కుటుంబం తోడ్పాటుతో క్యాన్సర్‌పై విజయం 

24 Jan, 2019 01:06 IST|Sakshi

క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ కాగానే మొదట డాక్టర్లు దాని తీవ్రతను అంచనావేస్తారు.  క్యాన్సర్‌ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం ‘టీఎన్‌ఎమ్‌’ అనే విషయాలను పరీక్షిస్తారు. ఈ ఇంగ్లిష్‌ పొడి అక్షరాల్లో ‘టీ’ అంటే ట్యూమర్‌ సైజ్, ‘ఎన్‌’ అంటే చుట్టుపక్కల ఉండే లింఫ్‌నోడ్స్, ఎమ్‌ అంటే పరిసరాల్లోని ఏయే భాగాలకు పాకిందని తెలుసుకునే ‘మెటాస్టాసిస్‌’. ఈ అంశాల ఆధారంగా క్యాన్సర్‌ ఏ దశలో ఉందో తెలుసుకుంటారు. క్యాన్సర్‌లో ‘0’ నుంచి ‘4’ వరకు దశలు ఉంటాయి. ’0’ అంటే క్యాన్సర్‌ ప్రారంభానికి ముందు దశ. ప్రారంభం అయిన దశను ‘స్టేజ్‌ 1’,  పెద్ద గడ్డ లింఫ్‌ గ్రంథులకు సోకితే ‘స్టేజ్‌ 2’ లేదా ‘స్టేజ్‌ 3’ అని, ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తే దాన్ని ‘స్టేజ్‌ 4’ అని నిర్ధారణ చేస్తారు. 

ఎన్నో రకాలు... ఎన్నో పేర్లు 
క్యాన్సర్‌ శరీరంలోని ఏ భాగానికి వచ్చిందో దాన్ని బట్టి ఆ పేరుతో పిలుస్తారు. అయితే వైద్య పరిభాషలో సాంకేతికంగా వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. ఉదాహరణకు  చర్మం మీద, అవయవాల లోపలి లేక బయటి పొరల మీద వచ్చే క్యాన్సర్‌ను కార్సినోమా అంటారు. ఎముకలు, రక్తనాళాలు, అవయవాలను కలిపే కనెక్టివ్‌ టిష్యూతో పాటు కండరాలలో వచ్చే క్యాన్సర్‌ను సార్కోమా అంటారు. రక్తకణాలలో, రక్తకణాలను తయారు చేసే ఎముక మజ్జలో వచ్చే క్యాన్సర్‌ను ల్యుకేమియా అంటారు. ఇక రోగనిరోధక వ్యవస్థను కాపాడే లింఫ్‌ నాళాల వంటి చోట్ల వచ్చే క్యాన్సర్‌ని లింఫోమా, మైలోమా అంటారు. ఇలా క్యాన్సర్స్‌లో కార్సినోమా, సార్కోమా, ల్యుకేమియా, లింఫోమా/సార్కోమా అని ప్రధానంగా నాలుగు రకాలుంటాయి. కొన్ని లక్షణాలను గమనించాక క్యాన్సర్‌ను నిర్ధారణ చేసే పరీక్షలను చేస్తుంటారు. ఎక్స్‌–రే, అల్ట్రాసౌండ్‌ స్కాన్, సీటీ స్కాన్, న్యూక్లియర్‌ స్కాన్, ఎమ్మారై, పెట్‌ స్కాన్, బయాప్సీ, రక్తపరీక్షలు, మలమూత్ర, కళ్లె పరీక్షల వంటివి అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. 

రకాన్ని బట్టి... తీవ్రతను బట్టి చికిత్స 
క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ జరిగితే వ్యక్తి వయసు, ఇతర ఆరోగ్య విషయాలను పరిగణనలోకి తీసుకొని ముందుగా సర్జరీ చేసి, ఇతర థెరపీలకు వెళ్తారు. ఒక్కోసారి ఇతర థెరపీల తర్వాత కూడా సర్జరీ చేస్తారు. చికిత్సలో భాగంగా సర్జరీ, కీమో, రేడియో, హార్మోన్‌ థెరపీలతో పాటు ఒక్కోసారి జీన్, బయొలాజికల్, ఇమ్యూనో వంటి అనేక థెరపీలు చేస్తారు. రక్త సంబంధిత క్యాన్సర్లు ఉన్నవారికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తారు. ఇటీవల వైద్యరంగంలోని పురోగతితో స్టెమ్‌సెల్‌ థెరపీ వంటివి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో ఏయే క్యాన్సర్లకు ఏయే తరహా చికిత్సలు అవసరం అన్నది అనేక విషయాల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక సర్జరీల విషయానికి వస్తే కోత తక్కువగా ఉండే లేజర్, కీహోల్‌ సర్జరీలు చేస్తున్నారు. అలాగే కీమోథెరపీలో క్యాన్సర్‌ కణాన్ని మాత్రమే ప్రభావితం చేసేలా టార్గెటెడ్‌ థెరపీ చేస్తున్నారు. రేడియేషన్‌లో ఆధునికమైన వీఎమ్‌ఏటీ రేడియేషన్, 3డీ రేడియేషన్‌ అందుబాటులో ఉన్నాయి. హార్మోన్‌లను ప్రభావితం చేసే హార్మోన్‌ థెరపీ కూడా ఇప్పుడు ఒక చికిత్సాప్రక్రియ. ఇక రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ క్యాన్సర్‌ కణాల పెరుగుదలకు అడ్డుకట్ట వేసే ఇమ్యూనోథెరపీ వంటి కొత్త కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. 

నివారణ సులభమే... 
మంచి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, యోగా, ధ్యానం, కాలుష్యాలకు దూరంగా ఉండటం వంటి మన చేతుల్లో ఉండే అంశాలతో చాలావరకు దీన్ని నివారించవచ్చు. అయితే చాలా కొద్దిరకాలలో మాత్రం క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రోగి బాధలను చాలావరకు తగ్గించి, వారి జీవననాణ్యతను మెరుగుపరచి, తక్కువ బాధతో జీవితాంతం గడిపేలా చేసే ప్రక్రియను ‘పాలివేటివ్‌ కేర్‌’ అంటారు. పాలియేటివ్‌ కేర్‌లో కొంచెం కణతి పరిమాణం, బాధలను తగ్గించడానికి మత్తు మందులతో పాటు కీమో, రేడియోథెరపీలు ఇస్తుంటారు. ఈ విభాగంలో మత్తు స్పెషలిస్టులు అయిన ఎనస్థిసిస్ట్, పెయిన్‌మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్, మెడికల్‌ ఆంకాలజిస్ట్, సర్జికల్‌ ఆంకాలజిస్ట్, డైటీషియన్, నర్సులు తమ సేవలు అందిస్తుంటారు. అయితే వారితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల భూమిక చాలా కీలకం. కచ్చితంగా నయం చేస్తామనే ప్రకటనలను నమ్మకండి‘క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించడానికి మా వద్ద కచ్చితమైన చికిత్సలున్నాయి‘ అంటూ చాలా రకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. వాటిని చూసి, నమ్మి, ఆచరించి రోగాన్ని ముదరబెట్టుకునే వాళ్లు చాలామంది ఉంటారు. ఏ వైద్యవిధానంలోనూ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే మందులు లేవు. సైంటిఫిక్‌గా కచ్చితమైన క్లినికల్‌ ట్రయల్స్‌తో సాగే అల్లోపతిలోనూ తొలిదశలో గుర్తిస్తేనే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. అందుకే అలాంటి బోగస్‌ ప్రకటనలను నమ్మకూడదు. ఇక క్యాన్సర్‌ కణాల మీద మాత్రమే పనిచేసే టార్గెట్‌ థెరపీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఆ మందులు చాలా ఖరీదైనవి కాబట్టి ఇప్పటికీ అందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మనిషి మనిషి ప్రవర్తనలో తేడాలున్నట్లే క్యాన్సర్‌ కణం కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తుంటుంది. వయసు, క్యాన్సర్‌ కణం ప్రవర్తించే తీరును బట్టి వ్యక్తిగత వైద్యచికిత్స ఉంటుంది. అనుసరించే చికిత్స విధానాలు, కీమో, రేడియో థెరపీలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండవు. కొందరిలో కొన్ని నెలలు పట్టే చికిత్స మరికొందరికి ఏడాది కూడా పట్టవచ్చు. 

కుటుంబం సహకారం అవసరం... 
చాలామంది, మరీ ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధికి గురైనప్పుడు చాలా తల్లడిల్లిపోతుంటారు. ఇల్లు, పిల్లలు ఏమైపోతారో అన్న వ్యధతో పాటు, తమ వైద్యానికి చాలా ఎక్కువగా ఖర్చవుతోందని, దాంతో కుటుంబంపై ఆర్థికభారం పడుతోందని మనోవేదనకు గురవుతుంటారు. వారికి డాక్టర్లు ఇచ్చే కౌన్సెలింగ్‌తో పాటు కుటుంబ సభ్యుల సహకారం చాలా ముఖ్యం. నిజానికి వీటిన్నింటికి మించి రోగి కుటుంబ సభ్యుల తోడ్పాటు, సహకారం తప్పనిసరి. మరీ చెప్పాలంటే... అన్నింటికంటే అదే ప్రధానం.

Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, 
Kurnool 08518273001

మరిన్ని వార్తలు