ఇంజనీర్‌ అవుతా

5 Sep, 2019 07:49 IST|Sakshi
స్పేస్‌ క్విజ్‌ విజేత ప్రగడ కాంచనబాల శ్రీవాసవి

గురు కృష్ణ

కాంచన బాలశ్రీని స్పేస్‌ క్విజ్‌కు ప్రోత్సహించిన గురువు కృష్ణారావు

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని ఈదులవలస ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ప్రగడ కాంచనబాల శ్రీవాసవి ఇస్రో నిర్వహించిన జాతీయస్ధాయి స్పేస్‌క్విజ్‌లో ఎపీలోనే ప్రథమ స్ధానం దక్కించుకుంది. ఇరవై ప్రశ్నలకు కేవలం పది నిమిషాల్లోనే సమాధానాలు ఇచ్చి ఇస్రో దృష్టిని ఆకర్షించింది దాంతో ఈనెల 7వ తేదీన ఇస్రో ‘రోవర్‌’ చంద్రుడి మీదకు దిగుతున్న దృశ్యాన్ని ప్రత్యక్ష ప్రసారంలో బెంగుళూరు పరిశోధనా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీతో కలసి వీక్షించే అవకాశం ఆమెకు లభించింది. ఆ అపురూపమైన ఘడియలను చూసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించడం కోసం ‘ఇస్రో’ తలపెట్టిన క్విజ్‌ కు సంబంధించిన సర్క్యులర్‌ జూలైలోనే ఏపీ మోడల్‌ స్కూళ్లకు అందింది. ఆ మేరకు ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్విజ్‌ నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటన వెలువడింది. ఆగస్టు పది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ ఆన్‌లైన్‌ క్విజ్‌ కొనసాగింది. ఈదులవలస ఆదర్శ పాఠశాల నుండి నలభై మంది విద్యార్థులు క్విజ్‌లో పాల్గొనగా కాంచన బాలశ్రీ రాష్ట్రం నుండి ప్రధమ విజేతగా నిలిచింది. తనకు లభించిన అరుదైన అవకాశం గురించి చెబుతూ భవిష్యత్తులో తను ఇంజనీరు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. చిన్నపుడే తండ్రి గోవిందరావును కోల్పోయిన కాంచనబాలశ్రీ ని తల్లి తేజేశ్వరి చదివిస్తోంది. కాంచనకు హారతి అనే చెల్లి కూడా వుంది.– చింతు షణ్ముఖరావు, సాక్షి, పోలాకి

అటల్‌ ల్యాబ్‌తో మరింత సౌకర్యం
గతేడాది మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మా పాఠశాలకు ‘అటల్‌ల్యాబ్‌’ను మంజూరు చేసింది. దీంతో భౌతికశాస్త్రం పట్ల విద్యార్థులలో ఆసక్తి కలుగుతోంది. కాంచన బాలశ్రీ భౌతికశాస్త్రంపై మక్కువ చూపించే విద్యార్థి. ఆమెకు ఉన్న ఆ మక్కువే ఆమెను ఇస్రో నిర్వహించిన జాతీయ స్ధాయి స్పేస్‌క్విజ లో విజేత అయ్యేలా చేసింది. – బి. కృష్ణారావు, భౌతికశాస్త్ర అధ్యాపకుడు, ఈదులవలస ఆదర్శ పాఠశాల

మరిన్ని వార్తలు