ఆదిదేవ నమస్తుభ్యం...

22 Jan, 2015 23:16 IST|Sakshi
ఆదిదేవ నమస్తుభ్యం...

‘ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం’ అని రామాయణం చెబుతుంది. అంతటి మహిమాన్విత దైవంగా గ్రహరాజు, త్రిమూర్తి స్వరూపుడైన  శ్రీసూర్యనారాయణస్వామి దక్షిణ భారతాన కళింగ దేశంల  అరసవల్లి క్షేత్రంలో వెలిశాడు. విశ్వ విఖ్యాతమైన ఈ
 దేవాలయానికి గల 5 ద్వారాల నుంచి ప్రతి సంవత్సరం రెండు ఆయనాలలో అంటే మార్చి 7 నుంచి 10 వరకు, మరలా అక్టోబరు 1, 2, 3 తేదీలలో ప్రాతఃకాల  సూర్యకాంతి నేరుగా శ్రీస్వామివారి  పాదపద్మాలపై పడటం విశేషం.  మాఘశుద్ధ సప్తమీ సోమవారం
అనగా జనవరి 26 నాడుఈ క్షేత్రంలో సూర్యజయంతి  ఉత్సవాలు జరగనున్న సందర్భంగా  ఈ వ్యాస కుసుమం.
 
ఆంధ్రప్రదేశంలో శ్రీకాకుళం పట్టణంలో అరసవల్లి క్షేత్రంలో శ్రీఉషా, ఛాయా, పద్మినీ సమేత శ్రీసూర్యనారాయణ స్వామివారిని దేవరాజయిన ఇంద్రుడు లోక కల్యాణార్థం ప్రతిష్టించినట్లు పురాణగాథల మనకు తెలుస్తోంది.
 
అలనాటి హర్షవల్లే.. నేటి అరసవల్లి!

క్షేత్రంలో ప్రవేశించగానే ఒక విధమైన హర్షాతిశయం కలుగుతున్నందువల్ల దీనిని ‘హర్షవల్లి’గా పిలవవచ్చు. సూర్యనారాయణ మూర్తి సాన్నిధ్యం వల్ల చాలా ఆనంద ప్రదమైన సుఖశాంతులు ఇచ్చే దివ్య క్షేత్రం ఇది. దీనిని అన్మోహరక్షేత్రం అని కూడా పెద్దలు అంటారు. అర్మస్సు అనగా మూలవ్యాధి, ఇదొక మొండి తెగులు. అట్టి జబ్బులను తొలగించు దివ్యక్షేత్రం అవటంతో ‘అర్సవల్లి’ అనికూడా అంటారు.
 
పుష్కరిణీ విశిష్టత


ఇక్కడి పుష్కరిణిని దేవేంద్రుడు తన వజ్రాఘాతంతో తవ్వేడని, ఆలయ మూలవిరాట్టు శ్రీసూర్యనారాయణ మూర్తి విగ్రహం ఇందులో లభించిందని, దేవేంద్రుడు అక్కడ ప్రతిష్ట చేశాడని స్కాందపురాణంలో ఉంది. ఆ జలంలో కొన్ని రోగ నిర్మూలన ఔషధాలైన లవణాలు ఉన్నాయని, వాటికి అన్ని రోగాలను తొలగించే శక్తి ఉందని అభిజ్ఞులు చెప్పగా, శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నారు. సర్వపాప ప్రణాశనమై, సర్వరోగ నివార కమైన ఈ జలం ఎప్పుడూ అమృతాయమానంగా ఉంటుంది.
 
ఆలయ ప్రాశస్త్యం

 ఆలయ ప్రాకారం అంబరాన్ని చుంబించేంతగా శిఖరాలతో కనపడుతుంది. ఆలయ ప్రవేశానికి ముందు గోపురం అతి ప్రాచీనం కాకున్నా అందంగా అమరికైన శిల్పంతో ఉంటుంది. ఆలయావరణ చాలా పెద్దది. గరుడ స్తంభం దాటిన వెంటనే ముఖమండపం చేరుతాం. శ్రీస్వామివారి దేవాలయాన్ని కళింగ శిల్పశైలిలో నూతనంగా నిర్మించారు. ఒక మండపం, రెండు ముఖ ద్వారాలు, ఇతర నిర్మాణాలను దాతల సహకారంతో చేయించారు. శివస్వరూపుడుగా జ్ఞానాన్ని, కేశవ స్వరూపుడుగా ముక్తిని, తేజో స్వరూపుడుగా ఆరోగ్యాన్ని ఆ దేవుడు ఇయ్యగలడని ప్రతీతి. ఇంద్రియాలను బంధించు సర్వరోగాలను ఆ దేవుని తేజస్సు తొలగిస్తుంది. వాత, పిత్త, శ్లేష్మ, కుష్టోదర, ప్రమేహ, భగందర, గ్రహణ్యాది మహారోగ హర్తగా ఆర్వాద్వాదశ స్తోత్రంలో సూర్యుడు వర్ణించబడ్డారు. చర్మ, నేత్ర, హృదయేంద్రియాలకు కలిగే సమస్తరోగాలను ఈ దేవుడు నాశనం చేస్తాడు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణ లు చేస్తూ, అభిషేక జలపూర్ణమయిన సోమసూత్ర జలం తలపై జల్లుకుంటే సర్వరోగాలు నశిస్తాయని సూర్యమండలాష్టకంలో చెప్పబడింది. సౌర్యోపాసకులు సూర్యుని ఎర్రమందారాల తో పూజిస్తారు. ఎర్రని బట్టలు కడతారు. బంగారు పాదుకలు, నేత్రాలు, వజ్రకవచం ధరింపచేసి ఆరాధిస్తారు. మూల విరాట్టు పాదాల దగ్గర సౌరయంత్రం ఉంది. యంత్రం అంటే భగవంతుని దివ్యశక్తిని కేంద్రీకరించుకొని, భక్తులకు ప్రసాదించే పీఠం. ఈ యంత్రాన్ని సూర్యమండలం అంటారు. ఇది ఇంద్రధనుస్సులోగల సప్తవర్ణాలతో రచించపబడింది.

చారిత్రక నేపథ్యం

అరసవిల్లి సూర్యాలయానికి చారిత్రక ఖ్యాతి చాలా ఉంది. కళింగ దేశంలో 7వ శతాబ్దం ఉత్తర భాగం నాటికి పూర్వ గాంగరాజులు కళింగంలో వైదిక ధర్మోద్ధరణం బాగా చేశారు. ఆ వంశంలో క్రీశ.676 నుంచి 688 మధ్య రాజ్యం చేసిన దేవేంద్రవర్మ కాలంలో అరసవల్లి దేవాలయం నిర్మాణం జరిగినట్లు పరిశోధకులు చెపుతున్నారు.
 
సూర్యకిరణాల ప్రాశస్త్యం

సూర్యనారాయణ స్వామి ప్రతి ఏడాది రెండు పర్యాయాలు ఇక్కడి స్వామివారి పాదాలను ప్రత్యక్ష నారాయణుడి కిరణాలు తాకుతాయి. ఈ సమయంలో స్వామివారు బంగారు రంగులో మెరిసిపోతూ భక్తులకు ఆదిత్యుడు దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది సూర్యుడు ఉత్తరాయనం నుంచి దక్షిణాయనాని (మార్చి 7నుంచి 10 తేదీలు)కి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయనానికి (అక్టోబరు 1, 2, 3తేదీలు)కి మారినపుడు మాత్రమే సూర్యభగవానుని పాదాలను తాకుతుంటాయి. ఈ సుందర కమనీయ దృశ్యాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
 
సూర్యనమస్కారాలు
 
ఇక్కడి ఆలయంలో సూర్యనమస్కారాల సేవ ఉంది. కొందరు అర్చకులు భక్తులు చెల్లించే టిక్కెట్టుపై ఆలయ మండపంలో సూర్యనమస్కారాలను నిర్వహిస్తారు. ఆరోగ్యం కోసం చేయించే ఈ సూర్య నమస్కారాల వలన ఎంతో మంది ఆరోగ్యవంతులైనట్లు తెలుస్తోంది. ఆదివారం సమయంలో ఎక్కువ మంది భక్తులు సూర్యనమస్కారాలను చేయించుకొని వారి అనారోగ్య సమస్యలను తొలగించుకుంటారు.
 
రథసప్తమి నాడు విశేషపూజలు
 
సందర్భంగా 26 అర్ధరాత్రి 12.15 గంటలకు సుప్రబాత సేవ, ఉషఃకాలార్చన, శ్రీస్వామివారికి మహాభిషేకసేవ, తెల్లరుజామున ఒంటిగంట నుంచి 5 గంటలవరకు జరుగుతుంది. నిజరూపదర్శనం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటలనుంచి స్వామివారికి విశేష పుష్పమాలాల ంకార సేవ, సర్వదర్శనం జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు విశేషార్చన, నీరాజనం, సర్వదర్శనం రాత్రి 9గంటలకు స్వామివారి ఏకాంత సేవ సందర్భంగా ఉత్సవ సంప్రదాయ కీర్తనలు జరుగుతాయి. ఆ రోజున రూ.100లు ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం ఉంటాయి.
 
 - దువ్వూరి గోపాలరావు
 ఫోటోలు: కె. జయశంకర్, సాక్షి శ్రీకాకుళం
 
 
ప్రత్యక్షదైవం ఆదిత్యుడు
 
ప్రత్యక్షదైవంగా భాసిల్లుతున్న ఆదిత్యుడు అందరి అనారోగ్య సమస్యలనూ నయం చేస్తూ ఆరోగ్యప్రదాతగా కీర్తి చెందాడు. వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి పూజలు చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులైనారు. ఎంతో ప్రాముఖ్యత గల ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. ఈ స్వామి ఎంతో మహిమాన్వితుడు.
 - ఇప్పిలి శంకరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు
 
 

మరిన్ని వార్తలు