అది హత్యే!

8 Oct, 2017 10:18 IST|Sakshi

సాయంత్రం ఆరు అవుతోందప్పుడు. ఫ్రెండ్‌ శ్రీరామ్‌ను కలిసేందుకు అతడు ఉండే ఫ్లాట్‌కు వచ్చాడు రాజ్‌. ఇద్దరూ కలసి చాలాసేపు ముచ్చటించుకున్నారు. శ్రీరామ్‌ రాజ్‌ను పిలిపించడానికి ఒక కారణం ఉంది. వాళ్లిద్దరూ కలసి నడిపిస్తోన్న కంపెనీలో రాజ్‌ చేసిన మోసం శ్రీరామ్‌కు తెలిసింది. కంపెనీ 25 లక్షలు మోసపోయింది రాజ్‌ వల్లే! ఈ విషయం గురించి మాట్లాడడానికే రాజ్‌ను పిలిపించాడు శ్రీరామ్‌. రాజ్‌కూ ఈ విషయం అర్థమవుతూనే ఉంది. మెల్లిగా మాటల మధ్యలో ఎక్కడా తన మోసం సంగతి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక అది బయటకు రావడమే ఆలస్యం, తనతో పాటు తెచ్చుకున్న ఓ తుపాకీని శ్రీరామ్‌కు గురిపెట్టాడు రాజ్‌.

ఠప్‌మంటూ బుల్లెట్‌ బయటకొచ్చింది. శ్రీరామ్‌ అక్కడికక్కడే కూలబడిపోయాడు. సాక్ష్యాలేవీ లేకుండా చూసుకున్నాడు రాజ్‌. అంతకుముందు రోజు ఒక షో కోసం వాళ్లు రెడీ చేసి పెట్టుకున్న సూసైడ్‌ ఆడియో క్యాసెట్‌ ఒకటి వెతికిపట్టి టేప్‌ రికార్డర్‌లో వేశాడు. ఆ టేప్‌ రికార్డర్‌ను శ్రీరామ్‌ ఎడమ చేతిలో పెట్టాడు. కుడిచేతిలో గన్‌ పెట్టాడు. అందరూ ఆత్మహత్య అనుకునేలా సెటప్‌ చేసి పెట్టుకున్నాడు. తర్వాతి రోజు ఉదయం పేపర్‌ బాయ్‌ శ్రీరామ్‌ను శవంలా చూసి పోలీసులకు ఫోన్‌ చేశాడు.  ఇన్స్‌పెక్టర్‌ భరత్, అతడి టీమ్‌ సాక్ష్యాధారాలు వెతకడం ప్రారంభించింది. టేప్‌ రికార్డర్‌ను ఆన్‌ చేయగానే, వారికి శ్రీరామ్‌ గొంతు వినిపించింది.

‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు. ఈ జీవితం నాకు నచ్చడం లేదు. ఇక్కడ ఉండటం అస్సలు నచ్చడం లేదు.

భరత్‌.. టేప్‌ రికార్డర్‌లో వినిపించేదంతా శ్రద్ధగా విన్నాడు. సూసైడ్‌ నోట్‌ అయిపోగానే బుల్లెట్‌ బయటకొచ్చిన శబ్దం వినిపించింది.

‘‘ఇది ఆత్మహత్య కాదు. హత్య’’ అన్నాడు భరత్‌.

అతడి టీమ్‌ అంతా వింతగా చూస్తూ నిలబడింది.

రాజ్‌ ఏడుస్తూ.. ‘‘అయ్యో! ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమొచ్చిందిరా?’’ అంటూ అప్పుడే ఇంట్లోకి వచ్చాడు.

భరత్‌కు వెంటనే రాజ్‌ను విచారించాలన్న ఆలోచన వచ్చింది. అసలు శ్రీరామ్‌ది ఆత్మహత్య కాదు, హత్య అని భరత్‌ ఎలా గ్రహించాడు?

జవాబు: 
శ్రీరామ్‌ స్వయంగా టేప్‌ రికార్డర్‌లో తన సూసైడ్‌ నోట్‌ను రికార్డు చేసి ఉంటే, ఆ క్యాసెట్‌ మొదట్నుంచీ ప్లే అయ్యే అవకాశమే లేదు. చనిపోయిన వ్యక్తి రివైండ్‌ చేయడమైతే కుదరని పని. కాబట్టి ఎవరో ఇదంతా ప్లాన్‌ ప్రకారమే చేశారని భరత్‌ అంచనాకు వచ్చేశాడు. 

మరిన్ని వార్తలు