నన్నడగొద్దు ప్లీజ్‌

21 Apr, 2017 23:07 IST|Sakshi
నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! నేను ఎం.ఎస్‌.సి చదువుతున్నాను. కుటుంబ సమస్యల వల్ల గత ఏడేళ్లుగా కార్పెంటర్‌ వర్కు చేస్తూనే చదువుకుంటున్నాను. నాకు ఒక చిన్ననాటి స్నేహితురాలు ఉంది. తను అంటే నాకు చాలా ఇష్టం. తన నడవడిక పద్ధతి అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ ఆ విషయం తనకి చెప్పలేదు. తనకి కూడా నా మీద ఇష్టం ఉండే ఉంటుంది అనుకుంటున్నా. తనకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి... అని తెలిసి మా ఇంట్లో ఒప్పుకుంటే తనకు చెబుదామని మా ఇంట్లో చెప్పాను. మా పేరెంట్స్‌ ఒప్పుకోలేదు.

  కానీ నేను ఆ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు ఈ విషయమంతా ఆ అమ్మాయికి ఎలా  చెప్పాలి? మా ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి? మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. గత 7 సంవత్సరాలుగా వేరువేరు ఊళ్లలో ఉంటున్నాం. కానీ రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. నాకు సలహా ఇవ్వండి. –మహేష్‌

సలహాలకేముంది మహేష్‌ అవి చెట్ల మీద కాస్తాయి. ఎవరయినా ఇస్తారు. అంతెందుకు నేనూ ఇస్తాను. నాకేమి ఖర్చు చెప్పు, నీ జీవితానికి ఒక సలహా పారెయ్యడా నికి.? ఇట్‌ కాస్ట్స్‌ నథింగ్‌. అందుకే సలహాల మీద జీవితాన్ని కట్టకు. ఒక ద్వారం చెయ్యాలన్నా... ఒక తలుపు చెయ్యాలన్నా... ఒక పెళ్లి పందిరి చెయ్యాలన్నా... ఒక మంచం చెయ్యాలన్నా... ఒక పిల్లల ఉయ్యాల చెయ్యాలన్నా... ఒక కార్పెంటర్‌ కావాలి. ఇంటికి కావల్సినవన్నీ చెయ్యగలవాడివి. పెళ్లి చేసుకోలేవు? కట్టె బట్టి వస్తువు. ప్రేమ బట్టి పెళ్లి. నీకు నేను సలహా ఇచ్చేంత వాడ్ని కాదు. జీవితాన్ని దువ్వడ పట్టి మేకులు కొట్టి చేసుకో. ఆల్‌ ది బెస్ట్‌. ‘సార్‌... మీరిలా రాస్తే ఎవ్వరూ చదవరు... మూడు మార్చండి... అరటిపండు మింగండి’ అంటూ నీలాంబరి ప్రేమగా అరటిపండు ఇచ్చింది.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

మరిన్ని వార్తలు