సమ్మర్ సెలవులు లేదా వేసవి హాలిడేస్...

6 Apr, 2016 22:54 IST|Sakshi
సమ్మర్ సెలవులు లేదా వేసవి హాలిడేస్...

సరదా సంసారం


ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి.

 

‘ఏమండీ... ఈ ఎల్లో సరిపోతుందా’ అంది మా ఆవిడ నా దగ్గరకు వచ్చి కలిపిన శనగపిండిని చూపిస్తూ. ఆమెనే ఆరాధనగా చూశాను. ఎవరైనా ఉప్పు సరిపోయిందా పచ్చి మిర్చి సరిపోయిందా అని అడుగుతారు. ఎల్లో సరిపోయిందా అని అడగడం ఏ భర్తకైనా అరుదుగా దొరికే ఆనందబాష్పకణం. ‘ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు పెట్టుకున్నావ్ చెప్పూ’ అన్నాను. ‘అదేమిటండీ... పిల్లలకు సెలవులు కదా. ఆడుకుంటున్నారు. కాసేపటికి సాయంత్రమవుతుంది. చిరుతిండి ఏదైనా అడిగితే ఏం పెట్టను? అందుకని మసాలా వడలు చేద్దామనుకుంటున్నాను. ఏడో క్లాస్‌లో ఒకసారి అమ్మమ్మ చేస్తుంటే చూశాను. అప్పుడు తను పొయ్యి మీద బాండిల్ పెట్టి వీటిని చేసిన గుర్తు’...

 
‘చేశాక నాకు పెట్టవు కదూ. దొంగ... చెప్పు... పెట్టవు కదూ’... ‘భలేవారే. మొదటి వడ మీరే తినాలి. ఈ హార్లిక్స్ సీసా ఎక్కడుందో’ ‘ఏమిటి... పిండిలో హార్లిక్స్ కలుపుతావా?’ ‘భలేవారే. నాకు ఆ మాత్రం తెలియదా. అందులో సోడా ఉప్పు దాచేనండీ’... కిచెన్‌లోకి వెళ్లిపోయింది. ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే అలాంటి లలితమైన సౌండ్లు మా చిన్నాడే చేస్తాడు. పరిగెత్తుకుంటూ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాను. ల్యాప్‌టాప్‌లో నుంచి తేలికపాటి పొగ వస్తోంది. వాడు విజయం సాధించినట్టుగా గంభీరంగా నవ్వుతున్నాడు. పెద్దాడు బిక్కముఖం వేసుకొని చూస్తున్నాడు.
 

ఫ్లాష్‌కట్: ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ‘మోటూ పత్లూ’ పెద్దాడు చూస్తున్నాడు. కాదు ‘షౌన్ ద షీప్’ చూడాలని చిన్నాడు ముచ్చటపడ్డాడు. పెద్దాడు వినలేదు. చిన్నాడు ఎర్రగడ్డలో కొన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ బ్యాట్ తీసుకొని ల్యాప్‌టాప్ మీద పట్టుదలగా ‘పుటుక్’మని కొట్టాడు. యూకు ట్యూబ్ పోయింది. నా సెన్సెక్స్ పతనమయ్యింది. మా ఆవిడ ఏం అనలేదు. నా వైపు చూసి ‘అప్పుడే చెప్పాను. అనుభవించండి’ అంది. ‘ఏదో నా తప్పులా మాట్లాడుతున్నావ్?’

 


‘మీ తప్పు కాదా. పెద్దాణ్ణి చూడండి ఎంత బుద్ధిగా ఉంటాడో! ఎందుకు?.. వాడి కాన్పు మా పుట్టింట్లో అయ్యింది కాబట్టి. రెండో కాన్పు కూడా మా పుట్టింట్లోనే చేద్దామండీ పిల్లలు బుద్ధిగా ఉంటారంటే విన్నారా? ఊహూ.. మా ఊళ్లో మా ఫ్యామిలీ డాక్టర్ భానుకట్ల విజయతోనే చేయించాలన్నారు. ఇప్పుడేమైంది? విజయ్ మాల్యాలాగా తయారయ్యాడు. మీ ఇళ్లల్లో పిల్లలంతా అంతేగా... కింగ్‌కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా’

 
‘శారదా’... ‘శంకర్ శాస్త్రీ’... ఆ అరుపుకు బిక్క చచ్చాను. ‘ఏం... మీకేనా గొంతు. మాకు లేదా. మేం మాత్రం మిరియాల పాలు తాగడం లేదా. మీరు ఎంత పెద్దగా అరిచినా వాస్తవం వాస్తవమే. మీ అన్నయ్య పిల్లలు,  చెల్లెలి పిల్లలు, తమ్ముడి పిల్లలు... హవ్వ.. హవ్వ... దేశీయ స్టెంట్ కంపెనీలన్నీ మీ పేరు చెప్పుకునే కదండీ బతుకుతున్నాయి. వీళ్ల అల్లరికే కదా మీ ఊళ్లో నిక్షేపంలా ఉన్నవాళ్లంతా గుండెకి ఒక స్టెంటు రెండు స్టెంట్లూ వేసుకొని తిరుగుతున్నారు.’... లాభం లేదు ఎదురుదాడి చేయాల్సిందే.‘ఆ మాటకొస్తే మీవాళ్ల పిల్లలు మాత్రం తక్కువా? మొన్న మీ ఊరి పేరు పేపర్లో వేశారు చూళ్లేదా? మీ ఊళ్లోకి ఒక్క కోతి కూడా రావడం లేదని విడ్డూరంగా రాశారు. మీ కొండముచ్చులుండగా కోతులెందుకొస్తాయ్? వాటి సేఫ్టీ అవి చూసుకోవూ’ ‘మాటలు నేర్చిన యాంకర్ వాట్సప్ అంటే థమ్సప్ అదంట. అలా ఉంది మీరు మాట్లాడటం’

 
‘ఖుదా మెహర్బాన్‌తో గధా పహిల్వాన్.. అలా ఉంది నువ్వు చెప్పడం’... ‘నాకు హిందీ రాదని ఆ భాషలో వాగకండి’.. ‘ఇంకా వాగుతాను. పోవే ఖాందన్.. ఘరోండా... జ్యోతీ బనేగీ జ్వాలా.. ఖూన్ కా రిష్తా’.... అవన్నీ ఏవో భారీ బూతు తిట్లు అనుకుని చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలని మా ఆవిడ ఆ ఏర్పాట్లలోకి వెళ్లింది. ఈలోపు హాల్లో నుంచి మళ్లీ ఏవో మృదువైన శబ్దాలు రావడం మొదలెట్టాయి. పరిగెత్తి చూశాను. వంశాంకురాలిద్దరూ టీవీ దగ్గర ఉన్నారు. స్టార్ మూవీస్ చూడాలని పెద్దాడు.. డిస్నీ ఎక్స్‌డి చూడాలని చిన్నాడు... సున్నితమైన చర్యలతో ఒకరి పై మరొకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అమీర్‌పేట సర్దార్‌జీ షాపులో కొన్న టేబుల్ టెన్నిస్ బ్యాట్ చిన్నాడి చేతిలో సిద్ధంగా ఉంది... ‘శారదా’ పెద్దగా అరిచాను. ‘శంకరశాస్త్రి’... మా ఆవిడ జవాబిచ్చింది.ఇక ఈ వేసవి హాలిడేస్ జాలీ జాలీగా గడవబోతున్నందుకు ఎంతో రొమాంచితంగా అనిపించింది.

 - భా.బా

 (భార్యా బాధితుడు)

 తాజా కలం: గీతాకారుడిలా సెలవిస్తున్నాడు... పార్థా! డాబర్ వారి చాందీసోనా చవన్‌ప్రాశ్ రెండు పూటలా రెండు చెంచాలు పుచ్చుకొనుము. వీలైనచో పచ్చిపాలు తాగి బస్కీలు తీయుము. వేసవి సెలవుల్లో భార్యా పిల్లలను ఎదుర్కొనడానికి నాకు తెలిసినది చెప్పాను. నీకు తెలిసినదుంటే నాకు తెలియజేయుము.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా