యాంటీబయాటిక్స్‌తో స్ధూలకాయం

31 Oct, 2018 19:12 IST|Sakshi

లండన్‌ : యాంటీబయాటిక్స్‌ వాడకంతో వాటిల్లే అనర్ధాలపై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో చిన్నారులు ముఖ్యంగా రెండేళ్లలోపు పిల్లలకు యాంటీబయాటిక్స్‌ మరింత ప్రమాదమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. నవజాత శిశువులు, రెండేళ్లలోపు చిన్నారులకు యాంటీబయాటిక్స్‌ ఇస్తే భవిష్యత్‌లో వారిని ఊబకాయం వెంటాడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలం వీటిని తీసుకుంటే ఒబెసిటీ ముప్పు మరింత పెరుగుతుందని పేర్కొంది.

బాలికలకు నాలుగైదు రకాల యాంటీబయాటిక్స్‌ ఇస్తే వారు మున్ముందు స్ధూలకాయంతో బాధపడే పరిస్ధితి 50 శాతం అధికమని అంచనా వేసింది. రెండేళ్ల పాటు పిల్లలకు యాంటీబయాటిక్స్‌ రిఫర్‌ చేస్తే వారు స్ధూలకాయం బారిన పడే ముప్పు 26 శాతం పెరుగుతుందని పేర్కొంది. మూడు లక్షల మందికి పైగా పిల్లలపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీబయాటిక్స్‌ తీసుకున్న వారిలో దాదాపు 47,000 మంది పిల్లలు ఆ తర్వాత అనూహ్యంగా బరువు పెరిగారని పరిశోధనలో తేలింది.

శరీర బరువును నియంత్రించే  కీలక బ్యాక్టీరియాను ఈ శక్తివంతమైన ఔషధాలు నాశనం చేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. జలుబు వంటి చిన్న అనారోగ్యాలకు సైతం పిల్లలకు అనవసరంగా యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారని అథ్యయనానికి నేతృత్వం వహించిన మేరీల్యాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌కు చెందిన డాక్టర్‌ కేడ్‌ న్యూలాండ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల్లో ఊబకాయంతో మున్ముందు వారు రక్తపోటు, మధుమేహం, గుండె సమ‍స్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యాంటీబయాటిక్స్‌ను పిల్లలకు అత్యవసరమైతే తప్ప సిఫార్సు చేయరాదని పరిశోధకులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు