పండ్లు కోసే కత్తి

12 Jan, 2018 00:22 IST|Sakshi

చెట్టు నీడ 

నరేంద్రనాథ్‌ దత్త తొలిసారి విదేశీయానానికి సిద్ధం అవుతున్నాడు. తల్లికి బెంగ పట్టుకుంది. దేశం కాని దేశంలో ఎవరితో ఎలా ఉంటాడోనని! లోకం తెలియని యువకుడు లోకంతో నెగ్గుకు రాగలడా అని ఆమె చింత. రాత్రి భోజనం అయ్యాక.. పళ్లెంలో పండ్లు, వాటిని కోసుకోడానికి కత్తి పెట్టి కుమారుడికి అందించింది తల్లి. కొద్దిసేపటి తర్వాత వంటింట్లో ఉన్న తల్లికి  కత్తి అవసరమై, ‘‘నరేంద్రా.. కొద్దిగా ఆ కత్తి తెచ్చివ్వు నాయనా’’ అని అడిగింది. ‘‘ఇదిగోనమ్మా..’’ అంటూ కత్తిని తెచ్చి ఇచ్చాడు నరేంద్ర. కుమారుడు తనకు కత్తిని ఇచ్చిన విధానం చూసి ఆ తల్లి ముఖంలో నిశ్చింత చోటు చేసుకుంది. కత్తి పదునుగా ఉండే వైపును తన చేతితో పట్టుకుని, కత్తిని పట్టుకోడానికి వీలుగా ఉండే భాగాన్ని తల్లి చేతికి అందించాడు నరేంద్ర. అది గమనించాక, తన కొడుకు ఎవరినీ నొప్పించే స్వభావంగల వాడు కాదని ఆమెకు అర్థమైంది! ఎవరినీ నొప్పించనివాడు ఎన్ని దేశాలనైనా నెగ్గుకు రాగలడు. ఆ నమ్మకంతోనే.. కొడుకు చికాగో బయల్దేరుతుంటే చిరునవ్వుతో వీడ్కోలు చెప్పగలిగింది ఆ తల్లి. ఆమె పేరు భువనేశ్వరీదేవి. ఆ కుమారుడే మనందరికీ తెలిసిన స్వామీ వివేకానంద. అతడి చిన్నప్పటి పేరే నరేంద్రనాథ్‌ దత్త. 

సాధారణంగా మనం పక్కవారి గురించి ఆలోచించం. మన సౌకర్యాన్నే చూసుకుంటాం. మనం హాయిగా కూర్చుంటే చాలు. పక్కవాళ్లు చోటు సరిపోక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోం. కొంచెం కూడా సర్దుకుని కూర్చోం. కొన్నిసార్లు వాళ్ల వాటాలోకి కూడా వెళ్లిపోయి, వాళ్ల చోటును కూడా ఆక్రమించుకుంటాం. నిత్య జీవితంలో ఇలా మనం ఎందరినో మన చేతలతో ఇబ్బంది పెడుతుంటాం. మన మాటలతో నొప్పిస్తుంటాం. ఇదంతా మనకు తెలియకుండానే చేస్తుండవచ్చు. కానీ మంచి పద్ధతి కాదు. పక్కవారి సౌకర్యం గురించి మొదట ఆలోచించాలి. తర్వాతే మన సౌకర్యం. అప్పుడే ఈ లోకానికి మనతో సఖ్యత కుదురుతుంది. 
(నేడు స్వామీ వివేకానంద జయంతి.  జాతీయ యువజన దినోత్సవం కూడా).  

మరిన్ని వార్తలు