ఎత్తిపొడుపులకు కత్తెర

6 Mar, 2019 00:17 IST|Sakshi

ఫిమేల్‌ స్టెయిలిస్ట్‌

మగవాళ్ల హెయిర్‌ కటింగ్‌కి బ్రాండ్‌ ఇమేజ్‌గా నిలిచిన ఒక మహిళ సక్సెస్‌ స్టోరీ ఇది. అయితే ఈ స్టోరీ వెనుక ఆమె సక్సెస్‌ కన్నా, స్ట్రగులే ఎక్కువగా ఉంది. సక్సెస్, స్ట్రగుల్‌తో పాటు.. కులమతాలకు అతీతంగా.. బంధుత్వంగా మారిన స్నేహబంధమూ ఉంది.

తిరుచ్చిలోని సర్కార్‌ పాలయంకు చెందిన పెట్రీషియా మేరి తండ్రి, ఆమె మామగారు బాల్య స్నేహితులు. పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఆ స్నేహం.. బంధుత్వం అయింది. మేరి అత్తమామలు హిందువులు. మేరీతో పెళ్లికి తమ కుమారుడు రూబన్‌ షణ్మగనాథన్‌ను క్రైస్తవమతంలోకి మార్చి మేరీతో వివాహం జరిపించారు. రూబన్‌ షణ్ముగనాథన్‌ తన తండ్రి నడిపే వేంబులి సెలూన్‌ షాపులో పనిచేసేవాడు. వివాహం తర్వాత, తిరుచ్చి చింతామణిలోని బజారు వీధిలో ఉన్న ఆ వేంబులి సెలూన్‌ను 2008 నుండి రూబన్‌నే నడిపేవాడు. టైలరింగ్‌ తెలిసిన మేరి సెలూన్‌ షాపులోనే ఓ పక్కనే మిషన్‌ పెట్టుకుని బట్టలు కుట్టేవారు. ఖాళీ సమయాల్లో భర్తకు సాయంగా కలర్‌ డై కలపటం, చిన్నపిల్లలకు చిన్న చిన్న కటింగ్స్‌ చేసేవారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. రూబన్‌ కటింగ్‌ సెలూన్, మేరి కుట్టు మిషన్‌.. వీటితో కుటుంబం సాఫీగా సాగేది. 

ఈ క్రమంలో 2014లో రూబన్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై దాదాపు తొమ్మిది నెలలు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. మధ్య తరగతి కుటుంబాలలో కుటుంబ యజమాని మంచాన పడితే జరిగేదే మేరి విషయంలోనూ జరిగింది. ఇద్దరు పిల్లల పోషణ, భర్త ఆస్పత్రి ఖర్చులు ఒక్కసారి మేరీని తీవ్రస్థాయిలో కష్టాల్లోకి నెట్టాయి. కుట్టుమిషన్‌ ఒక్కటే ఆమెకు చేయూతనిఇవ్వలేకపోయింది. వేరే పనులు తెలియవు. ఆ సమయంలో భర్త నడిపే సెలూన్‌ షాప్‌ కళ్లముందు కనిపించింది. తెలిసిన ఆ కాస్తంత విద్యను అలవాటు చేసుకుంటే అదే జీవనధారాన్ని ఇస్తుందని నమ్మారు మేరీ. అందుకే సెలూన్‌ షాపును తానే నడిపాలని నిర్ణయించుకుని తండ్రిని తోడుగా తీసుకుని, షాపులో సాయంగా పెట్టుకుని కటింగ్‌ వృత్తిని స్వీకరించారు. అయితే  బజారు వీధిలోని పురుషులకు ఆమె అలా చేయడం నచ్చలేదు. ఆడమనిషి సెలూన్‌ షాప్‌ను నడపటానికి వీలులేదు అని ఆక్షేపించారు.

ఆమె వారిని పట్టించుకోలేదు. తన వద్దకు వచ్చే వారికి కటింగ్, షేవింగ్‌ చేస్తూ వచ్చారు. మధ్యలో స్థానికులు పెట్టే ఇబ్బందులు, సూటిపోటీ మాటలు ఆమె మనో ధైర్యాన్ని చెరిపేయలేక పోయాయి. అదే సమయంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త రూబన్‌ మృతి చెందటం ఆమె కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆమె నిబ్బరం కాస్త సడలింది. అయినా ఎదుగుతున్న పిల్లలను చూసి మళ్లీ ధైర్యం కూడగట్టుకున్నారు మేరీ. తిరిగి సెలూన్‌ వెళ్లటం మొదలు పెట్టారు. ఆడవాళ్లు కటింగ్‌ ఏమిటీ, అసలు మా మధ్య ఆడమనిషి నడిపే ఈ సెలూన్‌ ఏమిటి అని మళ్లీ ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయినా మేరి గట్టిగా నిలబడ్డారు.

నేనెందుకు చేయకూడదు అని ప్రశ్నించారు. నా భర్త వృత్తిని కొనసాగించి తీరుతా అని స్పష్టం చేశారు. ఆ మాటపైనే సెలూన్‌ నడపటం మొదలు పెట్టారు. ఆరంభంలో ఈ ఒడిదుడుకులు ఎన్నున్నా.. ఇప్పుడు మాత్రం హెయిర్‌ డ్రెస్సింగ్‌ లో పెట్రిసియా మేరి ఓ బ్రాండ్‌ గా మారారు. ‘నువ్వు ఈ పని ఎన్నాళ్లో చెయ్యలేవు’ అని ఆ వీధిలో సవాళ్లు విసిరిన వాళ్లు సైతం ఇప్పుడు ఆమెకు సెల్యూట్‌ చేస్తున్నారు. ‘‘కొత్త కొత్త హెయిర్‌ స్టైల్స్‌ తో మేరి అక్క మా స్టెయిల్‌కి  బ్రాండ్‌ అయిం ది’’ అని అక్కడి యువత చెప్పుకుంటున్నారు. ఆ మాట నిజం. ఎక్కడ కోల్పోయానో అక్కడే సాధించి తీరుతా అని జీవితానికి ఎదురీదిన మేరి ఇప్పుడు తిరుచ్చి హెయిర్‌ స్టెయిల్‌కు ఒక ఇమేజ్‌ తెచ్చిపెట్టారు. అంతేకాదు, పెట్రిసియా మేరి ఇప్పుడు తిరుచ్చిలో చాలా మంది మహిళలకు మార్గదర్శి!
సంజయ్‌ గుండ్ల, సాక్షి టీవీ,
 చెన్నై బ్యూరో 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు