ఆహా! ఉప్పు చేప.. జొన్న రొట్టె

1 Mar, 2020 08:06 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో :  కొంత కాలంగా చికెన్‌ విషయంలో రకరకాల అపోహలకు గురవుతున్న నగరవాసులు సీఫుడ్‌ మీద తమ దృష్టిని మళ్లిస్తుండడంతో ఈ మధ్య  సీ ఫుడ్‌ కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా ఏర్పాటవుతున్నాయి. సీఫుడ్‌ని ఆహారం ఇష్టపడేవాళ్లతో పాటు దాన్నే ఆదాయమార్గంగా మలచుకున్న కొందరు మహిళలు. రెస్టారెంట్స్‌లో వంటకాలు తయారు చేసే చెఫ్‌లకు ధీటుగా  ఫిష్‌ ఫుడ్‌ ఫెస్ట్‌లో డిష్‌లను తీర్చిదిద్దారు. మిగతా నాన్‌వెజ్‌ ఉత్పత్తులతో పోలిస్తే ఫుడ్‌ మార్కెటింగ్‌ కాలుష్యం పెద్దగా సోకనిది సీ ఫుడ్‌. దీనికి కారణం వీటి పెంపకంలో ఎక్కువగా సహజసిద్ధమైన పద్దతుల పైనే  ఆధారపడడమే. ఆరోగ్యపరమైన అనుకూలతలున్నా... డిమాండ్‌ విషయంలో చికెన్‌తో పోలిస్తే ఫిష్‌ వెనుకబడడానికి కారణం చికెన్‌లో లభించే వైవిధ్యభరిత వంటకాలే. ఈ పరిస్థితిని అధిగమిస్తూ ఫిష్‌ వంటకాల్లోనూ  వెరైటీలు చికెన్‌కు పోటీగా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి అద్దం పట్టింది ఫిష్‌ ఫుడ్‌ ఫెస్ట్‌. 

కేఎఫ్‌సీ ఫిష్‌... 
ఈ పేరు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేఎఫ్‌సి అంటే కేవలం చికెన్‌ మాత్రమేనా ఫిష్‌ ఎందుకు కాకూడదు అనుకున్నారేమో..పాశ్చాత్య పద్ధతిలో కేఎఫ్‌సి  ఫిష్‌ ఫ్రై ని జ్యోతి వండారు. ఇందులో కూడా ముల్లులేవీ లేకపోవడం వల్ల వీటిని హాయిగా చిప్స్‌ తిన్నట్టుగా తినేయవచ్చు.  

ఉప్పు చేప జొన్న రొట్టె.. 
పాత తరం వారు అమితంగా ఇష్టపడే వంటకాల కాంబినేషన్‌ ఉప్పుచేప జొన్నరొట్టె. ఇందులో భాగంగా సముద్ర చేపలైన కొర్రమీను, బొచ్చె, బంగారు తీగ లాంటి చేపలను శుభ్రం చేసి వేయించి దంచిన మెంతులు, మసాలాలతో కలిపి వండుతారు. దీనికి జతగా సహజంగా పండించిన జొన్న పిండితో చేసిన రొట్టెలను వాడతారు. జొన్న పిండిలోని ప్రొటీన్స్, చేపలోని విటమిన్స్‌ కండ పుష్టికి ఉపయోగపడతాయి అంటున్నారు వీరాభిమన్యునగర్‌కి చెందిన మహిళలు. ఫిష్‌ టిక్కా, ఫిష్‌ కట్‌లెట్, పకోడీ, లాలీపప్‌ వంటి వెరైటీలనూ వీరు తయారు చేశారు.  

కుండచేపల పులుసు  
ఒకప్పుడు కుండలు, మట్టి దొంతులు వంటసామగ్రిగా వాడేవారు. ఈ మట్టి పాత్రల్లో చేప పులుసు ఉడకడంతో ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచి రావడమే కాకుండా ఆరోగ్యకరం కూడా. అందుకే కుండతో వండే చేపల పులుసు క్రేజీగా మారుతోంది.  

మెంతి ఫిష్‌ కర్రీ 
దీనిని పిల్లలు ఇష్టంగా తింటారని, ఇందులో కారం, పులుపు తక్కువ మోతాదులో వేసి కాసింత పచ్చిమిరప, మెంతీ పేస్ట్‌తో తయారు చేశానని శ్వేత చెబుతున్నారు. డయాబెటిస్‌ వంటి సమస్యలు ఉన్నవారికి ఇటు పత్యంగానూ, అటు ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుందని ఆమె చెప్పారు.  

