-

నిర్వేదంగా కాదు... నిక్షేపంగా!

16 Oct, 2013 00:29 IST|Sakshi
నిర్వేదంగా కాదు... నిక్షేపంగా!
అరవై ఎనిమిదేళ్ల రమణమూర్తి ఇటీవలే రిటైర్ అయ్యారు. ఇంట్లో ఇద్దరే. ఆయన... ఆయన భార్య. అంతే. చాలాకాలం నుంచి వాళ్లిద్దరూ ఒంటరిగానే జీవిస్తున్నారు. కారణం... ఇద్దరు పిల్లలనూ దాదాపు పదేళ్లకు పైబడి యూఎస్‌లోనే ఉంటున్నారు. ఇటీవల గమనించిందేమిటంటే... ఇటీవల రోజువారీ వ్యవహారాలపై ఆయనకు ఆసక్తి తగ్గి పోయింది. గతంలోలా ఏదీ మక్కువ కలిగించడం లేదు. వాకింగ్ మానేశారు. చెస్ ఆడటంలేదు. ఎందుకో ఒక్కసారిగా తాను బాగా ఒంటరినైపోయిన ఫీలింగ్. ప్రపంచంపై నమ్మకం కోల్పోయారు. మతిమరపు కూడా వచ్చింది. బాగా దగ్గరివాళ్లను గుర్తుపట్టడం లేదు. పైగా అందరినీ అనుమానిస్తున్నారు. డాక్టర్‌కు చూపిస్తే సైకియాట్రిస్ట్‌ను కలవమని సలహా ఇచ్చారు. దాంతో ఆయన మరింత ముకుళించుకుపోయారు.
 
 ‘తానేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా?’ అని అడుగుతున్నారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లడం అంటే అదేమీ పిచ్చి కానక్కర్లేదనీ, అందరిలోనూ తమ మనసుకు ఏదైనా సమస్య వస్తే కలవాల్సింది ఆయననేననీ, అందుకే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడంలో తప్పులేదని అతికష్టం మీద ఒప్పించి తీసుకురావాల్సి వచ్చింది. సైకియాట్రిస్ట్ ఆయనను పరీక్షించి వృద్ధాప్యంలో సాధారణంగా కనిపించే డిప్రెషన్‌గా గుర్తించి చికిత్స చేయడంతో ఆయన సమస్యకు పరిష్కారం లభించింది. పిల్లలందరూ తల్లిదండ్రులను తమ కెరియర్ కోసం విడిచి విదేశాలకో లేదా దూర ప్రాంతాలకో వెళ్లడం, ఆ తర్వాత తల్లిదండ్రులూ రిటైర్ అయిపోయి జీవితంలో వ్యాపకాలేవీ లేని సమయంలో లోనయ్యే ఈ తరహా డిప్రెషన్ ఇటీవల వేలాదిమందిలో విస్తరిస్తోంది. అయితే దురదృష్టవశాత్తు దీని పరిష్కారం కోసం వైద్యులను సంప్రదించేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. వృద్ధాప్యంలో వచ్చే డిప్రెషన్, దాని నివారణ వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
 
 సాధారణంగా డిప్రెషన్ అన్నది ఏ వయసులోనైనా రావచ్చు. కానీ వృద్ధాప్యంలో డిప్రెషన్‌కు లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. ఈ కింది అంశాలు వృద్ధాప్య డిప్రెషన్‌కు దోహదపడతాయి.  త ఆరోగ్య సమస్యలు: వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం సాధారణం. దీర్ఘకాలిక వ్యాధులు ఈ వయసులో ఎక్కువ. జ్ఞాపకశక్తితో పాటు మెదడు సంబంధమైన సమస్యలూ ఎక్కువే. పైగా ఆ వయసులో శారీరక దృఢత్వం తగ్గడంతో సర్జరీ లేదా ఇతరత్రా వ్యాధుల వల్ల శరీరం కూడా పూర్తిగా సహకరించదు. దీంతో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. 
  ఒంటరితనం: ఈ వయసులో పిల్లలు తమ జీవితాల్లో స్థిరపడటానికి దూరప్రాంతాలకు వెళ్లి ఉంటారు. తమంతట తామే తేలిగ్గా కదల్లేని స్థితిలో ఎక్కువగా ఉంటారు. దాంతో ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లో తమకు ఎవరూ అందుబాటులో లేకపోవడం కూడా డిప్రెషన్‌కు తేలిగ్గా దారితీస్తుంది. 
 
  ఏ ప్రయోజనం కోసం జీవించాలనే భావన: అన్ని వ్యాపకాలూ తీరిపోయాక కొందరిలో ఒక చిత్రమైన భావన మొలకెత్తుతుంది. ఇది కాస్త ప్రమాదకరం. ఇక ఏ ప్రయోజనం కోసం బతకాలనే భావన అంకురిస్తే అది తేలిగ్గా డిప్రెషన్‌కు దారితీస్తుంది.   అర్థం లేని భయాలు: తాము ఒంటరిగా ఉన్నప్పుడు చనిపోతామేమో, ఈ వయసులో అకస్మాత్తుగా ఏవైనా ఆర్థికసమస్యలు చుట్టుముడితే అధిగమించడం ఎలా, వృద్ధాప్యం లో వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గకుండా అలాగే కొనసాగుతుంటే ఎలా... లాంటి అర్థం లేని భయాలు వారిని చుట్టుముడతాయి.   ఇటీవలే సంభవించిన మరణాలు: తమ బంధువుల్లో, తెలిసినవారిలో ఎవరైనా చనిపోవడం వృద్ధులను కుంగదీస్తుంది. తమ ఈడు స్నేహితులు, తమకంటే చిన్నవారిగా ఉండే కుటుంబసభ్యులు, ఆ మాటకొస్తే తమ ఇంటి పెంపుడు జంతువులు, అన్నిటికంటే తీవ్రంగా జీవిత భాగ స్వామి మరణం లాంటివి ఇంకా బాధపెడతాయి. ఇలాంటి సందర్భాల్లో వారింకా తేలిగ్గా డిప్రెషన్‌కు లోనవుతారు. 
 
 అది బాధా... డిప్రెషనా?
 ఒకరు తీవ్రమైన బాధకు లోనై ఉన్నప్పుడు వారు వాస్తవంగా తీవ్రమైన బాధలో ఉన్నారా లేక డిప్రెషన్‌లో ఉన్నారా అన్న విషయం తెలుసుకోవడం ఒకింత కష్టమే.  ఈ రెండింటికీ మధ్య తేడాను తెలుసుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. బాధలో ఉన్నవారికి అప్పుడప్పుడైనా బాధ, సంతోషం, ఇతరత్రా ఉద్వేగాలు కలుగుతుంటాయి.  సంతోషం తర్వాత బాధ, బాధ తర్వాత సంతోషం కలుగుతాయి. కానీ డిప్రెషన్‌లో ఉన్నవారు బాధతో, ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతోనే ఉంటారు. ఇదీ తేడా.  వృద్ధుల్లో డిప్రెషన్‌కు కారణమయ్యే వైద్య-ఆరోగ్యాంశాలు : వృద్ధాప్యంలో కనిపించే ఆరోగ్యసమస్యల కారణంగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువన్న సంగతి తెలిసిందే. అయితే వీటిలోనూ అందరిలో కనిపించే సాధారణ వ్యాధుల కంటే భయంకరమైనవిగా పేరొందిన కారణంగా కొన్ని వ్యాధులు వారిని మానసికంగా కుంగదీస్తాయి. నిజానికి సాధారణ వ్యాధులే ఒక్కోసారి ప్రమాదం కలిగించేంత తీవ్రతతో ఉన్నా... వాటి కంటే  ప్రమాదకరం కానంత తక్కువ తీవ్రతలో ఉన్నవే ఎక్కువగా కుంగదీయవచ్చు. అలాంటి వ్యాధుల్లో కొన్ని...  పార్కిన్‌సన్  పక్షవాతం  గుండెజబ్బులు  క్యాన్సర్  థైరాయిడ్ డిజార్డర్, డయాబెటిస్, దాని కారణంగా వచ్చే అనుబంధ  సమస్యలు  విటమిన్ బి-12 లోపం, మతిమరపు, అల్జైమర్స్ వ్యాధి, లూపస్, మల్టిపుల్ స్ల్కిరోసిస్. 
 
 ప్రిస్క్రిప్షన్‌లో వాడే మందులతో డిప్రెషన్: వృద్ధాప్యంలో వచ్చే కొన్ని సమస్యల కోసం వాడే మందుల దుష్ర్పభావం వల్ల కూడా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఒకటి కంటే ఎక్కువగా మందులు / అనేక మందులు వాడేవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. దీనికీ ఒక కారణం ఉంది. అవే మందులు కాస్తంత తక్కువ వయసు ఉండేవారిలో అదేరీతిలో ప్రవర్తించవు. అయితే ఒకింత వయసు పైబడ్డవారిలో శరీర జీవక్రియలు మందగించడం వల్ల ఆ మందులను పూర్తిగా తమలోకి ఇంకేలా చేసుకునే శక్తి శరీరానికి ఉండకపోవచ్చు. దాంతో ఇలాంటి దుష్ర్పభావాలు కలుగుతాయి. సాధారణంగా రక్తపోటు మందులు, బీటా బ్లాకర్లు, నిద్రమాత్రలు, క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్లు, పార్కిన్‌సన్ డిసీజ్‌కు వాడే మందులు, అల్సర్ మందులు, గుండెజబ్బుల మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్, హైకొలెస్ట్రాల్ ఉన్నవారు వాడే మందులు, నొప్పినివారణ మందులు, ఆర్థరైటిస్ ఔషధాలు, ఈస్ట్రోజెన్ హార్మోన్ వంటివి వృద్ధుల్లో డిప్రెషన్ కలిగించేందుకు ఆస్కారం ఎక్కువ. 
 
