మోయలేని మునసబు

25 Feb, 2019 00:19 IST|Sakshi

కథాసారం

‘‘జవాన్లు ఇద్దరు.’’ 
‘‘ఊ’’
‘‘ఒక గుమాస్తా.’’
‘‘ఊ’’
‘‘వంటవాడు.’’
‘‘ఊ.’’
‘‘తహసీల్‌దారు పంతులూ.’’
‘‘ఊ.’’
‘‘బియ్యం మూడు శేర్లు. పప్పు శేరు. 
చింతపండు వీశ. మిరపకాయ లరవీశ. 
ఉప్పు అర్ధశేరు. కాఫీగింజ లరవీశ. 
చక్కెర వీశ.  నెయ్యి వీశ. 
విస్తరాకులు ఒక కట్ట. ఉల్లిగడ్డలు వీశ. 
మినపబేడలు శేరు. మెంతులు, జీలకర్ర, 
ఆవాలూ ఐదేసి పలాలు. 
ఆకులూ, వక్కలూ, లవంగాలూ వ్రాశావూ.’’

వంటమనిషి చెప్పిన ప్రకారం పట్టీ వ్రాసి వంతు అంగడికి పంపించాడు మునసబు.

తాను గ్రామమునసబు నౌకరీకి వచ్చిన తర్వాత ఇదే తహసీల్‌దారు ఆ ఊరు మకాం చేయడం. తహసీల్‌దారు కూడా కొత్తగా వచ్చారు ఆ తాలూకాకు. మునసబు కంగారు పడుతున్నాడు.

ముందుగా వంటమనిషీ, గుమాస్తా, ఒక జవానూ వచ్చేశారు. వంతుచాకలివాండ్లు మూటలు దింపి వెళ్లిపోయారు.

వంట చేసుకోను ఒక ఇల్లు బాగు చేయించి దుప్పట్లు తెర అడ్డం కట్టించాడు మునసబు. పొయ్యిలోకి కట్టెలూ, స్నానానికి కొత్తకుండలూ తెప్పించాడు. గ్రామచావడి కడిగించి పడక కుర్చీలూ, బల్లలూ వేయించాడు. జవాన్ల భోజనానికి వర్తకుల ఇళ్లల్లో వంతు లేర్పాటు చేయించాడు. సప్లయిలో లోపాలు అధికారికి పట్టివ్వకుండా ముందుగానే వంటమనిషి చేతిలో రెండు రూపాయలు పెట్టి అతని గడ్డం పట్టుకున్నాడు.

పదకొండు గంటలకు తహసీల్‌దారు జట్కాబండి వచ్చి గ్రామచావడి దగ్గర నిలిచింది. చక్కెర పొట్లం చేతపుచ్చుకుని బండిలోనే పెట్టి దణ్ణం పెట్టాడు మునసబు.

బూర్నీసు కప్పుకుని బండిలోనే కూర్చున్నారు తహశిల్‌దారు. హు, హు, హు అని వొణుకుతున్నాడు. ‘‘జ్వరం తగిలిం’’దని అంటూ నెమ్మదిగా దిగి, పడక కుర్చీలో కూర్చున్నారు.


‘‘జ్వరమే!’’ మునసబుకూ జ్వరం తగిలినట్టయింది.
నాటువైద్యుణ్ణి పిలిపించాడు మునసబు. 
పొయ్యి మీది గిన్నె అయినా దింపకుండా పరుగెత్తుకు వచ్చాడు వంటవాడు. జవాన్లు వచ్చి కాళ్లు ఒత్తుతూ కూర్చున్నారు.


‘‘తహసీల్‌దారుగారికి జ్వరమే!’’ ఊరంతా పొక్కిపోయింది. 
పెద్ద రయితులూ, పెద్ద వర్తకులూ, పెద్ద బ్రాహ్మణులూ మూగిపోయారు.
‘‘చలితో వచ్చింది– మలేరియా కాబోలు’’ 
‘‘శీతపైత్యపు జ్వరమేమో’’ 
‘‘సన్నిపాతమేమో’’ 
‘‘దిష్టి తగిలిందేమో, ఇన్ని మిరపకాయలు తీసి పొయ్యిలో వెయ్య’’మన్నారు శాస్త్రిగారు.
‘‘దోషించిందేమో, కంట్లో ఆనందభైరవి కలికం వేయండి, మంచి’’దన్నాడు కోమటి.


వైద్యుణ్ణి చెయ్యి చూడమన్నాడు గుమాస్తా.
‘‘గర్భంలో శీతలించిం’’దన్నాడు వైద్యుడు.
‘‘అయితే ఎట్లా?’’ అన్నాడు మునసబు.
‘‘వాతరాక్షసం అరగదీసి ప్రయోగిస్తా’’ నన్నాడు వైద్యుడు.
‘‘ఇక్కడ ఉండటానికి లేదు: తక్షణం ఇంటికి వెళ్లిపోతాను. మేనా తెప్పించు’’అన్నాడు తహసీల్‌దారు.
‘‘మేనా?’’– నడుం జారిపోయింది మునసబుకు. ఆ వూర్లో మేనా లేదు! ఏమిటి చెయ్యడం?
జట్కాబండి వొళ్లు కుదుపు – పనికిరాదన్నారు. రెండెద్దులబండికి గూడు కట్టించి పంపుతానన్నాడు మునసబు. పనికిరాదన్నారు తహసీల్‌దారు.

గ్రామపెద్దలందరూ మొఖాలు చూచుకున్నారు. మేనా సప్లయి చేయలేకపోతే – అన్నా!
‘‘కాళ్లమంచం తెప్పించి, దానికి తాళ్లుకట్టి బొంగుదూర్చి పైన గుడ్డ కప్పి మోసుకునిపోతే పనికిరాదా!’’ అన్నాడు కోమటి శెట్టి.
‘‘ఛీ!’’ అన్నారు జవానులు.
‘‘మేనా లేదుగాని చాకలివాండ్ల ఇళ్లల్లో పెళ్లి పాలకీ ఒకటి ఉన్న’’దన్నారు ఒకరు.
‘‘దాన్నయినా తెప్పించవయ్యా’’ అన్నాడు గుమాస్తా.
‘‘పదిమైళ్ల ప్రయాణం. ఎందుకయినా పనికి వస్తాడా అయ్య! పాలకీ తెప్పించవలసిందే’’ నన్నారు జవాన్లు.

వెంకడి వసారాలో చూరుకు వ్రేలాడగట్టిన పాలకీ దింపారు చాకలివాండ్లు. బూజూ దుమ్మూ దులిపి చావడి దగ్గరకు తీసుకుని వచ్చారు. పాలకీపైన చాందినీ కట్టారు. లోపలకు చలిగాలి దూరకుండా నాలుగు వైపులా దట్టమైన దుప్పట్లు బిగించారు. జానెడు మందం బూరుగుదూది పరుపు లోపల పరిచారు. తలకింద మూడు దిండ్లూ, కాలికింద రెండు దిండ్లూ, ఆ ప్రక్క నొక బాలీసూ, ఈ ప్రక్క నొక బాలీసూనూ!

తహసీల్‌దారు వొళ్లు సలసలా కాగిపోతోంది. పన్నెండు గంటలయింది. ఎండ తీక్షణంగా కాస్తోంది. అయ్యగారికి చలి జాస్తి అవుతోంది. జవాన్లూ, గుమాస్తా, వంటవాడూ పట్టుకుని అయ్యగారిని పాలకీలో పండబెట్టారు. రెండు శాలువాలు పైన కప్పారు. తలకు రెండు ఊలు మఫ్లర్లు చుట్టబెట్టారు. ఇక పట్టండంటే పట్టండన్నారు.

ఎవరికి పట్టినా ఒకటే తొందర. ఒకటే గలభా! పాలకీ మోయడానికి ఇటు ఇద్దరూ అటు ఇద్దరూ ఆఖరుకి నలుగురయినా ఉండాలా? ఏరీ? వాహకుల సంగతి ఎవరూ అనుకోనేలేదు.

ముగ్గురే ఉన్నారు చాకళ్లు. ఆ వూళ్లో మొదటినుండీ చాకలికి కరువే! శుభాలకూ, అశుభాలకూ కావలసివుంటే ప్రక్కవూరునుండి పిలుచుకుని జరుపుకొంటున్నారు గ్రామస్తులు.

‘‘నాలుగోవాడు కొండడున్నాడు. కాని వాడు కూడా జ్వరం తగిలి ఇంటికాడ పండుకున్నాడు.’’
‘‘ఇకనేం. పిలిపించండి వాణ్ణి’’ అన్నారు పదిమందీని.  కొండడి కోసం కబురు చేశారు. వాడు కదలలేనన్నాడని  వెళ్లిన మనిషి చక్కా వచ్చాడు.

నడివీధిలో ఉండిపోయింది పాలకీ. ముగ్గురితో కదిలే ఎత్తు కనిపించదు. మునసబుకు తత్తర పుట్టింది. ‘‘ఏదో పాగీ చూచి, వాహనం కదిలే మార్గం చూడవయ్యా మునసబూ’’ అని పదిమందీ పదిమాటలూ అనేవాళ్లేకాని మార్గం చూపేవాళ్లెవరూ కనిపించరు.

‘‘నాలుగు రూపాయలు కూలియిస్తా’’నని కూలి మనుష్యుల్ని బ్రతిమలాడుకొన్నాడు మునసబు. 
‘‘మేం చాకలివాళ్లం కాదయ్యోయ్‌’’ అని చక్కాబోయారు కూలీలు.
‘‘ఇవ్వాళ వీణ్ణిట్లా విడిపిస్తే–రేపు ఇంకొకడు కాలునొప్పి అని ఎగనామం పెడతాడు. ఆ మర్నాడు కుమ్మరి. ఆ తర్వాత మంగలి’’ అన్నాడు వంటమనిషి.
‘‘వంతు చాకలి రావలసిందే’’ అన్నారు అందరూను.
కర్రలు పుచ్చుకొని డవాలీ జవాన్లు చాకలిపాలెం వెళ్లారు. కళ్లు జ్యోతులై కొండడు మంచంమీద పండుకొని డోక్కుంటున్నాడు.
‘‘జ్వరమూ లేదు, నీ బొందా లేదు. తెగ తాగితే వొళ్లు పులకరించిం’’దన్నారు జవాన్లు.
చెయ్యి పట్టుకుని బయటికి లాగారు కొండడిని. ఒళ్లు తిరిగి ఎండలోనే కూలబడ్డాడు కొండడు.
‘‘ఎంతసేపయ్యా ఈ బేరం’’ అని లోపల నుండి మూలిగాడు తహశీల్‌దారు.

గడబద్ధం వచ్చిపడింది మునసబుకు. వాహనం కదిలే ఎత్తు కనిపించలేదతగాడికి. చెమటలు పోసి నో రెండిపోతోంది.
‘‘నాలుగో మనిషిని ఆ తలియారీని పంపరాదండీ దొరా’’ అని ఒక చాకలి ఉపాయం చెప్పాడు.
‘‘తలియారీ డ్యూటీ గ్రామంలో గస్తు తిరగడం, దొంగల్ని పట్టడమూ’’ నన్నాడు మునసబు.
‘‘పోనీ, ముగ్గురు వెట్టివాండ్లున్నారే– ఒక భుజం కాచుకోకూడదూ’’ అన్నాడు మరో చాకలి.
మునసబు వెట్టివాళ్లవంక చూచాడు– ఆపద తప్పించమని.
‘‘మేం సర్కారు ముడుపులు మోసేవాళ్లం కాని అధికార్లని మోసేవాళ్లం కా’’దన్నారు వెట్టివాండ్లు.

పాలకీలో మూలుగు ముదురుతోంది పంతులుకు. అక్కడ చేరిన పదిమంది తలకాయలూ ఎక్కడి వాండ్లక్కడ జారుకున్నారు.

దుప్పటీ కప్పుకుని కొండడింటికి పోయాడు. మంచినీళ్లు తాగివస్తామని ముగ్గురు చాకలివాళ్లూ మొఖం తప్పించారు. వాహనం నట్టనడివీధిలో అట్లనే ఉండిపోయింది. జవాన్లూ, వంటమనిషీ సాయం పట్టి వాహనాన్ని వేపచెట్టు నీడకి ఈడ్చారు.

‘‘ఎత్తిన వాహనం అప్పడే దించా రెందువల్ల?’’ అని కేక పెట్టాడు తహసీల్‌దారు.
గుమాస్తా వైపు తిరిగి దండం పెట్టాడు మునసబు.
‘‘వాహకులు దొరకలేదండి’’ అని దగ్గరగా వెళ్లి ముసుగు తొలిగించి తహసీల్‌దారుతో చెప్పాడు గుమాస్తా.

ఇక లాభం లేదనుకొని జట్కాబండి వెనక్కు తిప్పుకుని ఇంటికి వెళ్లి, మేనా సప్లయి చేయలేని మనిషి మునసబు నౌకరీకి అర్హుడు కాడని ఆ మునసబుని నౌకరీ నుండి బర్తరఫ్‌ చేశాడు తహసీల్‌దారు.

‘‘తక్షణం ఇంటికి వెళ్లిపోతాను. మేనా తెప్పించు’’ అన్నాడు తహశిల్‌దారు.
‘‘మేనా?’’– నడుం జారిపోయింది మునసబుకు. ఏమిటి చెయ్యడం?


కరుణ కుమార
కరుణకుమార ‘చలిజ్వరం’ కథకు ఇది సంక్షిప్త రూపం. ప్రచురణ: 1950. కరుణకుమార కలంపేరుతో కథలు రాసిన ఈయన అసలు పేరు కందుకూరి అనంతం (1901–1956). కథకు పనికొచ్చే ఒక వివరం: నాలుగు వైపులా మూసినట్టుండేది మేనా. పల్లకీకి మాండలిక రూపం పాలకీ.


 

మరిన్ని వార్తలు