బిర్యానీ... 
హైదరాబాద్‌ అంటేనే బిర్యానీ గుర్తుకు వస్తుంది. అయితే బిర్యానీకి సంబంధించి చికెన్‌ తర్వాతే ఏదైనా అంటారు భోజన ప్రియులు. ఈ నేపథ్యంలో బాస్మతి రైస్‌ తీసుకుని చేపలు, రొయ్యలుతో హైదరాబాదీ స్టైల్‌లో వండిన బిర్యానీ అందుకు ధీటుగా ఉంటుందని సీ ఫుడ్‌ తయారీలో చేయి తిరిగిన మహిళలు చెబుతున్నారు.  

పిలాతీ...ఫ్రై 
చైనీస్‌ వంట తీరుతో హైద్రాబాదీ మసాలాలు దట్టించి రొయ్యల వేపుడు చేశారు స్వరూప.  అదే విధంగా ఫిష్‌ ఫ్రై కూడా వండారు. ఇందులో సముద్రంలో లభించే ఫిలాతీ రకం చేపను వాడానని, ఈ చేపలో కేవలం ఒకటే ముల్లు ఉంటుందని, పిల్లలు, వృద్ధులు తినడానికి సులభంగా ఉంటుందని వివరించారామె.  

అపోలో...ఫ్రై 
నగరంలో అపోలో ఫిష్‌కి ఉన్న క్రేజ్‌కి ప్రధాన కారణం అందులో అతి తక్కువగా లేదా అసలు ముల్లు లేకపోవడం అనేది తెలిసిందే. ఈ అపోలో ఫిష్‌కి మంచి రుచి రావడం కోసం అల్లం, వెల్లుల్లి, దంచిన మసాలాలు, కారం, జీలకర్ర పోడితో చేసిన మిశ్రమంతో గంట సేపు నిల్వచేసి ఆ తర్వాత ఫ్రై చేయడం వల్ల మంచి రుచి వచ్చిందని హేమలత చెప్పారు. 

వెస్ట్రన్‌ స్టైల్‌.. 
కమలా నగర్‌కి చెందిన రాజశ్రీ, అనిత, విజయలక్ష్మి, ధనలక్ష్మి, రేణుకలు అందరూ కలిసి  రెస్టారెంట్స్‌లో మాత్రమే లభ్యమయ్యే  వెరైటీ వంటకాలతో అందరినీ ఆకట్టుకొన్నారు. వీరి వంటకాలు ఫిష్‌ రోల్స్, ఫిష్‌ మంచూరియా, రొయ్యల సమోసా, రోయ్యల బిర్యానీ, ఫిష్‌ బిర్యానీ వంటివాటిలో కొన్ని రెస్టారెంట్స్‌లో కూడా లభించవు. కేరట్‌తో పాటు కొన్ని కూరగాయలు, సీ ఫుడ్‌ కలిపి గ్రైండ్‌ చేసిన తర్వాత ఆ మిశ్రమానికి బ్రెడ్‌ పొడిని అంటిస్తామని తద్వారా లోపల మెత్తగా, పైన పెలుసుగా ఉంటూ అచ్చం కెఎఫ్‌సి తరహాలో ఈ ఐటమ్స్‌ వండామని వీరు చెప్పారు.

రెడీ టూ ఈట్‌... 
వెంటనే తినే వంటకాలే కాకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే ఫిష్, ఫ్రాన్స్‌ చట్నీలను తయారు చేస్తున్నారు స్వర్ణలత. ఇందులో వాడిన ఫ్రాన్స్‌ విశాఖపట్నం నుంచి వచ్చాయని, సముద్ర చేపలతో చేసిన చెట్నీలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా పలు రకాల రెడీ టూ ఈట్‌ ఫిష్‌ ప్యాకెట్స్‌ కూడా ఆమె రెడీ చేయడం విశేషం.  

సీ ఫుడ్‌.. దాబా స్టైల్‌... 
సోమాజిగూడలోని మెర్క్యురీ హోటల్‌లో మార్చ్‌ 2న  వీకెండ్‌ ధాబా ఫుడ్‌ ఫెస్ట్‌ని నిర్వహించనున్నారు.  ఇందులో భాగంగా  పంజాబీ, బెంగాలీ స్టైల్‌లో సీ ఫుడ్‌ను అందించనున్నారు. ఇది డిన్నర్‌ సమయంలో సాయంత్రం 4–7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

మరిన్ని వార్తలు