లంక విభీషణుడిదే!

4 Apr, 2017 23:55 IST|Sakshi
లంక విభీషణుడిదే!

సీతాపతి

రావణ సంహారం జరిగాక ఆయనకు అంత్యక్రియలు జరిపేందుకు విభీషణుడు వెనకాడాడు. దీనిని రాముడు తప్పు పట్టాడు. మరణంతో శత్రుత్వం సమసిపోయినట్లేననీ ఇప్పుడు నీ అన్న నీకెంతో నాకూ అంతే అని... దగ్గరుండి మరీ విభీషణుని చేత అంత్యక్రియలు జరిపించాడు. రావణుడు మనసు పడి కట్టించుకున్న కోటను యుద్ధం తర్వాత స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించి అన్నతో చెప్పాడు. రావణ రాజసౌధం సామాన్యమైంది కాదు. అంతా మణిమయమే. ఎటు చూసినా బంగారమే.

కానీ రాముడు ఏమాత్రం దురాశ పడలేదు. లంకానగరం విభీషణునికే దక్కుతుందని చెప్పి ఆయనకే పట్టం కట్టి శీలం చాటుకున్నాడు. అంతేకాదు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ... లంకానగరం కన్నా, పుట్టి పెరిగిన అయోధ్యే నాకు మిన్న...’ అంటూ లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరించాడు. అయోధ్యానగరానికి పట్టాభిషిక్తుడైన తర్వాత ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చాడు. ఆయన పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంది. అందుకే రామరాజ్యం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు.

 

మరిన్ని వార్తలు