ధీశాలి

10 Oct, 2018 00:10 IST|Sakshi

శక్తి స్వరూపిణి

స్త్రీ శక్తి స్వరూపిణి. ఆ శక్తికి రూపాలెన్నో. ఆ రూపాల్లో స్వాతి గార్గ్‌ ఒకరు. అగ్ని ప్రమాదం నుంచి తన అపార్ట్‌మెంట్‌లోని వారిని చివరి నిమిషం వరకు కాపాడుతూ ఉన్న స్వాతి.. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ శరన్నవరాత్రులు ముగిసేవరకు సాక్షి ‘ఫ్యామిలీ’..  శక్తికి ప్రతీకలైన నేటి మహిళల గురించి రోజుకొక స్వరూపంగా మీకు అందిస్తుంది. 

‘‘ధైర్యానికి ప్రతీక అయిన సోదరీ నీ ఆత్మ శాంతించు గాక. ‘ప్రాణాలు పోసే శక్తి, ప్రాణాలను కాపాడే శక్తి మహిళల్లోనే ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాల’ని మన విద్యావిధానం బోధిస్తుంది. ఆ బోధనలకు ప్రతీకగా నిలిచిన నీకు నివాళులు’’.. ఇది దీపక్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌. తన అపార్ట్‌మెంట్‌లోని వాళ్లను అగ్ని ప్రమాదం నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన స్వాతి గార్గ్‌ను ఉద్దేశించిన పోస్ట్‌ ఇది. స్వాతి గార్గ్‌ 32 ఏళ్ల యువతి. ఇంటీరియర్‌ డిజైనర్‌. ఢిల్లీ సమీపంలో గుర్‌గావ్‌లో నివసించేది మొన్నటి ఆదివారం వరకు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకు ఆమె నివసిస్తున్న తులిప్‌ ఆరెంజ్‌ బహుళ అంతస్తుల భవనంలో నిప్పు రాజుకుంది. ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్వాతి నివసించే ఐదవ ఫ్లోర్‌కు పొగలు వ్యాపించడాన్ని గమనించిందామె. వెంటనే తమ ఫ్లోర్‌లో అన్ని ఇళ్ల తలుపులు బాది వారిని అప్రమత్తం చేసింది. మంటలు చెలరేగుతున్నాయని తెలియగానే ఎవరికి వాళ్లు నేరుగా పైన టెర్రస్‌ మీదకు పరుగులు తీశారు. స్వాతి మాత్రం మెట్ల దారి నుంచి పరుగెత్తుతూ మిగిలిన ఫ్లోర్‌లకు వెళ్లి సమాచారమిస్తూ తొమ్మిదవ ఫ్లోర్‌కి చేరింది. అప్పటికే కారిడార్‌ మొత్తం పొగతో నిండిపోయింది. ఊపిరాడటం లేదు.ఊపిరితిత్తులు పొగచూరి పోయి ఉక్కిరిబిక్కిరైంది. పదవ ఫ్లోర్‌ మెట్ల దగ్గరకు వచ్చింది. ఆ మెట్లు ఎక్కితే టెర్రస్‌ మీదకు చేరుతుంది. ఎలా పడిందో తెలియదు డోర్‌ లాక్‌ పడిపోయింది. సహాయం కోసం ఎవరినైనా పిలుద్దామంటే నోరు పెగల్లేదు. మెట్ల దగ్గరే కుప్పకూలిపోయింది స్వాతి.

రక్షించేలోపే..!
అపార్ట్‌మెంట్‌ నుంచి అగ్నిమాపక శాఖకు 2.28 గంటలకు ఫోన్‌కాల్‌ వెళ్లింది. మూడు గంటలకు పోలీసులు వచ్చారు. మూడుంపావుకు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు మొదలయ్యాయి.మూడున్నరకంతా అపస్మారక స్థితిలో ఉన్న స్వాతిని గుర్తించారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని చెప్పారు డాక్టర్లు. స్వాతి అపస్మారక స్థితిలో గుర్తించిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అగ్నిమాపక సిబ్బంది చెప్పిన విషయం అపార్ట్‌మెంట్‌ వాసులందరినీ కంట నీరు పెట్టించింది. పొగచూరిన గోడల మీద... కారిడార్‌లో నుంచి బయటపడటానికి దారి కోసం వెతికిందనడానికి చిహ్నంగా ఆమె చేతి వేళ్ల ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. బయటపడే దారి కోసం వెతుకుతూనే అపస్మారక స్థితిలోకి జారిపోయింది స్వాతి. తన ప్రాణాలను రక్షించుకుంటే చాలనుకోకుండా అందరినీ కాపాడాలనే ఆకాంక్షే స్వాతి ప్రాణాలను బలిగొన్నది. ఆమె భర్త గిరీష్‌ హనీవెల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వాళ్లకు నాలుగేళ్ల కూతురు ఉంది. స్వాతి ఇటీవల ఆమె తల్లిని కూడా తన దగ్గరకు తెచ్చుకుంది. ఆమె ఇప్పుడు కాలిన గాయాలతో హాస్పిటల్లో ఉంది.  
– మను

మరిన్ని వార్తలు