పుతిన్‌కు సబ్‌చెక్‌

22 Jan, 2018 01:40 IST|Sakshi

ఆమె రాబోయే ఎన్నికలలో పుతిన్‌ను ఢీకొనబోతోంది. కొందరు ఆమెను గ్లామర్‌ డాల్‌ అంటున్నారు. కొందరు భవిష్యత్‌ తేజం అని భావిస్తున్నారు. ఎదిరించడం గొప్ప లక్షణం. మేరు పర్వతాన్ని తొలిచే పని కూడా తొలి గునపం పోటుతోనే మొదలవుతుంది. సెనియా సబ్‌చెక్‌ రష్యాలో పుతిన్‌ ప్రాభవానికి చెక్‌ పెడుతుందా?

రష్యా మారిపోతోంది. చరిత్రకు సరైన వైపు ఉండాలనుకునే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను. – సెనియా సబ్‌చెక్‌

సెనియా సబ్‌చెక్‌! రష్యా రాజకీయాలపట్ల ఆసక్తి ఉన్న వాళ్లందరి దృష్టిని మరల్చిన పేరు. గ్లామర్‌ వరల్డ్‌తో పరిచయం ఉన్నవాళ్లకైతే ఆమె సుపరిచితురాలు. ఫ్యాషన్‌ షోలు నిర్వహించి ఆ రంగంలో పేరు సంపాదించింది.  అన్నిటికన్నా టీవీ యాంకర్‌గా చాలా ఫేమస్‌. టి.ఎన్‌.టి. చానల్‌లో ప్రసారమైన ’ఈౌఝ 2’ కు హోస్ట్‌గా ఆమె తొలి గుర్తింపు పొందింది.  బిగ్‌బ్రదర్‌కు డర్టీ వర్షన్‌ అని ఈ షోకి పేరు. ఎమ్‌టీవీ రష్యాలో  ఓపెన్‌ డిబేట్‌ ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేసింది.

ఫస్ట్‌ ఎపిసోడ్‌ ‘వేర్‌ ఈజ్‌ పుతిన్‌ లీడింగ్‌ అస్‌?’ బ్రçహ్మాండమైన రేటింగ్‌ సంపాదించింది. దాంతో సెనియా తనే సొంతంగా  ‘టీవీరెయిన్‌’ అనే చానల్‌ను ప్రారంభించింది. ఇవన్నీ ఆమెకు రష్యాలో ప్రాచుర్యం కల్పించాయి. ఇక తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రష్యా అధ్యక్షపదవికి పోటీ చేయనున్నట్టు ఇచ్చిన ప్రకటన, ఆ విధంగా ఆమె పుతిన్‌కు విసిరిన చాలెంజ్‌  సెనియాను ప్రపంచమంతా పాపులర్‌ అయ్యేలా చేసింది.

నచ్చిన వాళ్లు శభాష్‌ అన్నారు. గ్లామర్‌డాల్‌కి పాలిటిక్స్‌ ఏంటీ అనుకున్నవాళ్లు నవ్వుకున్నారు. కొందరు రాజకీయ పండితులు పెదవి విరిచారు. ఎవరు ఏమనుకున్నా తనను తాను ‘ఎగైనెస్ట్‌ ఆల్‌’గా బ్రాండింగ్‌ చేసుకుంటోంది. ఈ మాత్రమైనా గొంతెత్తి నిలబడేవాళ్లు ఉండాలి కదా అని ఎక్కువ మంది ఆమె వైపు మురిపెంగా చూస్తున్నారు.


రాజకీయ నేపథ్యం
సెనియా సబ్‌చెక్‌ ఎవరో కాదు... పుతిన్‌ రాజకీయ గురువు అనటోలీ సబ్‌చెక్‌ పుత్రిక. అనటోలీ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ మేయర్‌. తల్లి ల్యూదిమిలా నరుసోవా కూడా పొలిటీషియనే. వీళ్ల రెండో సంతానమే సెనియా. చిన్నప్పటి నుంచీ రాజకీయ వాతావరణంలోనే పెరిగినా 35 ఏళ్లు వచ్చేవరకు వాటి జోలికి పోలేదు ఆమె. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో డిగ్రీ చదివింది. ఆ తర్వాత మాస్కోలో పాలిటిక్స్‌లో పీజీ చేసింది. టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి, యాక్టర్‌గా కూడా పని చేసి పొలిటికల్‌ జర్నలిస్ట్‌గా టర్న్‌ తీసుకుంది. సామాజిక కార్యకర్తగానూ బాధ్యతలు నిర్వహిస్తోంది.

తొలి నిరసనోద్యమానికి ప్రతీక
ఉన్నట్టుండి సెనియాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? దీనికి ముందు కొంత కథ జరిగింది. రష్యా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డాడని పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు జరిగాయి. అందులో పాల్గొంది సెనియా. అయితే పుతిన్‌కు వ్యతిరేకంగా పెద్దగా నినాదాలేమీ ఇవ్వలేదు. కానీ తొలి నిరసనోద్యమానికి ప్రతీకగా పేరు తెచ్చుకుంది. ఆ ర్యాలీలతోనే పుతిన్‌ పాలన, ప్రస్తుత రష్యా రాజకీయాలపట్ల అవగాహన పెంచుకుంది. ‘రష్యా మారిపోతోంది. చరిత్రకు సరైన వైపు ఉండాలనుకునే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నాను’ అని చెప్తుంది సెనియా.

