ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది!

12 Jul, 2018 00:01 IST|Sakshi

ఆమె ఉజ్జయిని మహంకాళిగా భవిష్యత్తు చెబుతుంది.సంవత్సరంలో ఒకరోజు ఆమె వైపు భక్తజనమంతా చూస్తుంది.కాని మిగిలిన అన్ని రోజులు ఆమె ఒక సాధారణ టైలర్‌లా జీవితం గడుపుతుంది.  మాతంగి స్వర్ణలత జీవన పరిచయం ఇది.

ఆ క్షణాలు  ఉద్వేగభరితం. కోట్లాది జనసందోహం ఆ క్షణాల కోసమే ఎదురు చూస్తుంటుంది. ఏడాదికోసారి వినిపించే ఆ మాటల కోసం ఆ క్షణంలో అంతా ఊపిరి బిగపట్టి ఆలకిస్తారు. ఎందుకంటే  ఆ మాటలు ఉజ్జయిని మహంకాళి మధుర వాక్కులు. అవి అందరినీ కాపాడే ఆ చల్లని తల్లి దీవెనలు. ప్రజలంతా సుఖశాంతులతో  బతకాలనే ఆకాంక్షలు. అమ్మవారికి ఆగ్రహం వచ్చినా, ఆనందం కలిగినా ఆమె మాటల్లోనే  వెల్లడిస్తుంది. పాలించేవారికి దిశానిర్దేశం చేస్తుంది. పాలితులకు మార్గదర్శనం చేస్తుంది. ఆ  క్షణాల్లో అమ్మవారు  పచ్చికుండతో చేసిన రంగంపైకి ఎక్కి భవిష్యవాణి వినిపిస్తుంది. ఆ అపురూప క్షణాల్లోనే  అమ్మవారు మాతంగి స్వర్ణలత అవుతుంది. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకొని నిండైన విగ్రహంలా కదిలి వచ్చే మాతంగి స్వర్ణలత  అప్పుడు ఉజ్జయిని మహాంకాళి  ఆవాహనమవుతుంది. రెండు దశాబ్దాలకు పైగా రంగం ఎక్కి  భవిష్యవాణి వినిపిస్తున్న  స్వర్ణలత ఒక విశిష్టమైన సాంసృతిక ఆవిష్కరణ అవుతుంది.  రెండువందల ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు  ఆమె ఒక కొనసాగింపు. నగరమంతా ఆషాఢమాసపు ఆ«ధ్యాత్మికతను సంతరించుకుంటున్న వేళ మాతంగి  స్వర్ణలత ప్రస్థానం పై  ’సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.

తరతరాలుగా.. వారసత్వంగా..
ముఖం నిండా పసుపు. పెద్ద పెద్ద కళ్లు. నుదుటిపై నిండుగా ఉన్న కుంకుమ బొట్టు. పసుపు కుంకుమలతో అలంకరించుకొన్న నిండైన దేహం. పచ్చికుండపై నిలిచిన పాదాలు.  చేతిలో కిన్నెర. భవిష్యత్తులోకి తొంగి చూసే సునిశితమైన చూపులు. ఆ సమయంలో అమ్మవారిని ఆవాహనం చేసుకున్న  స్వర్ణలత రూపం, మాటలు  ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. ఆమె సాధారణ జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. కోట్లాది మంది ప్రజల భవిష్యత్తు  చెప్పే దైవానికి ఆమె ప్రతిరూపమే అవుతుంది. సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అవతరించిన తరువాత  భవిష్యవాణి వినిపించడం ఒక సాంప్రదాయంగా  వస్తోంది. 

అమ్మాయిలంతా అమ్మవారికే
‘ఏర్పుల’ వంశానికి  చెందిన మహిళలు ఆ  సాంప్రదాయానికి  ప్రతీకలు. మొట్టమొదట  ఏర్పుల జోగమ్మతో  ఇది మొదలైంది. ఆ తరువాత ఏర్పుల బాలమ్మ, ఏర్పుల పోశమ్మ, ఏర్పుల బాగమ్మ  ఈ  సంప్రదాయంలో భాగస్వాములయ్యారు. 1996 వరకు స్వర్ణలత అక్క ఏర్పుల స్వరూపారాణి  రంగం ఎక్కి భవిష్యవాణి వినిపించింది. 1997 నుంచి ఇప్పటి  వరకు స్వర్ణలత  ఆ  సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ‘మా కుటుంబంలో పుట్టే అమ్మాయిలంతా  అమ్మవారికే అంకితం. ప్రతి అమ్మాయి మాతంగి కావలసిందే. ఇప్పటివరకు మాతంగులైన వాళ్లంతా నాతో సహా పెళ్లిళ్లు చేసుకోకుండా తమను తాము మహంకాళికి సమర్పించుకున్న వాళ్లే. మా కుటుంబంలో మా తమ్ముడు దినేష్‌కు ఆడపిల్ల పుడితే తప్పకుండా  నా తరువాత ఆమే భవిష్యవాణి వినిపిస్తుంది...’ అని చెబుతోంది స్వర్ణ. 

సంక్షేమమే చెబుతుంది
పదోతరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నవయస్సులోనే 1997లో ముత్యాలమ్మ గుడిలో కత్తితో పెళ్లి జరిపించారు. ఎంతో వైభవంగా ఆ పెళ్లి జరిగింది. ఆ తరువాత ఆమె జీవితం అమ్మవారి సేవకే అంకితమైంది. అప్పటి నుంచే భవిష్యవాణి వినిపిస్తోంది. ఆమె వినిపించే  భవిష్యవాణిని  ప్రజలే కాదు ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. భవిష్యవాణిలో చెప్పే సలహాలు, సూచనలను స్వీకరిస్తుంది. ఆ భవిష్యవాణిలో  ప్రజలందరి  సంక్షేమం నిక్షిప్తమై ఉంటుంది. 

జీవిక కోసం టైలరింగ్‌
ఏడాదికోసారి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చి  లక్షలాది మంది భక్తులు, అధికారగణాలు, అతిర«థమహార«థులు కొలువుదీరి ఉండే  ఆలయ ప్రాంగణంలో ఎలాంటి జంకు లేకుండా, అమ్మవారికి ప్రతిరూపమై  భవిష్యవాణి వినిపించే  స్వర్ణలత  సాధారణ జీవితంలో ఒక టైలర్‌. ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద. ఆమె కుటుంబం తుకారాంగేట్‌లోని ఒక చిన్న అద్దె ఇంట్లో నివసిస్తుంది. ‘మా నాయిన ఏర్పుల నర్సింహ  మొదటి నుంచి గుడి దగ్గర పంబజోడు  వాయించేవాడు. మా అమ్మ ఇస్తారమ్మ నాయినతో పాటు గుడికి వచ్చి జేగంట మోగించేది. తరతరాలుగా ఇది మా వృత్తి. అమ్మా, నాయిన ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో నేను, మా తమ్ముడు దినేష్, పిన్ని, వదిన ఉంటున్నాం. దినేష్‌ ఎలక్ట్రీషియన్‌. ఇద్దరం కష్టపడితే తప్ప ఇల్లు గడవదు. బతకాలంటే కష్టపడాల్సిందే కదా’ అంటూ నవ్వేస్తుంది. స్వర్ణ మంచి లేడీస్‌ టైలర్‌. అన్ని రకాల డిజైన్లలో  బ్లౌజులు, ఇతర దుస్తులు కుట్టేస్తుంది. ఏడాది పాటు  రాత్రింబవళ్లు కష్టపడి పని చేసినా  ఏడాదికోసారి వచ్చే ఆషాఢమాసం కోసం  మాత్రం  ఆమె  వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటుంది.  ‘‘ఏర్పుల బాగమ్మ మాకు నాయినమ్మ వరుస అవుతుంది. ఆమె ప్రభావం మాపై కొంతవరకు ఉంది. కానీ  ఆ తరువాత  రంగం ఎక్కిన  మా అక్క స్వరూపారాణితో కలిసి నేను  గుడికి వచ్చేదాన్ని. ఆమె వారసత్వంగానే  నేను వచ్చాను’ అంటూ గలగలా నవ్వేసే  స్వర్ణకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటును అందిస్తే ఆ కుటుంబానికి ఎంతో ఊరట లభిస్తుంది.  

రంగం’ ఒక  ఆ«ధ్యాత్మిక వేదిక
ఆషాఢమాసం అమావాస్య తరువాత వచ్చే ఆదివారంతో  ఉజ్జయిని మహంకాళి వేడుకలు ఆరంభమవుతాయి. గర్భాలయంలోని  అమ్మవారి ఆభరణాలు, ముఖాకృతిని అందంగా అలంకరించిన ఘటంతో  తీసుకొని రాణిగంజ్‌లోని కర్బలా మైదానానికి ఎదుర్కోలుకు వెళుతారు. ఈ నెల 15వ తేదీన ఆ వేడుక మొదలవుతుంది. ఆ తరువాత సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో  ఘటంతో ఎదుర్కోలు  వేడుకలు నిర్వహిస్తారు. మహంకాళి అమ్మవారు తన ఉత్సవాలకు రావలసిందిగా  తన తోటి  18 మంది అక్కచెల్లెళ్లను  ఆహ్వానించడమే ఈ ఘటోత్సవం. ఆ తరువాత న్యూబోయిగూడలోని దండు మారమ్మ ఆలయానికి వెళ్తారు. అది మహంకాళి  పుట్టినిల్లు. అక్కడి నుంచి గర్భాలయానికి చేరుకోవడంతో ఎదుర్కోలు ఘట్టం ముగుస్తుంది. ఆ తరువాత  ఈ నెల  29వ తేదీన బోనాల ఉత్సవాలు. 30న  ’రంగం’నిర్వహిస్తారు.  ఈ ఆ«ధ్యాత్మిక వేదికను  స్వర్ణలత తమ్ముడు దినేష్‌ అలంకరిస్తాడు. పచ్చికుండను కొద్దిగా భూమిలోకి పాతి దాని చుట్టూ బియ్యంతో ముగ్గులు వేస్తారు. పసుపు, కుంకుమలతో అందంగా అలంకరిస్తారు. జేగంటలు మోగుతాయి. పంబజోడు ఉత్సవం ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో  సరిగ్గా ఆ సమయంలోనే  ఆలయానికి చేరుకుంటుంది స్వర్ణలత. ‘ఆ సమయంలో కొత్త బట్టలు పెట్టి నాకు ఒడి బియ్యం పోసి ఎదుర్కొని వస్తారు. నేరుగా రంగం వద్దకు వస్తాను. ఆ తరువాత  ఏం జరుగుతుందో  నాకు తెలియదు...’ అంటున్న మాతంగి స్వర్ణలత ఆ తుదిఘట్టంలో 15 నిమిషాల పాటు  భవిష్యవాణి వినిపిస్తుంది. ఆమె వినిపించే భవిష్యవాణి కోసం ఎదురు చూద్దాం.
– పగిడిపాల ఆంజనేయులు, సాక్షి, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు