ఆటోరిక్షా.. హ్యాండ్‌వాష్‌

24 May, 2020 05:12 IST|Sakshi

హ్యాండ్‌వాష్‌ సదుపాయంతో ఆటోరిక్షా నడుస్తున్నట్లు చూస్తే ఆశ్చర్యపోతారు. తన ప్రయాణికులు వాహనం ఎక్కే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచిస్తున్న ఆటోరిక్షా డ్రైవర్‌ సురేష్‌ కుమార్‌ను కలిస్తే అతని సృజనాత్మక పనికి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఉండలేరు. కేరళ రాష్ట్రం తిరువంతపురంలోని సురేష్‌ తన ఆటోకు నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన పొడవాటి పివిసి పైపును అమర్చాడు. దీని ద్వారా ప్రయాణికులు చేతులు కడుక్కోవడానికి వీలుగా ట్యాప్‌ను సెట్‌ చేశాడు.

వాహనంలో ఎక్కడానికి, దిగడానికి ముందు ఉపయోగించడానికి వీలుగా ఆటోలో హ్యాండ్‌ శానిటైజర్లు కూడా ఉంచాడు. ప్రయాణికులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం వంటి జాగ్రత్తలు కూడా సురేష్‌ తీసుకుంటున్నాడు. ఆటో డ్రైవర్ల బృందం లాక్డౌన్‌ సమయంలో రోగుల ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ‘జనమైత్రి ఆటో డ్రైవర్స్‌’ కూట్టైమా’అనే ట్రస్ట్‌ కింద 20 మంది తోటి డ్రైవర్లతో పాటు సురేశ్‌ ఈ సేవను కొనసాగిస్తున్నారు. ఈ బృందం రోజులో ఎప్పుడైనా నగరంలోని రోగుల కోసం హాస్పిటల్స్‌కు ఉచిత పిక్‌ అప్, డ్రాపింగ్‌ సేవలను అందిస్తుంది.

‘నిబంధనల ప్రకారం, ఒకే కుటుంబానికి చెందినవారైతే ముగ్గురు లేదంటే ఒక ప్రయాణికుడిని మాత్రమే తీసుకెళ్లడానికి మాకు అనుమతి ఉంది. ఎక్కువగా నేను హాస్పిటల్‌ లేదా రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతుంటాను. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ హ్యాండ్‌ వాష్‌ సెటప్‌తో నా ప్రయాణికులను, నన్ను నేను సురక్షితంగా ఉంచాలని అనుకున్నాను. నేను రోజూ ఉదయం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆటో నడుపుతాను. అత్యవసర పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువే ఉంటుంది ‘అని సురేష్‌ చెప్పారు.

జనమైత్రి సమూహంలో భాగమైన డ్రైవర్లు 23 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. కాబట్టి, వారి భద్రతకు భరోసా కూడా అవసరం. భౌతిక దూరంలో భాగంగా సురేష్‌ తన వాహనాన్ని వైరస్‌ నుంచి వేరుచేసే కవచాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు. దానిలో భాగంగా పీవీసీ పైపుతో ఓ చిన్న వాటర్‌ట్యాంక్‌ను అమర్చి దాని ద్వారా ప్రయాణికులు చేతులు శుభ్రపరుచుకునేలా జాగ్రత్తపడుతున్నాడు. ‘ప్రస్తుతం, నా వాహనానికి మాత్రమే హ్యాండ్‌ వాషింగ్‌ సౌకర్యం ఉంది. ఈ సదుపాయాన్ని అన్ని జనమైత్రి ఆటోరిక్షాల్లో అందుబాటులో ఉంచాలనుకుంటున్నాను’ అని చెబుతున్న సురేష్‌ను చూసి బాగా చదువుకున్న వాళ్లు కూడా ఎంతో నేర్చుకోవాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా