అన్నయ్యే వచ్చి కాపాడాలా?

12 Mar, 2018 00:56 IST|Sakshi

నిండుసభలో ద్రౌపదికి దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేస్తున్న సమయంలో సాక్షాత్తు ఆమె సోదర సమానుడైన శ్రీకృష్ణుడు వచ్చి ఆమెను కాపాడాడు. నిజానికి ద్రౌపది తనను తాను రక్షించుకోలేని శక్తిహీనురాలు కాదు. ఆ సమయంలో ఆమె ఏకవస్త్ర. అందువల్ల శరణు వేడింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజస్తాన్‌ ఉమెన్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సుమన్‌ శర్మ ప్రసంగిస్తూ, ‘‘చెవులకు రింగులు పెట్టుకుని, లో వెయిస్ట్‌ జీన్స్‌ వేసుకుంటున్న మగపిల్లలు, వారి చెల్లెళ్లను, అక్కలను ఎలా కాపాడగలరు? ఒకప్పుడు మగవారు విశాలమైన ఛాతీతో, కండలు తిరిగిన భుజాలతో బలంగా ఉండేవారు. వారిని చూడగానే అమ్మాయిలను ఏడిపించడానికి పోకిరీలు భయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు’’ అంటూ మగపిల్లల శారీరక దారుఢ్యం గురించి వ్యాఖ్యానించారు.

నిజమే.. ఒకప్పుడు అమ్మాయిలు ఎవరైనా పోకిరీలు తమను టీజ్‌ చేస్తుంటే, వెంటనే అన్నయ్యలనో, తండ్రులనో వెంటపెట్టుకుని వచ్చి, బెదిరించేవారు. ఇప్పుడు అమ్మాయిలకు ఎవ్వరి అవసరం లేదు. వారి సమస్యలను వారే పరిష్కరించుకోగల స్థితికి ఎదిగారు. శారీరక బలంతో పాటు, మానసిక బలం కూడా పెంచుకున్నారు. మరి సుమన్‌ శర్మ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలి? ‘అబ్బాయిలు బలహీనంగా ఉంటేనేం, వాళ్లను కాపాడే బలం అమ్మాయిలకు ఉన్నప్పుడు?..’ అనుకుంటే సరి.

మరిన్ని వార్తలు