వాటర్‌లో... డ్యాన్స్‌ ఫ్లో

12 Apr, 2017 23:49 IST|Sakshi
వాటర్‌లో... డ్యాన్స్‌ ఫ్లో

‘జిమ్‌’దగీ

ఎండాకాలం... కదలకుండానే చెమట్లు పట్టిస్తోంది. వ్యాయామం ఆలోచనకే శరీరం అలసిపోతుందేమో అనిపిస్తోంది.  ఈ సీజన్‌లో ఆరోగ్యం సంగతేమో గాని రెగ్యులర్‌గా చేసే జిమ్‌ వర్కవుట్స్‌ వంటివి అలసటకు విపరీతమైన నిస్సత్తువకు గురిచేయడం గ్యారంటీ. దీనికి పరిష్కారంగా వ్యాయామ ప్రియులు ఎంచుకుంటున్న వైవిధ్యభరిత వ్యాయామ శైలుల్లో...ఆక్వా వర్కవుట్స్‌ ఒకటి. స్విమ్మింగ్‌ పూల్‌ సాక్షిగా సమ్మర్‌లో సందడి చేస్తున్న ఆక్వా డ్యాన్స్‌లు, ఆక్వా జుంబా వంటివి వేడికి చెక్‌ పెట్టే వేదికలుగా మారాయి. ఊపందుకుంటున్న ఆక్వా జుంబా గురించి హైదరాబాద్‌కు చెందిన డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ బాబీ చెబుతున్న విశేషాలివీ...

నీటిలో ఈత కొట్టడం అనేది చక్కని వ్యాయామం అని మనకు తెలిసిందే. ముఖ్యంగా వేసవి సీజన్‌లో ఆరోగ్యం కోసం స్విమ్మింగ్‌ను ఎంచుకునేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఆక్వా వర్కవుట్స్, ఆక్వా యోగా, ఆక్వా జుంబా... వంటివి అందుబాటులోకి వచ్చాయి. తేలికపాటి శరీరపు కదలికలు, వినోదభరితమైన సంగీతం...వెరసి అటు ఆరోగ్యాన్ని అందిస్తూనే అలసటకు గురిచేయని వ్యాయామ శైలిగా ఆక్వా జుంబా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఆరోగ్యకర వినోదం... ప్రయోజనాలెన్నో...
జుంబా అనేది వ్యాయామ లాభాలను అందించే నృత్యశైలి.  ఏదైనా స్విమ్మింగ్‌ పూల్‌లో సమూహంతో కలిసి నృత్యం చేయడమే ఆక్వా జుంబా. ట్రైనర్‌ పూల్‌ బయట ఉండి అందిస్తున్న సూచనల మేరకు వ్యాయామార్ధులు పూల్‌లో దిగి ఛాతీ వరకూ దేహం నీళ్లలో తడుస్తుండగా నృత్యం సాగిస్తారు. లాటిన్‌ సంగీతాన్ని నేపధ్యంగా వినియోగిస్తుంటారు. నిర్ణీత విరామాలతో కనీసం 40 నుంచి 80 నిమిషాల దాకా ఈ నృత్యం సాగుతుంది.

నీళ్లలో కాస్త దిగి నుంచోవాలంటేనే  నీటి ఒత్తిడిని ఎదుర్కుని శరీరాన్ని స్థిరంగా ఉంచేందుకు మన కండరాలు సిద్ధమైపోతాయి. అంటే వ్యాయామం అక్కడే ప్రారంభమైపోయినట్టు. నీళ్లలో తడవడం దగ్గర నుంచి నడవడం దాకా ఈత దగ్గర నుంచి నాట్యం దాకా అన్నీ శరీరానికి అద్భుతమైన వ్యాయామం అందించేవే. మోకాలి నొప్పులు వంటి సమస్యలున్నవారికి నప్పే నృత్య వ్యాయామం ఇది. స్విమ్మింగ్‌ రాని వారు కూడా నిస్సంకోచంగా చేయవచ్చు. ఈ నీటి నృత్యం కండరాలన్నింటినీ  ఉపయోగించుకుంటుంది. తద్వారా కోర్‌ మజిల్స్‌ సహా అన్నీ చైతన్యవంతమవుతాయి. ఆక్వా జుంబాలో మజిల్‌ మూవ్‌మెంట్స్‌  భారీగా ఉండడం మేలు చేస్తుంది. గంట సేపు చేసే నృత్యం ద్వారా 600 నుంచి 800 కేలరీలను సులభంగా ఖర్చు చేయవచ్చు. అవయవాల మధ్య బ్యాలెన్సింగ్‌కు  ఉపకరిస్తుంది. నృత్యం చేసే సమయంలో చేతుల వేళ్లు కప్‌ హోల్డ్‌ తరహాలో మూసి ఉంచడడం వల్ల మరింత ఇంటెన్సిటీ పెరుగుతుంది.

జాగ్రత్తలు: ఎన్నో లాభాలను అందించే ఆక్వా జుంబాను వారానికి కనీసం 2 సార్లు తమ వ్యాయామంలో భాగం చేసుకోవచ్చు. అయితే నీటి ఒరవడికి తగ్గట్టుగా, శరీరపు కదలికలు లేకపోతే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ఆక్వాటిక్‌ అసోసియేషన్‌ సర్టిఫికేషన్‌ పొందిన ట్రైనర్ల పర్యవేక్షణలో చేస్తే మేలు.

 

మరిన్ని వార్తలు