చెమట చెబుతుంది మద్యమెంతో...!

16 Dec, 2019 00:31 IST|Sakshi

ఎంత మద్యం తాగారో తెలుసుకునేందుకు ఇప్పుడు వాడుతున్నారే.. బ్రీతలైజర్లు.. వాటికి త్వరలో కాలం చెల్లిపోనుంది. బాగానే పనిచేస్తున్నా.. దీంతో సమస్యలూ ఉన్నాయి. అందుకే వీటి స్థానంలో చెమట నుంచి ఆల్కహాల్‌ మోతాదును అంచనా వేసేందుకు ఓ కొత్త పద్ధతి, టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. న్యూయార్క్‌లోని అల్బేనీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివద్ధి చేస్తున్నారు. మన ఊపిరిలోని ఎథనాల్‌ మోతాదును లెక్కకట్టడం ద్వారా బ్రీతలైజర్లు పనిచేస్తాయన్నది మనకు తెలిసిందే. అయితే మీరు మౌత్‌వాష్‌ వాడారనుకోండి. దాంట్లోని ఎథనాల్‌ ద్వారా కూడా మీ రీడింగ్‌ మారిపోవచ్చు.

మధుమేహులైతే... వారి ఊపరిలోని ఎసిటోన్‌ కూడా బ్రీతలైజర్‌ రీడింగ్‌ మార్చేస్తుంది. ఈ చిక్కులన్నింటినీ అధిగమించేందుకు అల్బేనీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివద్ధి చేశారు. ఐస్‌క్రీమ్‌ స్టిక్‌ లాంటిదానిపై చెమటచుక్కను వేస్తే సరి.. మద్యం ఉంటే దానిపై ఓ రంగు చుక్క ఏర్పడుతుంది. రంగు ముదురుగా ఉంటే ఎక్కువ, లేతగా ఉంటే తక్కువ మద్యం ఉందని అర్థం. ఈ ముదురు, తేలిక రంగు తేడాలను గుర్తించడం కష్టమని అంటున్నారా? నో ప్రాబ్లెమ్‌. ఓ స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా రంగు అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పటికే కొంతమందిపై ఈ పట్టీని ప్రయోగాత్మకంగా పరిశీలించి మంచి ఫలితాలు సాధించారు. అనలిటికల్‌ కెమిస్ట్రీ మేగజైన్‌లో పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు