అంతటితో ‘ఆగ’లేదు! 

10 Mar, 2020 19:10 IST|Sakshi

‘పత్తి పండే వరకు అదే పని. సంక్రాంతి వెళ్లిన తర్వాత కూరగాయలు, ఆకుకూరలు పండిస్తా. బండి (మోపెడ్‌) మీద ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటా. ఇంకా ఖాళీ ఉంటే కూలి పనికి వెళ్తా. కాయకష్టంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నా. ఏ పంట టైములో ఆ పని చేస్తా.. పిల్లలను పోషించుకోవాలి, పెళ్లిళ్లు చేయాలి కదా.. ఎవరికీ భయపడనవసరం లేదు. మనమేమీ తప్పు చేస్తలేం కదా అని మా ఆయన చెప్పిన మాటలను ప్రతి రోజూ గుర్తుచేసుకుంటున్నా..’ ఇదీ ఒంటరి మహిళా రైతు తనుగుల ఆగమ్మ మనసులో మాట. జీవితంలో కష్టాలు కట్టగట్టుకొని ఎదురొచ్చినా చెక్కు చెదరని మనోధైర్యంతో నిలబడి, దృఢచిత్తంతో ముందడుగు వేస్తోంది.

ఆగమ్మ ములుగు జిల్లా బండారుపల్లిలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. చదువుకోలేదు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరుకు చెందిన పేద రైతు తనుగుల కుమారస్వామితో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వాళ్లకు ముగ్గురు ఆడ పిల్లలు.. ఆమని, కావ్య, శ్రావణి. వాళ్లకు చిన్న పెంకుటిల్లుతో పాటు ఎకరం 30 గుంటల (ఎకరం 75 సెంట్లు) భూమి ఉంది.  వర్షాధార వ్యవసాయమే. భార్యా భర్తలిద్దరూ కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో పెను విషాదం చోటు చేసుకుంది. మోపెడ్‌పై వెళ్తున్న కుమారస్వామిని రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు మింగేసింది. భర్త హఠాన్మరణం ఆగమ్మ ఆశలు చెదిరిపోయాయి. అయినా, పిల్లలను గుండెలకు హత్తుకొని దుఃఖాన్ని దిగమింగుకుంది. తనకు తానే ధైర్యం చెప్పుకొని మొక్కవోని ధైర్యంతో నిలబడింది. వ్యవసాయం కొనసాగిస్తూ కాయకష్టంతో పిల్లలను అన్నీ తానే అయి పోషించుకుంటున్నది. అన్నదమ్ములు లేకపోవడంతో.. వృద్ధులైన తల్లిదండ్రులను అవివాహితగా ఉండిపోయిన సోదరి పోషిస్తున్నది. దీంతో ఆగమ్మ పిల్లలతోపాటు మెట్టినింటిలోనే ఉండిపోయింది.  


సొంత భూమితో పాటు రెండెకరాలను కౌలుకు తీసుకొని మరీ పత్తి, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు శ్రద్ధగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు. తన పొలంలో ఏ పనీ లేకపోతే కూలికి వెళ్తుంది. రూపాయికి రూపాయి కూడబెట్టి ఎవరిపైనా ఆధారపడకుండా గత ఏడాది పెద్ద కుమార్తె ఆమనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. రెండో బిడ్డ కావ్య ముల్కనూరు మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదువుతోంది. చిన్న కుమార్తె శ్రావణి ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి లేకపోయినా ఆగమ్మ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది.

సొంత కష్టం.. సొంత మార్కెటింగ్‌..
కుటుంబ పెద్దగా, తల్లిగా, రైతుగా ఆగమ్మ విజయపథంలో పయనిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ విజయం వెనుక మొక్కవోని దీక్ష, కఠోర శ్రమ, క్రమశిక్షణతోపాటు చక్కని వ్యవసాయ ప్రణాళిక కూడా ఉంది. తన వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతులు చాలా మంది పత్తి, మొక్కజొన్న , పసుపు వంటి పంటలతో సరిపెట్టుకుంటూ ఉంటే.. ఆగమ్మ అంతటితో ఆగలేదు. ఆదాయం కోసం పత్తి, మొక్కజొన్నతో పాటు కుటుంబ పోషణ కోసం, అనుదిన ఆదాయం కోసం కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ ఉన్నంతలో సంతోషంగా, ధీమాగా జీవిస్తోంది. 


ఈ ఏడాది కౌలు భూమి రెండెకరాల్లో పత్తిని వర్షాధారంగా సాగు చేసింది. రూ. 70 వేలు ఖర్చు చేసి 12 క్వింటాళ్ల దిగుబడి తీసింది. పత్తిని రూ. లక్షకు అమ్మింది. ఎకరంలో మొక్కజొన్న, 30 గుంటల్లో పసుపు సాగు చేస్తోంది. పత్తి పంట అయిపోయిన తర్వాత 10 గుంటల (25 సెంట్ల) భూమిలో టమాటోలు, పాలకూర, కొత్తిమీర బావి కింద సాగు చేస్తోంది. ఎరువులు వేయటం, పురుగుమందు కొట్టడం, కలుపు తీయటం.. వంటి అన్ని పనులూ తానే చేసుకుంటుంది. టమాటోలు 15 రోజుల్లో కాపు మొదలవుతుంది. నెల రోజుల్లో చేతికొచ్చే పాలకూర, కొత్తిమీరతో నిరంతర ఆదాయం పొందుతోంది. ఆకుకూరలు, కూరగాయలను పండించడం తానే స్వయంగా ఊళ్లు, ఇళ్ల వెంట తిరిగి అమ్ముకుంటుంది. ద్విచక్రవాహనం(మోపెడ్‌)ను నడుపుకుంటూ వెళ్లి ఏ పూటకు ఆ పూట తాజా ఆకుకూరలు అమ్ముతుంది. కిలో కొత్తిమీర విత్తనాలు (ధనియాలు) రూ. వందకు కొనితెచ్చి విత్తుకొని రూ. రెండు నుంచి మూడు వేలు ఆదాయం పొందుతున్నానని, తాము ఇంట్లో వండుకోవడానికీ కూరగాయల కొరత లేదని సంతోషంగా చెప్పింది ఆగమ్మ. 

దురదృష్టవశాత్తూ భర్తలను కోల్పోయిన మహిళా రైతులే ఇంటి పెద్దలై వ్యవసాయాన్ని, కుటుంబాన్నీ సమర్థవంతంగా నడుపుతున్న ఎందరో మహిళల గుండె ధైర్యానికి చక్కని ప్రతీకగా నిలిచిన ఆగమ్మ(90142 65379)కు మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ జేజేలు! ఇటువంటి క్రమశిక్షణ గల రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పితే వారి జీవితాలు మరింత జీవవంతమవుతాయి!!
– పోలు రాజేష్‌కుమార్,
సాక్షి, ఆత్మకూరు, వరంగల్‌ రూరల్‌ జిల్లా

>
మరిన్ని వార్తలు