సుబ్బారెడ్డి అంటే తెలంగాణవాడు కాదు!

10 Jun, 2019 03:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాహిత్య మరమరాలు
ముప్పయ్యేళ్ల కిందటి మాట. మిత్రుడు కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవితాసంపుటి ‘గుండె కింద తడి’ (ఏప్రిల్‌ 1987) ఆవిష్కరణ సభ మహబూబ్‌నగర్‌లో జరిగింది. ఆవిష్కర్త డాక్టర్‌ సి.నారాయణరెడ్డి. వక్తలు కె.శివారెడ్డి, ఎం.కె.సుగమ్‌ బాబు. నిర్వాహకులు కాతోజు, వేణు సంకోజు. ఆ రోజు హైదరాబాదు నుంచి నారాయణరెడ్డిగారి కారులో ఆయనతో పాటు శివారెడ్డి, సుగమ్‌ బాబు, వెంకటేశ్వరరెడ్డి, నేనూ మహబూబ్‌నగర్‌ వెళ్లాం. ఆ రెండు గంటల ప్రయాణంలో సినారె ఎంత సరదాగా, ఎన్ని కబుర్లు చెప్పారో! ఆయన మిమిక్రీ కూడా చేస్తారని అప్పుడే నాకు తెలిసింది. వెంకటేశ్వరరెడ్డి తన పుస్తకాన్ని ఆ ఊరిలోని నటరాజ్‌ థియేటర్‌ యజమాని ఎన్‌.పి.సుబ్బారెడ్డికి అంకితమిచ్చాడు. సభానంతరం సుబ్బారెడ్డి తన థియేటర్‌ లోని ఒక గదిలో సినారె, శివారెడ్డి, సుగమ్‌ బాబులకు ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. మా భోజనాలయ్యాక వెంకటేశ్వరరెడ్డీ, నేనూ ఆ గది బయటే నిరీక్షిస్తూ నిలబడ్డాం.

అప్పుడప్పుడు సుగమ్‌ బాబు సిగరెట్‌ తాగడానికి బయటికి వచ్చి, లోపలి విశేషాలు చెప్పి వెళ్లేవాడు. ‘మీరు ఈ ప్రాంతంవారు కావడానికి వీల్లేదే‘ అన్నారట నారాయణరెడ్డిగారు ఆ థియేటర్‌ యజమానితో. ‘ఎందుకు?’ అన్నాడట ఆయన. ‘సుబ్బారెడ్డి అనే పేరు తెలంగాణలో ఉండదు’ అన్నారట సినారె. అప్పుడాయన తను ఎక్కడి నుంచి వచ్చి మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డాడో చెప్పాడట. సుబ్బారెడ్డి, సుబ్బారావు, సుబ్బయ్య వంటి పేర్లు తెలంగాణలో ఉండవనే విషయం అప్పటిదాకా నాకు తెలీదు. రాత్రి దాదాపు పదకొండింటికి హైదరాబాదుకు తిరుగుప్రయాణం. వెంకటేశ్వరరెడ్డి నన్ను ఆ రాత్రికి అక్కడే ఉండిపొమ్మన్నాడు కాని నారాయణరెడ్డిగారు రమ్మనడంతో నేను కూడా బయలుదేరాను.

(జూన్‌ 12న సినారె వర్ధంతి.)
- గాలి నాసరరెడ్డి 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు