స్నాక్స్‌తో ఆ రిస్క్‌ అధికం..

12 Sep, 2018 11:25 IST|Sakshi

లండన్‌ : లంచ్‌, డిన్నర్‌ మధ్యలో తరచూ స్నాక్స్‌ తీసుకుంటే ఆరోగ్యం, జీవితకాలంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏజింగ్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఎలుకలపై చేపట్టిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. తరచూ ఆహారం తీసుకున్న ఎలుకలతో పోలిస్తే ఆహారాల మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉన్న ఎలుకలు మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్టు తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు.

మీల్స్‌ మధ్య ఏ ఆహారం తీసుకోని ఎలుకలు వయసు సంబంధిత వ్యాధులను దీటుగా ఎదుర్కొంటున్నాయని, రోజుకు ఒక పూట ఆహారం తీసుకునే ఎలుకల్లో అత్యధిక జీవనకాలం నమోదవుతోందని తెలిపారు. ఆహారాన్ని ఒకేసారి తీసుకోకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలనే వైద్య నిపుణుల సూచనకు భిన్నంగా ఈ అథ్యయనం సరికొత్త అంశాన్ని ముందుకుతెచ్చింది.

రోజుకు ఒక పూట ఆహారం తీసుకున్న ఎలుకలు దీర్ఘకాలం జీవించడంతో పాటు వయోభారంతో వచ్చే వ్యాధుల బారిన పడటం అరుదని, వీటిలో జీవక్రియల వేగం కూడా మెరుగ్గా ఉందని తమ పరిశోధనలో వెల్లడైందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ ఏజింగ్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ జే హోడ్స్‌ తెలిపారు. ఈ అథ్యయన వివరాలు సెల్‌ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు