నువ్వే నీ శక్తి

18 Mar, 2020 08:36 IST|Sakshi
స్వర్ణయాదవ్‌ కర్ర సాము, కత్తి సాము ప్రదర్శనలు

ఆడపిల్లలకు ప్రమాదాలు అనుక్షణం పొంచి ఉంటాయి.ఎప్పుడు ఎవరు లైంగిక దాడి చేస్తారో ఊహించలేకపోతున్నాం.అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతూనే ఉండే దాడులు ఇవి. ఆ ప్రమాదాల దాడి నుంచి ఆడబిడ్డను రక్షించేదెవరు? అందుకు రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, అవి స్పందించేలోపు ఆడపిల్లలే ప్రతిస్పందించాలి. ధైర్యంగా ముందుకు అడుగు వేసి దాడి చేయబోయిన వాడికి దడ పుట్టించాలి. అమ్మాయిల్లో అలాంటి ధైర్యాన్ని పాదుకొల్పడానికే కర్రసామునేర్చుకుని ప్రదర్శిస్తున్నానని చెప్పారు స్వర్ణయాదవ్‌. ఇటీవలే ఆమె హైదరాబాద్,రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఎదుటకర్రసాము ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.

స్వర్ణ యాదవ్‌ది నాగర్‌ కర్నూల్‌ జిల్లా, వెల్దండ మండలం, బైరాపూర్‌ గ్రామం. అమ్మానాన్నలు వెంకటమ్మ, పెద్దయ్య వ్యవసాయం చేస్తారు. ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు. అత్యంత సాధారణ నేపథ్యం నుంచి రాష్ట్రం గర్వించదగిన స్థాయిలో జానపద గాయనిగా, కర్రసాము యుద్ధ కళాకారిణిగా ఎదగడంలో ఆమె వేసిన ప్రతి అడుగూ సాహసోపేతమైనదే. ఇప్పుడు అందుకుంటున్న ప్రశంసల వెనుక ఉన్న పోరాట జీవితాన్ని సాక్షితో మాట్లాడుతున్న సందర్భంలో గుర్తు చేసుకున్నారు స్వర్ణయాదవ్‌.

బాయిలో బచ్చలి కూర
‘‘నేను ఇప్పుడు కర్రసాము స్వర్ణగా పరిచయమయ్యాను. కానీ అంతకు ముందు జానపద గాయనిగా వందల వేదికల మీద పాటలు పాడాను. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా సొంతూరులో ప్రభుత్వ పాఠశాలలో తొలిసారి పాట పాడాను. మా అక్కలు నేర్పించిన ‘బాయిలో బచ్చలి కూర...’ అనే ఆ పాట స్కూలు తర్వాత గ్రామస్థాయి పోటీలు, మండలం, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాకు ప్రథమ స్థానాన్ని తెచ్చి పెట్టింది. జానపదంలో పాటతోపాటే నాట్యం కూడా చేస్తాం. అలా వేదిక మీద డాన్స్‌ చేయడంతో బిడియం పోతుంది. మనుషుల్లో కలిసి పోయే చొరవ వస్తుంది. ఆ చొరవే నన్ను తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గేయాలు పాడేలా ముందడుగు వేయించింది. ఉద్యమం ఊపందుకోవడానికి పాటలను మించిన మాధ్యమం మరొకటి ఉండదని చెప్పి, మా ఊరిలోని ఉద్యమ గాయకుల బృందంలోని వాళ్లు నన్ను కూడా పాట పాడమని అడిగారు. అలా ఉద్యమంలోకి ఉరికిన దాన్ని... గళమెత్తాక ఎన్ని వేదికల మీద ఎన్ని గేయాలు పాడానో ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు. నేను నేర్చుకున్న ఉద్యమ గేయాలే కాకుండా, అక్కడికక్కడే ఆ సందర్భాన్ని బట్టి సొంతంగా పదాలు కూర్చుకుని పాడడం కూడా వచ్చేసింది. ఇంతవరకు పాటను కాగితం మీద రాసుకున్నది లేదు, నేరుగా పాడడమే.

ఆడపిల్లలు ఇలా ఉండాలంటూ గవర్నర్‌ తమిళిసైకర్రసాము నిపుణురాలు స్వర్ణయాదవ్‌నుఅక్కున చేర్చుకున్న దృశ్యం
బతికించడమే బతుకు
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ చేస్తున్నాను. మరో యూనివర్సిటీలో ఎం.ఏ పాలిటిక్స్‌లో సీటు వచ్చింది. కానీ కళలకు కాణాచి అయిన తెలంగాణలో కళలు తెరమరుగవుతున్నాయి. సంగీత వాయిద్యాలు చిలక్కొయ్యల మీదనే ఉండిపోతున్నాయి. వాటిని కిందికి దించి తిరిగి మోగించాలని, కళలకు జీవం పోయడంలోనే జీవితాన్ని వెతుక్కోవాలని అనుకున్నాను. ఆర్ట్‌ ఫార్మ్‌ను బతికించడంలో మన బతుకుకు కూడా భరోసా ఉంటుందని నిరూపిస్తాను. అందులో భాగంగానే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని ప్రదర్శిస్తున్నాను.

మొండిగా ప్రాక్టీస్‌
నెల రోజుల్లో కర్రసాములో మెళకువలు పట్టుపడ్డాయి. మొదట్లో దెబ్బలు తగిలాయి. భుజాలు నొప్పి, ఒళ్లు నొప్పులతో రాత్రి నిద్రపట్టేది కాదు. ఎందుకు మొదలు పెట్టానా అని కూడా అనిపించింది. కానీ మొండిగా ప్రాక్టీస్‌ చేశాను. అమ్మాయిలందరికీ కర్రసాము వచ్చి ఉండాలి. నేర్చుకున్నంత మాత్రాన ఎప్పుడూ కర్ర వెంట తీసుకెళ్లడం కుదురుతుందా అనుకుంటారు. కానీ ప్రమాదం తరుముకొచ్చినప్పుడు చేతిలో కర్ర లేకపోయినా, ప్రత్యర్థిని మట్టికరిపించే ఒడుపులు ఈ సాధనలో తెలుస్తాయి. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకోగలమనే ధీమా కలిగితే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం దానంతటదే పుట్టుకొస్తుంది’’ అన్నారు స్వర్ణయాదవ్‌.

ఇక్కడ ఒకమాట చెప్పాలి. ప్రతి మనిషికీ ఒక అండ కావాలి. ఆ అండ బయట ఉండదు. తనలో నిద్రాణంగా ఉన్న ఆత్మవిశ్వాసమే ఆ అండ. అలాగే ప్రతి మనిషీ... ఒక ఆధారాన్ని కోరుకుంటారు. ఆ ఆధారం మరొకరు అయి ఉండకూడదు. తనకు తానే అయి ఉండాలి. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలు... అమ్మాయిల చుట్టూ పరిభ్రమించడానికి ప్రమాదాలు కూడా భయపడతాయి.– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా