అటుకిటుకులు

2 Feb, 2019 00:53 IST|Sakshi

అటు ఇటు తిరుగుతూ దంచుకుని... మంచుకునే సూపర్‌ స్నాక్‌. అటుకుల వంటకాలు చిటికెలో అయిపోతాయి. చేయడానికి ఇన్ని కిటుకులు ఉన్నాయి.

అటుకులమిక్స్చర్‌
కావలసినవి: పల్చటి అటుకులు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పుట్నాల పప్పు – పావు కప్పు; వేయించిన జీడి పప్పులు – పావు కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు; కిస్‌మిస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; నూనె – పావు కప్పు;  బెల్లం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – అర టేబుల్‌ స్పూను
పోపు కోసం... కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా ;

తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, అటుకులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నూనె వేసి కాగాక, పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ముక్కలను తీసి పక్కన ఉంచాలి ∙పుట్నాల పప్పు, జీడి పప్పులు, కిస్‌మిస్‌లను కూడా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి.

అదే బాణలిలో అర టేబుల్‌ స్పూను నూనె వేసి కాగాక, మంట తగ్గించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు జత చేయాలిబెల్లం పొడి జత చేసి కలిపి, రంగు మారుతుండగా, వేయించిన అటుకులు జత చేసి ఐదు నిమిషాల పాటు కలపాలి ∙వేయించిన డ్రై ఫ్రూట్స్‌ జత చేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక గాలిచొరని డబ్బాలో నిలవ చేసుకోవాలి ∙టీ టైమ్‌లో తినడానికి బాగుంటుంది.

కిటుకు: కొద్దిగా నెయ్యి, కొద్దిగా గరం మసాలా జత చేస్తే మిక్స్చర్‌ మరింత రుచిగా ఉంటుంది.

అటుకులలడ్డూ
కావలసినవి: అటుకులు – ఒక కప్పు; గింజలు తీసిన ఖర్జూరాలు – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం పొడి – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన నువ్వులు – ఒక టేబుల్‌ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను.

తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి వేయించి తీసేయాలి ∙మిక్సీ జార్‌లో అటుకులు, ఖర్జూరాలు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, ఆ మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకోవాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, అటుకుల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి. 

కిటుకు: ఈ జీడి పప్పుల పొడి జత చేస్తే లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి.

అటుకుల పునుగులు
కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పెరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్‌ తురుము – ఒక టేబుల్‌ స్పూను; బంగాళదుంప తురుము – ఒక టేబుల్‌ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 3; కొత్తిమీర తరుగు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ఒక పాత్రలో అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి, ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి ∙రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, గట్టిగా పిండి, నీళ్లు వేరు చేయాలి ∙ఒక పాత్రలో అటుకులు, బియ్యప్పిండి, ఉల్లి తరుగు, క్యారట్‌ తురుము, బంగాళదుంప తురుము, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, పెరుగు వేసి పునుగుల పిండిలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ∙పిండిని పునుగుల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.

కిటుకు: నానబెట్టి, ఉడికించిన సగ్గుబియ్యాన్ని (రెండు టీ స్పూన్లు) జత చేస్తే పునుగులు మెత్తగా వస్తాయి.


అటుకులచిక్కీ
కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి దోరగా వేయించాలి ∙ఒక పాత్రలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి ఉండ పాకం వచ్చే వరకు కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, బాదం పప్పుల పొడి, జీడి పప్పుల పొడి వేసి కలిపి దింపేయాలి   నెయ్యి వేసి కలియబెట్టాలి ∙ఒక ప్లేటుకి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న అటుకుల చిక్కీ మిశ్రమాన్ని అందులో పోసి, గరిటెతో సమానంగా పరవాలి ∙కొద్దిగా గట్టిపడుతుండగా, చాకుతో ముక్కలుగా కట్‌ చేసి, చల్లారాక ముక్కలను గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
 
కిటుకు: పాకంలో నెయ్యి వేసి కలిపితే చిక్కీ చూపడటానికి అందంగా ఉంటుంది.

అటుకుల పులిహోర
కావలసినవి: అటుకులు – 2 కప్పులు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; వేయించిన పల్లీలు – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన జీడి పప్పులు – 15; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 4 రెమ్మలు; పసుపు–పావు టీ స్పూను; ఉప్పు – తగినంత.

తయారీ: ∙చింతపండును రెండు కప్పుల నీళ్లలో అరగంట సేపు నానబెట్టాక, రసం తీయాలి ∙అటుకులను శుభ్రంగా కడిగి, చింతపండు రసంలో నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో... చింతపండులో నానబెట్టిన అటుకులు, పోపు, పసుపు, ఉప్పు వేసి గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టి అరగంట తరవాత తింటే రుచిగా ఉంటుంది.

కిటుకు: తగినంత చింతపండు రసం మాత్రమే తీసుకుంటే రుచిగా ఉంటుంది. 

మరిన్ని వార్తలు