పిడకల వేట

22 Mar, 2016 01:43 IST|Sakshi
పిడకల వేట

 హ్యూమర్ ఫ్లస్
సుబ్బలక్ష్మి, సుబ్బారావు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ తర్వాత సీక్వెల్ యుద్ధమే. గాల్లోకి అనేక వస్తువులు లేవడం వల్ల సుబ్బారావు మూతి పచ్చడై మేకప్ అవసరం లేని హనుమంతుడిలా మారాడు. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న టీవీ వాళ్లపరుగులు తీశారు. తొక్కిసలాటలో కొందరు కెమెరావాళ్లు గాయపడ్డారు.


‘మేడమ్.. మీ మధ్య గొడవెలా ప్రారంభమైంది?’ అడిగారు.
 ‘కొబ్బరి చెట్నీ చేయమని చెప్పాను. కుదరదు పచ్చడైతే చేస్తానన్నాడు’.
‘అంటే వంట మీరు చేయరా?’.
 ‘అది మా ఇంటావంట లేదు. అందుకే ఆయనకి ఒంట పట్టించా’.
 ‘చెట్నీ, పచ్చడి రెండూ ఒకటే కదా’.
 ‘అది ఇంగ్లిష్. ఇది తెలుగు. నాది ఇంగ్లిష్  స్టయిల్’.
‘సుబ్బారావు గారూ.. మీరేమైనా చెబుతారా?’
 మూతికి, ముక్కుకి మధ్యనున్న బ్యాండేజ్‌లోంచి ‘కీ కిక్ కిర్’మని ఆయన ఏదో సౌండ్ చేశాడు.
‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్ భాషలో ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు మేడమ్. మీరు కొంచెం ట్రాన్స్‌లేట్ చేస్తారా?’.
 ‘రిలేషన్స్‌లో ట్రాన్స్‌లేషన్స్ తప్పవు. చింత చచ్చినా పులుపు చావలేదని సౌండిచ్చాడు’.
‘మీరు ఇంతలా చావబాదారంటే, మీ మధ్య పాతకక్షలేమైనా ఉన్నాయా?’
 ‘చావడం వేరు. బాదడం వేరు. రెంటిని సంధి చేయకండి. భార్యా భర్తల మధ్య సంధి ఉండదు. ఒకవేళ ఉన్నా అది దుష్టసంధి. ఒకసారి పెళ్లంటూ జరిగితే పాతకక్షలు ఎలాగూ తప్పవు. జ్యూరీ కంటే ఇంజ్యూరీ పవర్‌ఫుల్’.
 టీవీ వాళ్లు వచ్చారని పోలీసులొచ్చారు.
 ‘ఇంతకాలం హింస వీధుల్లోనే ఉందని అనుకున్నాం ఇప్పుడు ఇళ్లలోకి కూడా వచ్చింది. దీనికి పోలీసుల సమాధానమేంటో విందాం’.
 ‘శాంతిని భద్రంగా కాపాడడమే మా డ్యూటీ’.
 ‘శాంతా? ఆవిడెవరు?’ ఈ కేసుని మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు’.
 ఇన్‌స్పెక్టర్‌ని చూసి సుబ్బారావు ‘కకాకికీకై’ అని మూలిగాడు.
 ‘చిన్నప్పుడు నేర్చుకున్న క గుణింతం గుర్తుకు తెచ్చుకున్నాడంటే ఇతను కరుడు గట్టిన వ్యక్తని మా అనుమానం’.
 ‘పరుషములు సరళములైనా, సరళములు పరుషములైనా లా అండ్ ఆర్డర్‌ని కాపాడ్డమే మా విధి’’ - ఇన్‌స్పెక్టర్.
 ‘బాధ్యత గల అధికారిగా ఉండి కూడా విధి రాతని తప్పించలేమని వేదాంతం చెబుతున్నాడంటే ఈ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో మనకు తెలుస్తోంది’.
 ఇంతలో ఆ ఏరియా రాజకీయ నాయకుడొచ్చి..
 ‘ఈ ఏరియా నాది, ఇక్కడేం జరిగినా నేను చెప్పినట్టే ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. కొట్టుకోవడం భార్యాభర్తల డ్యూటీ, కవరేజీ మీ డ్యూటీ, అందరూ ఎవరి డ్యూటీలు వాళ్లు చేస్తూ ఉంటే ఇక మాకేం డ్యూటీ మిగిలిందో చెప్పండి’ అన్నాడు.
 మహిళా సంఘాల వాళ్లూ కూడా వచ్చారు.
 ‘స్త్రీకి పురుషుడు కనపడని హింస. పురుషుడికి స్త్రీ కనపడే హింస. హింసకి హింస సమాధానమంటే ఒప్పుకోం. హింస హింసో రక్షితః అన్నారు. అందువల్ల ఈ సుబ్బారావు తనని తానే గాయపరుచుకుని, బ్యాండేజీతో డామేజీ చేయాలని చూస్తున్నాడు’.
 సుబ్బారావు ఈసారి ‘కౌ కృ, కొ కో’ అని శబ్దం చేశాడు.
 ‘గాయపడి కూడా క్రూరమైన శబ్దాలు చేస్తున్నాడంటే ఇతను భార్యద్వేషి అని అర్థమౌతోంది’.
 ఇదే సమయానికి టీవీ స్టూడియోల్లో వివాహ వ్యవస్థ-ఒక అవస్థ అని చర్చావేదిక ప్రారంభమైంది. వాదం తీవ్రవాదమై నలుగురు వక్తలు, ఇద్దరు యాంకర్లు గాయపడ్డారు.
 మూడు రోజుల తర్వాత సుబ్బలక్ష్మి, సుబ్బారావు చెట్టాపట్టాలేసుకుని ట్యాంక్‌బండ్ పైన ముక్కు మూసుకుని నడుస్తూ కనిపించారు.
 ‘యూత్ డామేజ్‌డ్ బై లవ్ మ్యారేజి ప్రోగ్రాం టీవీల్లో ఇంకా వస్తూనే ఉంది.
 - జి.ఆర్.మహర్షి
 
 

మరిన్ని వార్తలు