పచ్చడిపిందెలు.. కాయపచ్చళ్లు

5 May, 2018 00:23 IST|Sakshi

వేసవికాలం... ఎండలు మండుతుంటాయి. ఒక పక్క వేడి గాలులు ... మరో పక్కనుంచి మామిడి గాలులు. కాయలు పెద్దవయ్యేలోపు రాలిన పిందెలతో కొన్ని ...  కాయ పదునుకొచ్చాక మరికొన్ని చేసేయొద్దూ..! పిందే కదా అని ఏరి పారేయద్దు... అందులోనూ రుచి ఉంది. మనవి కొన్ని, పొరుగు రాష్ట్రానివి కొన్ని కలిపి ఊరగాయలు పట్టేద్దాం.   మామిడి రుచిని ఆస్వాదిద్దాం.

వడు మాంగా
కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు (పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్‌ స్పూన్లు
పొడి కోసం ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను

తయారీ:ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి ∙ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి. (అలా చేయడం వల్ల నూనె అన్ని మామిడి పిందెలకు అందుతుంది) ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙మరిగించి చల్లార్చిన పావు కప్పు నీళ్లు జత చేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ∙రోజుకి మూడు నాలుగుసార్ల చొప్పున అలా సుమారు మూడు రోజులు కలపాలి ∙మామిడిపిందెలు మెత్తగా అయ్యి వడు మాంగా తినడానికి అనువుగా తయారవుతుంది.

టెండర్‌ మ్యాంగో పికిల్‌
కావలసినవి: మామిడి పిందెలు – 4 కప్పులు; ఉప్పు – ముప్పావు కప్పు; ఆవాలు – టేబుల్‌ స్పూను; పసుపు – ఒకటిన్నర టీ స్పూన్లు; నువ్వుల నూనె – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 20

∙తొడిమలను చాకుతో కట్‌ చేయాలి ∙రాతి ఉప్పును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక పసుపు,  తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ∙పెద్ద పాత్రలో మామిడి పిందెలు వేసి వాటి మీద నువ్వుల నూనె వేసి బాగా కలపాలి ∙ఆవపిండి వేసి మరోమారు కలపాలి ∙చివరగా ఉప్పు వేసి బాగా కలిపి, పెద్ద మూతి ఉన్న జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల పాటు ప్రతిరోజూ రెండు పూటలా పైకి కిందకి కలుపుతుండాలి ∙నాలుగో రోజుకి బాగా ఊట కిందకి దిగుతుంది ∙మిక్సీలో ఎండు మిర్చి వేసి పొడి చేయాలి ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఊరగాయ లోనుంచి వచ్చిన ఊట కొంత తీసి, ఎండుమిర్చి పొడిలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పెద్ద పాత్రలోకి ఊరగాయ తిరగదీసి, దాని మీద ఈ మిశ్రమం వేసి బాగా కలిపి, జాడీలోకి తీసుకోవాలి ∙పది రోజుల పాటు ప్రతిరోజూ పైకి కిందకి కలపాలి ∙ఊటంతా దిగి, ఊరగాయ తయారయిన తరవాత అన్నంలో కలుపుకుని తినాలి.

కన్ని మాంగా అచార్‌
కావలసినవి:
మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి)

తయారీ: ∙ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, తొడిమలు కట్‌ చేయాలి ∙తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ∙ఒక పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద చల్లారబెట్టుకున్న నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ∙నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ∙ఈ నీటికి కారం, ఇంగువ, ఆవపొడి జత చేసి బాగా కలపాలి ∙ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి.

స్వీట్‌ పికిల్‌
కావలసినవి: పచ్చి మామిడికాయలు – 3 (తురమాలి); పంచదార /బెల్లం పొడి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; మిరపకారం – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; వేయించిన జీలకర్ర – టీ స్పూను; వేయించిన ధనియాలు – ఒక టీ స్పూను; నిమ్మరసం – 2 టీ స్పూన్లు

తయారీ: పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి, తుడిచి, తొక్క తీసేసి, కాయలను సన్నగా తురమాలి ∙ఒక పెద్ద పాత్రలో మామిడికాయ తురుముకి ఉప్పు, పంచదార, పసుపు, మిరప పొడి, నిమ్మరసం జత చేసి బాగా కలిపి, సుమారు ఆరుగంటలసేపు ఎండలో ఆరబెట్టాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మామిడి మిశ్రమం అందులో వేసి బాగా కలిపి, మంట తగ్గించి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలిపి, దింపేసి చల్లారనివ్వాలి ∙జీలకర్ర పొడి, ధనియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ∙గాలి చొరని జాడీలోకి తీసుకుని, ఫ్రిజ్‌లో ఉంచాలి.

కడు మాంగా అచార్‌
కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్‌స్పూన్లు

తయారీ: మామిడిపిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ∙పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙చివరగా మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక దింపి, చల్లారాక గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి (ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుము కలుపుకోవచ్చు).

తోతాపురి పికిల్‌
కావలసినవి: మామిడి కాయ – 1 (పెద్దది); మిరప కారం – 4 టీ స్పూన్లు; వేయించిన మెంతుల పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను

తయారీ: మామిడికాయను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టాలి ∙సన్నగా పొడవుగా చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ∙ఒక గిన్నెలో కప్పుడు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగాక, మిరపకారం జత చేసి బాగా కలిపి దించేయాలి. (ఇది సూప్‌లా ఉండాలి, నీళ్లలా ఉండకూడదు. అవసరమనుకుంటే మరి కాస్త కారం జత చేయాలి) ∙కొద్దిగా చల్లారాక ఈ నీళ్లను మామిడికాయ ముక్కల మీద పోయాలి ∙మెంతి పొడి కూడా వేసి కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగిన తరవాత ఆవాలు, ఇంగువ వేసి వేయించి, ఆ నూనెను మామిడి కాయ ముక్కల మీద పోసి బాగా కలపాలి. (ఉప్పు కాని కారం కాని చాలకపోతే, మరికాస్త జత చేయొచ్చు)

మామిడి తురుము పచ్చడి
కావలసినవి: పచ్చి మామిడి కాయలు – 2 (మీడియం సైజు); మిరప కారం – అర కప్పు; ఆవ పిండి – అర కప్పు; ఉప్పు – అర కప్పు; మెంతి పొడి – టీ స్పూను; జీలకర్ర పొడి – టేబుల్‌ స్పూను; ఇంగువ – టీ స్పూను; నువ్వు పప్పు నూనె – పావు కేజీ; మినప్పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; ఎండు మిర్చి – 1 

తయారి: మామిడికాయల తొక్కు తీసి, కాయను సన్నగా తురమాలి ∙బాణలిలో నూనె లేకుండా మెంతులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, పసుపు, మిరప కారం పొడులు జత చేసి బాగా కలపాలి ∙ఈ మిశ్రమంలో మామిడి తురుము వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేడి చేసి మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, జీలకర్ర పొడి, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, దింపి, చల్లారాక, తయారుచేసి ఉంచుకున్న మామిడి తురుము మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచాలి ∙ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది ∙ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, ఫ్రిజ్‌లో పెట్టాలి.

వెల్లుల్లి మామిడి తురుము
కావలసినవి: మామిడికాయ తురుము – 2 కప్పులు; నూనె – అర కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 10; ఇంగువ – పావు టీ స్పూను; ఆవాలు – 3 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; మెంతులు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4

తయారీ: జీలకర్రను, మెంతులను బాణలిలో నూనె లేకుండా విడివిడిగా వేయించి తీసేయాలి ∙మిక్సీలో ఆవాలు, వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర వేసి మెత్తగా పొడి చేయాలి ∙ఒక పాత్రలో మామిడికాయ తురుము వేసి, మెత్తగా పొడి చేసిన ఆవాల మిశ్రమం జత చేయాలి ∙మిరపకారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో కప్పుడు నూనె వేడయ్యాక, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, మెత్తగా చేసిన వెల్లుల్లి ముద్ద వేసి వేయించి దింపి, చల్లారాక మామిడి తురుము మిశ్రమానికి జత చేయాలి ∙గాలి చొరని డబ్బాలో నిలవ చేసుకోవాలి ∙రోటీలు, పరాఠాలలో రుచిగా ఉంటుంది.

పచ్చి మామిడి మర్మాలు
వేసవి వచ్చిందంటే ఊరగాయలు పెడుతూ అటు అమ్మలు, ఇటు అమ్మమ్మలు బిజీబిజీగా ఉంటారు. ఎప్పుడెప్పుడు మామిడిపళ్లు, ఆవకాయ, పెరుగన్నం తిందామా అని ఎదురుచూస్తుంటారు అందరూ. ముఖ్యంగా పిల్లలకు మామిడికాయ పేరు చెప్పగానే పులుపు గుర్తుకు వచ్చి నోరు ఊరుతుంది. పళ్లు జిల్లుమంటాయి. పళ్లనే కాదు మనసును ఝల్లనిపించే ఈ మామిడిలో దాగున్న రహస్యాలు ఎన్నో.

►పచ్చి మామిడికాయ ఒంటి వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది.
►శరీరంలో ద్రవాల స్థాయి తగ్గకుండా చూస్తుంది.
►వడదెబ్బ కొట్టే లక్షణాలు కనిపిస్తే పచ్చిమామిడికాయ తీసుకోవడం మంచిది.
►మధుమేహం ఉన్నవారు పచ్చిమామిడికాయలను పెరుగు, అన్నంతో తీసుకుంటే సుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.
►ఎలక్ట్రొలైట్స్‌ను పచ్చిమామిడికాయ బ్యాలెన్స్‌ చేస్తుంది. అందువల్ల రక్తప్రసరణ అదుపులో ఉండి, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
►పచ్చిమామిడి మన శరీరంలో క్యాలరీలు కరిగించి, బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.
►పచ్చి మామిడిలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది.
►కూరలలో స్నాక్స్‌లో పచ్చిమామిడికాయను జత చేయడం వల్ల అజీర్ణ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
►ఎసిడిటీ నుంచి దూరం కావొచ్చు.
►వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది.. 
► వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
►కాలేయ సంబంధిత సమస్యలు నివారించడంలో పచ్చి మామిడి శక్తిమంతంగా పనిచేస్తుంది. 
►ఒక ముక్క పచ్చి మామిడి నమలడం వల్ల ప్రేగులు శుభ్రపడి, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ దూరమవుతాయి.
► పంటి ఆరోగ్యం మెరుగవుతుంది. చిగుళ్లు బలంగా అవుతాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గి, దుర్వాసన పోతుంది.
►కొత్త రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది.
► పచ్చి మామిడిరసం తాగడం వల్ల అధిక చెమటను నివారించుకోవచ్చు.
►మలబద్దకం సమస్యను దూరం చేస్తుంది
►పెద్ద పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
►వేసవి ఎండ కారణంగా శరీరం కోల్పోయే సోడియం, ఐరన్‌ వంటి ఖనిజాలను తిరిగి భర్తీ చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించి, వేడిని తగ్గిస్తుంది.

ఫుడ్‌ ఫ్యాక్ట్స్‌

శీతల పానీయాలు సేవించడం వలన కలిగే నష్టాలు
∙మధుమేహం, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ∙చిన్నతనంలోనే ఊబకాయం ∙గుండె జబ్బులు ∙దంతక్షయం ∙ఆస్టియో పోరోసిస్‌ వ్యాధి వచ్చి, ఎముకలు విరిగే అవకాశం ∙మూత్రపిండాల వ్యాధులు ∙కాలేయం పెరిగే అవకాశం ఎక్కువ (లివర్‌ సిరోసిస్‌) ∙క్యాన్సర్‌ వ్యాధి బారిన పడే అవకాశం ∙నిద్రలేమి ∙ఆస్త్మా  ∙స్త్రీలకు గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం

మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్‌ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారుచేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జత చేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్‌... ఎవరైనా వంట చేసి లొట్టలేయించవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్‌.familyvantakalu@gmail.com

మరిన్ని వార్తలు