మరి తన తండ్రికి ఆప్తుడైన పుతిన్‌కు వ్యతిరేకంగానా... అని అడిగితే.. ‘నా జీవితంలో పుతిన్‌కు ఎలాంటి రోల్‌ లేదు. అతనో అస్పష్టమైన జ్ఞాపకం అంతే. 24 గంటలు ఆయన మా నాన్నతో ఉన్నా నేనెప్పుడూ ఆయనను పట్టించుకోలేదు. మా నాన్నకు ఆయన ఆప్తుడే కావచ్చు కాని నాకు తెలిసి... నాన్న అత్యంత సన్నిహిత వర్గంలో పుతిన్‌ ఎప్పుడూ లేడు. ఎప్పుడూ చేతిలో ఏవో ఫైల్స్‌తో వచ్చేవాడు. వచ్చీరాగానే నాన్న ఆఫీస్‌ గదిలోకి వెళ్లేవాడు.

పుతిన్‌తో కలిసి మేం హాలీడేస్‌ స్పెండ్‌ చేసిందీ లేదు. ఓ రెండుసార్లనుకుంటా ఆయనతో కలిసి మేం వెళ్లింది. అదీ ఫిన్‌లాండ్, టర్కీకి. అంతేతప్ప ఆయన దగ్గర కూర్చొని కథలు, కబుర్లు విన్న అద్భుతమైన జ్ఞాపకలేవీ మాకు లేవు. అసలు ఆయన అలాంటి ఎమోషన్స్‌ ఉన్న మనిషే కాడు. నా దృష్టిలో ఆయనొక యంత్రం. తాను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించగల సమర్థుడు’ అని చెప్తుంది. ధరలు సామాన్యులకు అనుకూలంగా ఉండాలని సెనియా భావిస్తోంది. స్త్రీ, పురుషులు సమానమైన పని చేస్తున్నప్పుడు వేతనమూ సమానంగానే ఉండాలన్న వాదన ఆమెది. సెనియా స్త్రీ పక్షపాతిగానూ గుర్తింపు పొందింది. ఎల్‌జీబీటీ హక్కుల కోసం కూడా తన గళం వినిపిస్తోంది.

ఆమె అంతర్జాతీయ అవగాహన ప్రకారం ఉక్రెయిన్, సిరియాల్లో రష్యా మిలిటరీ జోక్యం సరికాదని భావిస్తోంది. తన పొలిటికల్‌ హీరో మార్గరెట్‌ థాచర్‌ అంటుంది. ‘కష్టపడి పనిచేసే తత్వం థాచర్‌ సొంతం. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లను ఏనాడూ  పట్టించుకోలేదు. తను నమ్మినదాన్ని ఆచరించిన ఐరన్‌ లేడీ’ అంటూ మార్గరేట్‌ థాచర్‌ మీదున్న తన అభిమానాన్ని చాటుకుంది. ‘నేను పోటీ చేస్తే నా ప్రత్యర్థులకు ముఖ్యంగా వ్లాదిమిర్‌ పుతిన్‌కు వ్యతిరేక ఓట్లు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది’’ అని నమ్ముతోంది సెనియా సబ్‌చెక్‌.  

ప్రీపోల్‌ రిజల్ట్స్‌
అయితే ఒక సంస్థ సెనియాకు మద్దతు ఇస్తున్నవాళ్ల గురించి సర్వే నిర్వహించింది. అందులో ఆమెకు కచ్చితంగా ఓటు వేయాలనుకుంటున్న వాళ్లు కేవలం ఒక శాతమేనట. తొమ్మిది శాతం మంది ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారట. పదిహేను నుంచి ఇరవై శాతం మంది ఆమెకు ఓటు వేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని సెనియా భావన.

క్రెమ్లిన్‌కు గ్లామర్‌
‘ఆమె అభ్యర్థిత్వం వల్ల క్రెమ్లిన్‌ భవనానికి మళ్లీ గ్లామర్‌ వచ్చినట్టే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న మరో రాజకీయ వారసత్వంగా పుతిన్‌ ఓట్లను చీల్చే సాధనంగా’ ఆమె గురించి విమర్శకులు అంచనాలు వేస్తున్నారు. ‘‘ఈ తరం భిన్నమైన రష్యాను కోరుకుంటోంది. నిజమైన ప్రజాస్వామ్యపాలనలో బతకాలనుకుంటోంది. మార్చిలో జరగబోయే ఎన్నికలు వాళ్ల ఆశను నెరవేరుస్తాయి’’ అని సెనియా సబ్‌చెక్‌ విశ్వాసం. తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. తీర్పు ఫలితం తెలియాలంటే ఈ మార్చి వరకు ఆగాలి... చూడాలి!!

– శరాది

మరిన్ని వార్తలు