పరిపూర్ణ విజయగాథ

14 Oct, 2019 04:36 IST|Sakshi

20 ఆగస్ట్‌ 2013: ‘నల్లగా, సన్నగా ఉన్న పూర్ణ మలావత్‌’– కామారెడ్డి జిల్లాలో ఉన్న తాడ్వాయి మండలపు సాంఘిక సంక్షేమ పాఠశాలలో వాలీబాల్‌ ఆడుతుండగా, అపర్ణ తోట రాసిన ‘పూర్ణ’ మొదలవుతుంది. పూర్ణ తండ్రి దేవీదాస్‌ ‘తన పిల్లల చదువులపై పెట్టుబడి పెట్టిన’ వ్యక్తి. ఆయన పూర్వీకులు రాజస్తాన్‌ నుండి వలస వచ్చి, పాకాల కుగ్రామంలో స్థిరపడిన బంజారాలు. పూర్ణ టీచర్‌కు బోనగిరి గుట్టలెక్కేందుకు ఇద్దరు విద్యార్థులను పంపమన్న మెయిల్‌ వచ్చినప్పుడు, ఆమె పూర్ణ పేరు పంపుతారు. బడిపిల్లల కోసమని పర్వతారోహణ శిబిరాలను నిర్వహించే శేఖర్‌ బాబు, పరమేశ్‌ ఆధ్వర్యంలో బోనగిరి బండను చూస్తూ, ‘దాదాపు నిలువుగా ఉన్న రాతినెవరు ఎక్కగలరు?’ అని మొదట్లో అనుకున్న పూర్ణ, ‘కొత్త నైపుణ్యం నేర్చుకుంటున్నప్పుడు వచ్చే అడ్డంకులను అధిగమించేవరకూ ఆగేది కాదు’. ‘రాతితో స్నేహం చెయ్యి’ అన్న పరమేశ్‌ సలహా పాటిస్తూ, జై హనుమాన్‌ అని జపించుకుంటూ కొండ ఎక్కేస్తుంది. ‘స్వేరోస్‌’ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల సెక్రెటరీ అయిన ఐపీఎస్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ను అక్కడ చూస్తుంది. ‘నువ్వు ఎవరెస్టును లక్ష్యంగా చేసుకోవాలి’ అని పూర్ణతో చెప్పిన ప్రవీణ్, ‘అపరిమితమైన శిల, నాజూకైన అమ్మాయి’ అనుకుంటారు.


పూర్ణ మొదటి రైలు ప్రయాణం డార్జిలింగుకు. ఖమ్మంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న ఆనంద్‌ కూడా ఆ బృందంలో ఉంటాడు. ‘పోలీసు విభాగంలో విజయం సాధించినప్పటికీ, ‘నేను సాధిస్తున్నదేమిటి! పేరూ గౌరవమూనేనా?’ అనుకుంటూ, అసంతృప్తి చెందే’ ప్రవీణ్‌ అక్కడకు వెళ్ళి, ‘ప్రియమైన మౌంట్‌ ఎవరెస్ట్, త్వరలోనే నా స్వేరోలు నీ వద్దకు వస్తారు’ అన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తారు. హైదరాబాదులో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పిల్లలను అభినందించినప్పుడు, ‘నా చిట్టి అంబేడ్కర్లు కళ్ళు కలపగలుగుతున్నారు, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు’ అనుకుంటారు.
శిక్షణలో భాగంగా జరిగిన పిల్లల తదుపరి ప్రయాణం లేహ్‌కు. ఎవరెస్ట్‌ ఎక్కడానికి పూర్ణ, ఆనంద్‌ ఎంపికవుతారు. పిల్లలిద్దర్నీ శేఖర్‌ బాబు తీసుకెళ్తారు. చైనా వైపు నుండి ఎక్కుదామని నిర్ణయించుకుంటారు. ‘ఇక్కడివరకూ రాగలిగానంటే తప్పక శిఖరాగ్రానికి చేరుకుంటాను’ అని పూర్ణ తీర్మానించుకుంటుంది. అక్కడ భారీగా మంచు కురవడంతో ‘పూర్ణా, వెనక్కి రావడానికే సమస్యా ఉండదు. మీ క్షేమం ఎక్కువ ముఖ్యం మాకు’ అని ప్రవీణ్‌ అన్నప్పుడు, ‘మేము స్వేరోలము సర్, మనకు రివర్స్‌ గేర్లు ఉండవు’ అని జవాబిస్తుంది.

మే 25, 2014 ముందటి రాత్రి, యాత్రను విరమించుకుని పిల్లని వెనక్కి పిలవాలన్న ప్రలోభానికి లోనయ్యారు ప్రవీణ్‌. అది పిల్లలిద్దరి ఆశనే కాక, ఇతర స్వేరోస్‌ ఆశలను కూడా చంపేస్తుంది అనుకుని సతమతమవుతారు.మర్నాడు తెల్లవారు 5:45కి పూర్ణ శిఖరాగ్రానికి చేరుకుంటుంది. ‘మౌంట్‌ ఎవరెస్ట్‌ చేరుకున్న అతి పిన్న వయస్కురాలిని’ అన్న మాటలున్న టీ షర్ట్‌ తొడుక్కుని జాతీయ జెండా, అప్పటికి అధికారికంగా ఏర్పడని తెలంగాణా జెండానూ పాతుతుంది. ఆ తరువాత ఎస్‌.ఆర్‌.శంకరన్, అంబేడ్కర్‌ ఫొటోలున్న జెండాలను. ఆఖర్న స్వేరోస్‌ జెండా. 6:45కు ఆనంద్‌ కూడా శిఖరాగ్రం చేరుకుంటాడు.చివరి పేజీలలో అనేకమైన ఫొటోలున్న ఈ 162 పేజీల పుస్తకంలో ‘రాపెల్, బెలే, బకెట్‌ ఫోల్డ్‌’ వంటి సాంకేతిక మాటలుంటాయి. ‘డెత్‌ జోన్‌’ అన్నవి పెద్దక్షరాల్లో పుస్తకమంతటా కనబడతాయి. ఇంగ్లిష్‌ లిపిలో ఉన్న తెలుగు, హిందీ మాటల అనువాదాలు బ్రాకెట్లలో ఉంటాయి. ప్రతీ అధ్యాయానికీ ముందుండే శీర్షిక, సమయం, తేదీ, సంవత్సరాలు కథాక్రమాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ నిజ జీవితపు కథను ప్రిజమ్‌ బుక్స్‌ ఈ జూలైలో ప్రచురించింది. 
u కృష్ణ వేణి 

మరిన్ని వార్తలు