స్వీట్‌క్రాంతి

13 Jan, 2016 22:43 IST|Sakshi
స్వీట్‌క్రాంతి

ఈ వంటలు మీరు వండితే మీకు ఎన్ని ప్రశంసలో...  స్వీట్ వైఫ్ స్వీట్ మదర్  స్వీట్ సిస్టర్ స్వీట్ డాటర్ స్వీట్ డాటర్ ఇన్ లా స్వీట్ మదర్ ఇన్ లా మీవారు వండితే...స్వీటెస్ట్ హజ్బెండ్ మీవారితో వండించగలిగితే ఆహా.. ఓహో..  అప్పుడు స్వీట్ క్రాంతే!!
 
 
 నువ్వులు బెల్లం బొబ్బట్లు
కావల్సినవి: తెల్ల నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; యాలకుల పొడి - ఒకటిన్నర టీ స్పూన్; మైదాపిండి- ఒకటిన్నర కప్పులు; నెయ్యి - వేయించ డానికి సరిపడా
తయారి:  మైదాపిండిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, పూరీ పిండిలా కలిపి తడిబట్ట కప్పి ఉంచాలి.  బాణలిలో నువ్వులు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి.  నువ్వులు చల్లారిన తర్వాత బెల్లం తురుము వేసి, రెండూ కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. లేదా రోట్లో దంచినా మంచిదే. దీంట్లో యాలకులపొడి వేసి క లిపి ఉంచాలి.మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, పూరీలా వత్తి అందులో నువ్వుల మిశ్రమం పెట్టి బొబ్బట్టు మాదిరిగా వత్తాలి. దీనిని పెనం మీద నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి, తీయాలి.
 
 పాల తాలికలు

 కావల్సినవి: పచ్చి బియ్యపుపిండి (బియ్యం నానబెట్టి, వడకట్టి, గ్రైండ్ చేయాలి) - 4 కప్పులు; నీళ్లు - 2 లీటర్లు; చిక్కగా మరిగించిన పాలు - లీటరు బెల్లం తురుము - కిలో; సగ్గుబియ్యం - 100 గ్రాములు జీడిపప్పు పలుకులు - 75 గ్రాములు (సగం పొడి చేసుకోవాలి)
 యాలకుల పొడి - టీ స్పూను బాదంపప్పులు, కిస్‌మిస్‌లు - ఒక్కో చెంచా (లేకపోయినా ఫర్వాలేదు) నెయ్యి - 100 గ్రాములు తయారి:      
గుప్పెడు బెల్లం తురుము విడిగా ఉంచి, మిగిలిన బెల్లంలో మూడువంతుల యాలకులపొడి వేసి, కొద్దిగా నీళ్లు పోసి, తీగపాకం పట్టి, పక్కన ఉంచాలి.బియ్యప్పిండిలో మిగిలిన యాలకుల పొడి, బెల్లం తురుము, సగం నెయ్యి, జీడిపప్పు పొడి, తగినన్ని పాలు పోసి బాగా కలిపి, గట్టి ముద్ద చేసి ఉంచాలి. జీడిపప్పును నేతిలో దోరగా వేయించి పక్కన ఉంచాలి.కుకర్‌లో నీళ్లు పోసి మరిగించాలి. మురుకుల గిద్దె(కుడక)లో బియ్యప్పిండి ముద్ద పెట్టి, మరుగుతున్న నీళ్లలో వత్తాలి. కడిగిన సగ్గుబియ్యం కూడా వేసి, మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.కుకర్ వేడి తగ్గాక మూత తీసి, బెల్లం పాకం పోసి, జీడిపప్పు, నెయ్యి వేసి కలపాలి.చివరగా పాలు పోసి మళ్లీ కలిపి, కొద్దిగా ఉడికించి దించేయాలి. కమ్మని పాల తాలికలు రెడీ.
 
పాకం గారెలు
కావల్సినవి: మినప్పప్పు -అర కిలో బెల్లం తురుము - అర కిలో నీళ్లు - తగినన్ని నూనె - వేయించేందుకు సరిపడా నెయ్యి - 50 గ్రాములు యాలకుల పొడి - 1 టీ స్పూన్ ఉప్పు - తగినంత తయారి:      పొట్టు తీసిన మినప్పప్పును ముందురోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లన్నీ వంపేసి, గారె చేయడానికి అనువుగా పిండి గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు కలుపుకోవాలి.బెల్లం తురుములో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి, అందులో యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి.గారెలు వత్తుకొని, నెయ్యి కలిపిన నూనెలో దోరగా వేయించి, వేడిగా ఉండగానే పాకంలో వేయాలి. వీటిని ఓ పూటంతా కదపకుండా ఉంచితే పాకంలో గారెలు బాగా నాని రుచిగా ఉంటాయి.
 
 గోధుమరవ్వ హల్వా
కావల్సినవి: చిన్నగోధుమ రవ్వ - 1కప్పు
పాలు - 2 కప్పులు; నీళ్లు - 1 కప్పు
యాలకుల పొడి - చిటికెడు
జీడిపప్పు పలుకులు - 10
కిస్‌మిస్ - 10
పంచదార - 2 కప్పులు
నెయ్యి - 4 పెద్ద చెంచాలు
కుంకుమపువ్వు - కొద్దిగా

తయారి: మందపాటి గిన్నెలో నెయ్యి వేసి స్టౌ మీద పెట్టాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో పాలు, నీళ్లు కలిపి మరిగించాలి. దానిలో గోధుమరవ్వను కొద్ది కొద్దిగా పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ బాగా ఉడికాక అందులో పంచదార, నెయ్యి కూడా వేసి బాగా కలపాలి.  పంచదార కరిగి, హల్వా కొద్దిగా దగ్గరకి వచ్చేవరకు కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్, కుంకుమ పువ్వు వేసి మంట తీసేయాలి. ఘుమఘుమలాడే గోధుమరవ్వ హల్వా రెడీ. (కావాలనుకుంటే దీంట్లో చిటికెడు ఫుడ్ కలర్ కలుపుకోవచ్చు.
 
చెరకురసం పరమాన్నం

 కావల్సినవి: కొత్త బియ్యం - 1 గ్లాసు
చెరకురసం - రెండు గ్లాసులు
యాలకుల పొడి - చిటికెడు
నెయ్యి - 4 పెద్ద చెంచాలు
జీడిపప్పు పలుకులు - 15-20
కిస్‌మిస్ - 10
 
తయారి: జీడిపప్పును కొద్దిగా నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బియ్యం కడిగి, రెండు గ్లాసుల నీళ్లు పోసి అరగంట నానబెట్టి, తర్వాత ఉడికించాలి. అన్నం పూర్తిగా అయ్యాక చెరకురసం పోసి, నీరంతా ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. దీంట్లో యాలకులపొడి, నెయ్యి, వేయించిన జీడిపప్పు పలుకులు వేసి కలిపితే చెరకురసం పరమాన్నం సిద్ధం. (తీపిదనం ఎక్కువ కావాలనుకున్నవారు చెరకురసంతో పాటు బెల్లం కూడా కలిపి అన్నాన్ని ఉడికించవచ్చు.) కావాలనుకుంటే ఇంకా నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్ కలుపుకోవచ్చు.
 
 పూర్ణం బూరెలు
 కావల్సినవి: పచ్చి శనగపప్పు - 2 కప్పులు
మినప్పప్పు - కప్పు
కొత్త బియ్యం - 2 కప్పులు
బెల్లం తురుము - 2 కప్పులు
నెయ్యి - అర కప్పు
నూనె - వేయించడానికి సరిపడా
 
తయారి:  మినపప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.శనగపప్పులో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించి, అందులో తరిగిన బెల్లం వేసి మళ్లీ ఉడికించాలి. నీళ్లన్నీ ఆవిరై, పప్పు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. (ఉడికిన శనగపప్పులో నీళ్లు ఒంపేసి, బెల్లం, యాలకులపొడి, నెయ్యి వేసి, ఉడికించి, చల్లారాక రోట్లో మొత్తగా రుబ్బుకోవచ్చు)   చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. ఒక్కో ఉండనూ మెత్తగా రుబ్బిన పప్పు మిశ్రమంలో ముంచి నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించాలి.
 
 నువ్వులన్నం (పులగం)
కావల్సినవి: కొత్త బియ్యం - పావు కేజీ
నల్ల నువ్వులు - పెద్ద చెంచాడు
ఉప్పు - తగినంత; నీళ్లు - 3 గ్లాసులు
 
తయారి:  ముందురోజు రాత్రి నువ్వులను కొద్దిగా వేయించి, రోట్లో వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో బియ్యం వేసి, కొద్దిగా దంచుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా బియ్యానికి నువ్వుల పొడి పట్టేంతవరకు దంచి, తీసి పక్కన పెట్టుకోవాలి.  తర్వాతిరోజు ఉదయం గిన్నెలో నీళ్లు పోసి, మరిగాక, ఉప్పు వేయాలి. అందులో సిద్ధంగా ఉంచిన బియ్యం పోసి, కలిపి ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా అయ్యేంతవరకు ఉంచి, దించాలి. మరీ మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు పైన చల్లి, ఉడికించుకోవచ్చు.మరిగించిన పాలలో బెల్లం కలిపి, కరిగించాలి. నువ్వులన్నాన్ని బెల్లం ముక్క లేదా తయారు చేసుకున్న బెల్లం పాలు కాంబినేషన్‌తో వడ్డించాలి.
నోట్: కొన్ని చోట్ల కొత్తబియ్యం, పెసరపప్పు కలిపి వండి... పైన కొబ్బరి తురుము, బెల్లం తురుము, నెయ్యి కాంబినేషన్‌తో వడ్డిస్తారు.
 
 

మరిన్ని వార్తలు