ముగ్గురూ ముగ్గురే!

27 Feb, 2018 00:08 IST|Sakshi
మహిళా రైతులు

సాగుబడి మహిళ లేనిదే వ్యవసాయం లేదు. వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడం, అత్యధిక సమయాన్ని కేటాయించడంలోనే కాదు.. నిర్ణాయకపాత్ర నిర్వహిస్తూ వ్యవసాయదారులుగా భేష్‌ అనిపించుకుంటున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఈ ముగ్గురూ తమ తరాల మహిళలకు స్ఫూర్తినందిస్తున్న మహిళా రైతులకు జేజేలు..!

‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం..’
పిట్ల చిన్నమ్మి(65) పెద్దగా చదువుకోలేదు. ప్రభుత్వం అందించిన భూములను శ్రద్ధగా సాగు చేసుకుంటూ.. భర్త సింహాచలం తోడ్పాటుతో ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తెచ్చిన దళిత మహిళా రైతుగా గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్‌ మండలంలో అలజంగి ఆమె స్వగ్రామం. తొలుత ప్రభుత్వం ఎకరా 30 సెంట్ల భూమిని అందించింది. డా. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో ఎకరా భూమిని ఆమెకు ఇచ్చారు.

ఆ భూమిలో అనుదినం కాయకష్టం చేసి పంటలు పండిస్తూ కుటుంబాన్ని కుదురుగా నడుపుతున్నదామె. ఆడవాళ్లు చేసే వ్యవసాయ పనులతోపాటు దుక్కి దున్నటం, ఎడ్ల బండి తోలటం.. చివరకు ట్రాక్టరు తోలడం కూడా ఆమె నేర్చుకొని చేస్తూ ఉండటం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని పొలం పనులు స్వయంగా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ.. ప్రభుత్వం ఇచ్చిన భూమితోపాటు మరికొంత భూమిని కూడా సమకూర్చుకున్నారు. ఇప్పుడు ఆమెకు 5 ఎకరాల భూమి ఉంది.

ఎకరంలో చిలగడ దుంపలు, ఎకరాలో వేరుశెనగ, ఒకటిన్నర ఎకరాల్లో అరటి, మిగతా పొలంలో వరి పండిస్తున్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతుంది? ఏ పంటకు ఎకరాకు ఎంత ఖర్చవుతుంది? ఎంత దిగుబడి వస్తుంది? వంటి విషయాలను తడుముకోకుండా చెబుతారు. ఎలాంటి భూమిని అయినా సాగు చేసి పంట దిగుబడి తీయడం చిన్నమ్మి ప్రత్యేకత. కుమారులు రమేష్, రాజశేఖర్‌ ప్రైవేటు కంపెనీలలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. ఉత్తమ రైతు పురస్కారాన్ని సైతం అందుకున్నారు.


                        దుక్కి దున్నుతున్న చిన్నమ్మి
ఆసక్తితో సేత్తన్నా..
‘సిన్ననాటి నుంచి వెవసాయం అంటే ఇష్టం. మా అయ్య, అమ్మ ఈ పనులు నేర్పారు. సిన్న పని నుంచి పెద్ద పని వరకు నానే సేసేదాన్ని. అన్ని పనులు నేర్చుకుని వెవసాయంలో లీనమై అన్ని పనులూ నేనే సేసుకునే దాన్ని. నా పెనిమిటి సాయం సేసేవాడు. పిల్లలకు సదువు సెప్పిద్దామనే ఆలోచనతో వారికి వెవసాయం నేర్పలేదు. పొద్దు పోయాక పొలాల్లో నీరు కట్టడం దగ్గర నుంచి బండి తోలడం వరకు అన్నీ నేర్చుకున్నాను. నా పని నానే సేసుకోవాలనుకుని పొలం పనులు నేర్చుకున్నాను..’ అంటారు చిన్నమ్మి సగర్వంగా.
– రంపా రాజమోహనరావు,

సాక్షి, బొబ్బిలి రూరల్, విజయనగరం జిల్లా
సంతోషకరం.. ‘అక్షర’ సేద్యం!

బీఎడ్‌ పూర్తి చేసిన సేంద్రియ సాగుపై మక్కువ చూపుతున్న యువతి

బీఎస్సీ, బీఎడ్‌ పూర్తి చేసి విద్యార్థులకు విద్యాబోధన చేయాల్సిన అక్షర (దీపిక) సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తన భర్త శ్రీనివాస్‌ సేంద్రియ వ్యవసాయం చేస్తుండడంతో ఆమె కూడా సంతోషంగా సాగు పనులు చేస్తూ తోటి మహిళా యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్‌ ఏంబీఏ చదువుకొని ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ సంతృప్తి లేక తిరిగి ఇంటికి వచ్చేశారు.

ఆరేళ్లుగా తమ సొంత భూమిలో అధునాతన, శాస్త్రీయ సేంద్రియ పద్ధతులను పాటిస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్‌ వెదిర గ్రామానికి చెందిన బీఎస్సీ, బీఎడ్‌ పూర్తి చేసిన  అక్షరను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచీ వ్యవసాయ పనులపై మక్కువ పెంచుకున్న అక్షర తన భర్తతో కలిసి సాగు పనుల్లో పాలు పంచుకున్నారు. అక్షర ప్రత్యేకంగా బోడ కాకర, కాకర, వంగ, టమటా, బెండ, చిక్కుడులాంటి కూరగాయలను ఎలాంటి క్రిమిసంçహారక మందులను పిచికారీ చేయకుండా సాగు చేస్తున్నారు.
– వి.రాజిరెడ్డి, సాక్షి, రామడుగు, కరీంనగర్‌ జిల్లా

సంతోషంగా ఉంది!
ఎలాంటి రసాయనిక మందులు వాడకుండా కూరగాయలు పండించడం చాలా ఆనందంగా ఉంది. వీటిని మార్కెట్‌లో మంచి ధరకు అమ్ముకుంటున్నాం. చదువుకున్న యువ మహిళలు ఆధునాతన పద్ధతులలో పంటల సాగుపై దృష్టి సారించాలి.
– అక్షర, మహిళా రైతు, తిర్మలాపూర్, కరీంనగర్‌ జిల్లా

                          డ్రిప్‌ పనుల్లో మహిళా రైతు అక్షర

18 ఏళ్లుగా అన్నీ తానై..!

అధిక దిగుబడులు.. ప్రశంసలు.. సత్కారాలు..
యువ మహిళా రైతు మంజుల వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.  కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రుజువు చేస్తున్నారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని రాగానిపల్లి ఆమె స్వగ్రామం. శివమ్మ, మాధవరెడ్డి దంపతుల కుమార్తె అయిన మంజుల ఇంటర్‌ వరకూ చదువుకున్నారు. తండ్రికి వయసు మీద పడటంతో ఆమె చదువుకు స్వస్తిపలికి వ్యవసాయంలోకి అడుగుపెట్టారు.

18 ఏళ్లుగా వ్యవసాయంలో అన్నీ తానై రాణిస్తోంది. తమకున్న పదెకరాల పొలంలో వేరుశెనగ, వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మల్బరీ తదితర పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ట్రాక్టర్‌తో భూమి దున్నడం, విత్తనాలు, ఎరువుల ఎంపిక, చీడపీడల నివారణకు స్వయంగా మందుల పిచికారీ, వ్యవసాయ పరికరాలు సమకూర్చుకోవడం, పంటలకు నీరందించడం తదితర పనులన్నీ ఈమెకు వెన్నెతో పెట్టిన విద్య.

వ్యవసాయ రంగంలో తనదైన ముద్రవేసుకున్న మంజుల వేరుశెనగ, వరి, మల్బరీ పంటల్లో రెట్టింపు దిగుబడులు సాధించి అధికారుల నుంచి ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో తయారైన కే–5, కే–6, కే–134 రకాలను సాగుచేసి గతంలో రెట్టింపు దిగుబడులు సాధించారు. పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు మంజులను సత్కరించారు. కదిరి తాలూకాలోనే అత్యధిక ధర పలికే పట్టుగూళ్లను పండించిన ఘనత మంజులది. పంటల సాగు, చీడపీడల నివారణకు గ్రామ రైతులు మంజుల సలహాలు తీసుకుంటుంటారు. ‘మంజుల మా గ్రామ సైంటిస్ట్‌’ అంటూ పలువురు రైతులు కొనియాడుతున్నారు.
– సోమశేఖర్, సాక్షి, నల్లమాడ, అనంతపురం జిల్లా


                            ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న మహిళా రైతు మంజుల

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా