన్నా తక్కువ బరువు ఉన్న అమ్మాయి కన్నా, అందరిలోకీ ఎక్కువ బరువు ఉన్న అమ్మాయి బరువు ఎంత ఎక్కువో కనుగొనుము?’ అని. ఆ ప్రశ్న చూసి అంత చిన్నపిల్లకూ చికాకు వేసింది. ఆడపిల్లల బరువుతో లెక్కలేమిటి? అనుకుంది. అదే విషయాన్ని క్లాస్‌ టీచర్‌కు లేఖరూపంలో రాసింది.‘‘డియర్‌ షా టీచర్‌.. సారీ. నా ప్రవర్తన దురుసుగా ఉందని భావించకండి. నేను ఈ క్వొశ్చన్‌ను సాల్వ్‌ చెయ్యడానికి ఇష్టపడటం లేదు. ఆడపిల్లల బరువులతో మ్యాథ్స్‌లో ఒక క్వొశ్చన్‌ ఉండటం బాగోలేదనిపించింది.

అందుకే చెయ్యడం లేదు. – ప్రేమతో.. మీ రిథమ్‌.ఈ ‘ప్రేమ లేఖ’ను, ఆ ‘బరువైన’ ప్రశ్నను రిథమ్‌ వాళ్ల మమ్మీ తీసుకొచ్చి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతకంటే ముందు కూతురి బుగ్గపై చిన్న ముద్దు కూడా పెట్టింది. ‘యూ ఆర్‌ మై లిటిల్‌ హార్ట్‌’ అంటూ..! రిథమ్‌ యు.ఎస్‌. అమ్మాయి. అక్కడి ముర్రే ప్రాంతంలోని ‘గ్రాంట్‌ ఎలిమెంటరీ స్కూల్‌’లో చదువుతోంది. చూస్తుంటే చిన్నవయసులోనే స్త్రీపురుష అసమానత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించే కార్యకర్త అయ్యేలా ఉంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా