భూమిని తిప్పిన మనిషి

6 May, 2019 00:01 IST|Sakshi

కథాసారం

పాకాల నుంచి దక్షిణాదిగా కాట్పాడి వైపు వెళ్లే రైల్లో ప్రయాణం చేసిన వాళ్లు పూతలపట్టు, చిత్తూరు, రామాపురం, బొమ్మసముద్రంలాంటి ఊళ్ల పేర్లు వినివుంటారు. 

అవన్నీ ఆ దారిలోని స్టేషన్లు. అప్పట్లో రైలుబండ్లు పందెపు గుర్రాల్లా పరుగెత్తేవి కావు. మందకొడిగా నడిచేవి. ఉదయం ఆరుగంటలకు పాకాల నుంచి బయల్దేరేవి. బండిలో వెళ్లి, రామాపురం చేరుకునేసరికి ఏడున్నర కావచ్చేది. బండిలోనుంచి అవలీలగా ప్లాట్‌ఫారం పైకి దూకి ‘చిన్నాయినా, చిన్నాయినా’ అని పిలుస్తూ ఆరెంఎస్‌ పెట్టెవైపు పరుగులంకించుకునేవాణ్ణి. తన సంచిని చేతికి తీసుకుంటూ, ‘ఒరే అంజీ, నువ్వా! తోడు లేకుండా ఒంటిగా వచ్చేసేటంతటోడివైపోయినావే!’ అని పలకరించేవాడు.

తలకు తువ్వాల చుట్టుకుని, పైకెత్తి పొందికగా గోచీపెట్టి కట్టుకున్న ఎనిమిది మూళ్ల పంచపైన డిపార్టుమెంటు వాళ్లిచ్చిన కార్‌ చొక్కా తొడుక్కుని, భుజానికి వెనుకగా వేలాడేసిన తపాలా సంచి ముందు భాగాన్ని ఎడమ చేత్తో పట్టుకుని, గజ్జలు గల్లగల్లుమనే గిలకల బాణాకర్రను కుడిచేతివేళ్ల మధ్య బిగించి, అంతెత్తు ఆకారంలో ప్లాట్‌ఫారంపైన నడుస్తుంటే నేను చిన్నాయిన వైపు కళ్లప్పగించి చూచేవాణ్ణి. పక్కన పడుకోబెట్టుకుని మా జేజమ్మ చెప్పిన కథలెన్నో జ్ఞప్తికొచ్చేవి. ఎవరబ్బా ఈయన? బొబ్బిలి పాపారాయుడా? కనిగిరి కాటమరాయుడా? చెంజికోట బురుజుపైన గస్తీ తిరిగే సిపాయా?

పొలం గనుమల పైన నడిచి, చెరువుకట్ట పైనుంచీ ముందుకుసాగి, మావిడితోపుల మధ్య నీరెండిపోయిన ఇసుక డొంకల దారిగుండా ముందుకుసాగి, మిట్టలెక్కి, కళ్లాలు దిగి, చిట్టడివిని అధిగమించి నెమళ్లదిన్నెవైపు దూసుకుపోయేవాళ్లం. చిన్నాయిన నడిచే తీరే విచిత్రం. దట్టంగా చీలలు తాపడం చేసిన పాతచెప్పులు కిర్రుకిర్రుమంటూ వుండబట్టిగానీ లేకుంటే పాదాలు నేలకానకుండా గాలిలో తేలిపోతున్నాడేమో ననుకోవలసిన పరిస్థితి. ఆయనది నడక. నాదేమో పరుగు.

తొమ్మిదికంతా నెమళ్లదిన్నె.

ఒక పాత పెంకుటింటి వీధివైపు గదే పోస్టాఫీసు. కాడ ఒకటి విరిగిపోవడం వల్ల నూలు దారంతో చెవికి కట్టుకున్న కళ్లద్దాలతో ముసలి పోస్టుమాస్టరు గది తలుపు తెరిచి పెట్టుకుని, పెద్ద పెట్టె దగ్గర కునికిపాట్లు పడుతుండేవాడు. ‘‘సంచీ వచ్చింది సారూ! కోసి జాబులు సార్టు చెయ్యండి. ఇంటికెళ్లొచ్చేస్తా’’ నంటూ చిన్నాయిన గృహోన్ముఖుడైపోయేవాడు. వంటింటి అరుగుపైన సత్తుడేగిసా నిండుకూ కూటినీళ్లతో కలిపి పెట్టిన చద్దన్నాన్ని ఎరగడ్డ పాయలు నంజుకుంటూ సంతృప్తిగా జుర్రేసేవాడు. జాగు చెయ్యడానికి ఎడమేదీ? వచ్చిన టపానంతా ఉత్తరాలుగా, రిజిష్టర్డు ఆర్టికల్స్‌గా, మనియార్డర్లుగా వింగడించి చేతి సంచిలో వేసుకుని, ‘సుఖమా మన రాజ్యమెల్ల సుఖమా?’ అన్నంత దర్పంగా పల్లెలపైకి ‘బీటు’ వెడలేవాడు. నాకు గూడా ఆయన వెంట ఊళ్లు తిరగడమంటే ఖుషీగా వుండేది.

నెమళ్లదిన్నెకొక మైలుదూరంలో ఎంటవలపాడని ఒక ఊరు. ఆ ఊళ్లో ఒక నాయుడుగారికి మిలిటరీలోవున్న కొడుకుల దగ్గరనుంచి డబ్బో దస్కమో వస్తుండేవి. ముట్టచెప్పే నిమిత్తం వెళ్లినప్పుడల్లా కంచు చెంబు నిండుకూ చిక్కటి మజ్జిగ బక్షీషుగా లభిస్తుండేది. ప్రయత్నలోపం లేకుండా నేనుగూడా దారిపొడుగునా సరికిపండ్లు, వెల్లికాయలు, సద్దకంకులు ఉపాహారంగా సేకరించుకునేవాణ్ణి. ఎంటవలపాడునుంచి అరగంట నడిస్తే ప్రపంచమంతటితో ఆఖరైపోయినట్టుగా ఒక కొండకింద కొన్ని పూరిండ్లు నిద్రమత్తులో జోగుతుండేవి. దానిపేరు పోతురాజుగడ్డ. నాకు తెలిసినంతలో ఆ ఊరికెప్పుడూ ఉత్తరం వచ్చినట్టు లేదు. ఊళ్లో అడుగుపెట్టకుండా కూనపల్లె, బైరాగుల మఠం, పులకుంటలమీదుగా మధ్యాహ్నం పొద్దు పడమటికి తిరిగేటప్పటికీ నెమళ్లదిన్నెకు తిరిగొచ్చేవాళ్లం. అప్పుడిక ఆదరాబాదరాగా రాగిపిండితో చేసిన నూకబియ్యం సంగటి ముద్దలు రెండింటిని పచ్చి మిరపకాయలతో పామిన చింతాకు పుల్లగూరతోనో, వేరుశనగ్గింజల పొడి మిళాయించిన ఆనపగింజల తియ్యగూరతోనో గుటుకు గుటుకున దిగమింగి మళ్లీ పోస్టాఫీసుకు వెళ్లి తపాలా కట్ట అందుకున్నాడంటే, దాన్ని రైల్లో అందించి తిరిగొచ్చేసరికి నెమళ్లదిన్నె లోయనంతా మసక చీకట్లు పొదివి పట్టుకుంటూ వుండేవి. పొంతబానలో కాగిన నీళ్లతో తనివిదీరా స్నానంచేసి, సుష్టుగా భోజనం చేసి, ఇంటిముంగిట రేగిచెట్టుక్రింద నులకమంచంపైన దిగువ తిరుపతిలో గోవిందరాజుల మాదిరిగా పడుకున్నాడంటే, పవ్వళించినప్పటినుంచీ పదాలే పదాలు!

‘‘గోదావరమ్ములో, భద్రాచలమ్మున
సీతారాముల పెళ్లీ, చూచి వత్తమా మళ్లీ!
వస్తావంట్రా అంజీ! రావా ఏమే చిన్నీ!...’’
చిన్ని అంటే మా పిన్ని. చిన్నాయిన పెట్టుకున్న ముద్దుపేరు. 
‘‘సరేలే! కోపులు బాగానే వుండాయి’’ అని చిన్నమ్మ మాటలు ఇంటిలోపలి నుంచి వినవస్తుండేవి.
∙∙ 
తూర్పు కొండపైన ఒక కాలు, పడమటి కొండపైన ఒక కాలు మోపి, ఆంజనేయస్వామి ఆకాశంలో సంచరించే సూర్యభగవానుడి దగ్గర చదువు నేర్చుకున్నాడని ఒక పౌరాణిక గాధ. మా చిన్నాయిన వెంట నడుస్తూ కబుర్లు వినడం అంతకు తక్కువదేమీ గాదు.

‘‘ఒరే అంజీ! చిన్నప్పుడు మేము తిరుపతి కొండకు వాలాయంగా ఇలూ తీర్థం వెళ్లొచ్చేవాళ్లం. రాత్రి బండికి తిరుపతిలో దిగేదిన్నీ, ధర్మసత్రంలో పడుకునేదిన్నీ.’’

‘‘తుంబురు తీర్థం! ఎప్పుడైనా వింటివా! ఏడాది కొక్కరోజు మాత్రమే జనం వెళ్లేచోటు. పున్నమి రేయి వెళ్లాలి. కొండపేట్ల మధ్యన ఇరుకుదారి. అర్ధరాత్రయ్యే టప్పటికి చందమామ నడిమింటికొచ్చేస్తాడు. ఇరుకు మార్గంలో నడుస్తావుంటే వెన్నెల వెల్తురులో ఈదులాడినట్టే ఉంటుంది.’’

ఒక్క తిరుపతి కొండేనా! దక్షిణ దేశంలో మా చిన్నాయన తిరిగి రాని దర్శనీయ స్థలాలెక్కడున్నాయి? ఎగువ అహోబిలంలో ఆకాశాన్నంటే కొండల నడుమ రాతి మండపంలో నిలబడి కుంభీపాతంగా దూకిన జడివానలో ప్రకృతి బీభత్సం ఎదుట తలవాల్చిన అనుభవం, పన్నెండు మైళ్ల చుట్టు కైవారమున్న అరుణాచలాన్ని ఒకటి ముప్పావుగంటలో ప్రదక్షిణం చేసివచ్చిన వైనం– ఇలా త్రవ్విన కొద్దీ కథలే!

నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్చుకున్నాక నేను సిందుబాదు నౌకా యాత్రల్ని గురించి చదివాను. గలివరు, కొలంబస్, వాస్కోడిగామా సాహస యాత్రల గురించి చదివాను. వాటన్నింటికి పునాదిరాళ్లు చిన్నాయిన స్వానుభవాల్లోనే ఉన్నాయన్న అభిప్రాయం నుంచి బయట పడలేకున్నాను.

హైస్కూల్లో లెక్కల టీచరుగా పనిచేసి ఇటీవలే నేను రిటైరయ్యాను. విద్యార్థులకు కాలం–పని, కాలం–దూరం లెక్కలు నేర్పడమంటే సరదా. ఒక పర్యాయం మా చిన్నాయన్ను గురించి లెక్క ఒకటి చేసి చూచాను. రామాపురానికీ నెమళ్లదిన్నెకూ మధ్య దూరం అయిదుమైళ్లు, రెండుసార్లు తిరిగేటప్పటికీ పదిమైళ్లు. టపా బట్వాడా చేయడానికి పల్లెల పైన తిరగవలసి వచ్చే దూరం అయిదు మైళ్లు. తపాలాఫీసు పనిచేసేది పాతిక రోజులే ననుకున్నా నెలకు 375 మైళ్లు. ఎందుకైనా మంచిది, ఇంకొక పాతిక కలుపుకో. నెలవారీ నడక 400 మైళ్లు. సంవత్సరానికి 4,800 మైళ్లు. సౌలభ్యం కోసం ఇన్నూరు కలుపుకో. అయిదు వేలు. 40 సంవత్సరాల సర్వీసులో నడిచిన దూరం రెండు లక్షల మైళ్లు. మూడు లక్షల ఇరవై వేల కిలోమీటర్లు. పదవీ విరమణ చేసిన తర్వాతైనా ఊరికే కూర్చుని ఉండరు గదా. ఈ ఇరవై ఏండ్లకూ కలిపి ఎనభై వేలే వేసుకో. జీవితకాలంలో నడిచిన మొత్తం దూరం నాలుగు లక్షల కిలోమీటర్లు. ఎవరూ అనుకోలేరుగానీ, అనుకుంటే మా చిన్నాయిన పేరును గిన్నిస్‌బుక్‌కు సిఫార్సు చేయవచ్చునేమో!

‘‘కళ్లున్నందుకు చూడాలి. చెవులున్నందుకు వినాలి. చేతులున్నందుకు పనిచెయ్యాలి. కాళ్లున్నందుకు తిరగాలి. అంజీ ఆఖరిక్షణం దాకా బతకాలి’’ అంటూ ఒకసారి జీవన గీతోపదేశం చేశాడు.
∙∙ 

సహస్రచంద్ర దర్శనమంటారు. ఉత్సవమైతే చేసుకోలేదుగానీ చిన్నాయిన వెయ్యి నిండు పున్నములు చూడగలిగాడు. చిన్నమ్మ కనుమరుగై పదేళ్లయింది.

ఆయన కొకడే కుమారుడు సీతాపతి. బుద్ధిగా చదువుకున్నాడు. డిగ్రీలో వాడికొచ్చిన మార్కుల్ని చూచి ఎమ్మెస్సీ ఫిజిక్సులో పిలిచి సీటిచ్చారు. అందులో యూనివర్సిటీకంతా ఫస్టొచ్చాడు. రాసి పడేసిన మొదటి అప్లికేషనుకే పాండిచ్చేరి యూనివర్సిటీలో పదవి దొరికింది. సముద్రతీరంలో దీపగృహ అపార్ట్‌మెంట్స్‌లో అయిదో అంతస్తులో తమ్ముడి నివాసం. ‘నడిచింది చాల్లే! ఇక ఊరుకో’ అంటూ అజ్ఞాత శక్తి సవాలు విసిరినట్టుగా అయిదారేళ్లనుంచీ చిన్నాయన్ను మోకాళ్ల నొప్పులు పీడిస్తున్నాయి. ‘మెట్లెక్కి దిగొద్దు. అనవసరంగా నడవొద్దు’ అని డాక్టర్లు గట్టిగా సలహా యిచ్చారు.

చిన్నాయన్ను చూచి రావడం కోసం ఏడాదికొకసారైనా నేను పాండిచ్చేరి వెళ్లొస్తూంటాను. వెళ్లినప్పుడల్లా తమ్ముడు చెబుతుంటాడు – ‘చూడన్నా! చెబ్తే చెవిలో వేసుకోడు. ఇరుపూటలా డాబాపైకి వెళ్లిపోతాడు. పచార్లు చేసినంతసేపూ చేసి, అక్కడే సిమెంటు బెంచ్‌పైన కూర్చుండిపోతాడు. ఎండ చురుక్కుమంటూ సోకితేగానీ దిగిరాడు...’

ఉదయం తొమ్మిదింటికీ పదింటికీ మధ్య డాబా నుంచి దిగిరాగానే స్నానాదికాలు ముగించి చిన్నాయన తూర్పువైపు కిటికీ దగ్గర ఈజీచైర్లో కూచుంటాడు. అర ఫర్లాంగు దూరంలో సముద్రం అలుపూ సొలుపూ లేకుండా అనంత జీవనగీతం ఆలాపిస్తూ ఉంటుంది.

మధ్యాహ్న భోజనానంతరం ఒక కునుకు తీశాక తన స్థానాన్ని పడమటివైపు కిటికీ దగ్గరకు మార్చుకుంటాడు. అల్లంత దూరంలోని ప్లే గ్రౌండులో పిల్లలు ఆడుకుంటూంటారు. ఆ క్రీడల సంరంభంలోనుంచి పెల్లుబికే జీవనోత్సాహాన్ని చూపులద్వారా తన గుండెల్లోకి ఆవాహన చేసుకుంటూన్నట్టు కనిపిస్తాడు.

‘వద్దు కదలొద్దు’ అని కడలిలో కెరటాలను కట్టడి చేయగలిగిన వాడెవరు?

(మధురాంతకం రాజారాం (1930–99) ‘ఆగనివేగం’ కథకు సంక్షిప్త రూపం ఇది. 1996లో ప్రచురితమైంది. తెలుగులో గొప్ప కథకుల్లో ఒకరైన రాజారాం సుమారు 375 కథలు రాశారు.)


మధురాంతకం రాజారాం

మరిన్ని వార్తలు