 వృద్ధుల్లో ఆల్కహాల్ - డిప్రెషన్ : చాలామంది తమ జీవితంలోని చివరి మజిలీగా పరిగణించే వృద్ధాప్యంలో నిశ్చింతగా మద్యం సేవిస్తూ జీవితాన్ని ఆనందించవచ్చని భావిస్తుంటారు. ఇక కొందరు వృద్ధులు రాత్రివేళ తమకు తేలిగ్గా, సుఖంగా నిద్రపట్టడానికి కూడా మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఆ వయసులో అతిగా తాగే మద్యం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. అంటే మద్యం తాము కోరుకున్న ఆనందాన్ని ఇవ్వకపోగా, ప్రతికూల ఫలితాలను ఇస్తుందన్నమాట. దాంతోపాటు ఆల్కహాల్ వల్ల తేలిగ్గా ఆగ్రహాలకు, చిరాకు వంటి ఉద్వేగాలకు గురికావడం (ఇరిటబిలిటీ), యాంగ్జైటీకి లోనుకావడం, మెదడులోని జీవక్రియలు దెబ్బతినడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. పైగా ఆ వయసులో ఆల్కహాల్‌తో మరో ప్రమాదమూ ఉంది. ఆ వయసులో వృద్ధులు తీసుకునే అనేక మందులతో అది ప్రతిచర్యజరిపి కొన్ని ప్రతికూల ఫలితాలనూ ఇచ్చే అవకాశం ఉంది. వృద్ధులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులను పనిచేయకుండా చేసే గుణం కూడా ఉంది. పైగా అది నిద్రలోని నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది. 
 
 వృద్ధాప్య డిప్రెషన్‌ల లక్షణాలు :  నిత్యం తీవ్రమైన విచారం.  అలసట  జీవితంలోని అనేక అంశాల పట్ల ఆసక్తి కోల్పోవడం (అవే అంశాలు తమకు గతంలో చాలా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చినవై ఉంటాయి)  క్రమంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం   క్రమంగా ఆకలి తగ్గుతుండటం  బరువు కూడా క్రమంగా తగ్గుతూ పోవడం   తరచూ నిద్రాభంగం కలుగుతుండటం (ఇది అనేక రకాలుగా జరగవచ్చు. నిద్రపట్టడంలో చాలా ఎక్కువ ఆలస్యం జరుగుతుండవచ్చు. మధ్యమధ్య నిద్రాభంగం కలుగుతుండవచ్చు. ఒక్కోసారి మితిమీరి నిద్రపోతుండవచ్చు లేదా కొన్నిసార్లు రాత్రి నిద్ర తగ్గిపోవడం వల్ల రోజంతా నిద్రమత్తుగా ఉన్నట్లు అనిపిస్తుండవచ్చు)  తను సమాజానికి తీవ్రమైన భారమనీ, ఎందుకూ పనికిరానివాడినని భావించే నిర్వేదం  మద్యం / డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం  త్వరగా మరణించాలనే భావన లేదా ఆత్మహత్యా యత్నాలు /
 ఆలోచనలు. 
 
 ప్రతికూల/డిప్రెషన్ భావనలను గుర్తించడం ఎలా? 
 వృద్ధుల్లో డిప్రెషన్‌ను కనిపెట్టడానికి కొన్ని అంశాలు బాగా ఉపయోగపడతాయి. ఆ క్లూస్ ఇవే... 
  అకస్మాత్తుగా అంతకు మునుపు లేని నొప్పులను ఏకరవు పెట్టడం  తరచూ తమ నిస్పృహనూ, ఏమీ చేయలేకపోతున్న విషయాలను ప్రస్తావిస్తూ ఉండటం.  యాంగ్జైటీకి గురికావడం / వేదన, బాధలను వ్యక్తపరుస్తుండటం అంతకుముందు ఆనందాలిచ్చిన వ్యాపకాలపై ఏమాత్రం శ్రద్ధ కనబరచకపోవడం, వాటిపట్ల ఎంతమాత్రం ఆసక్తి చూపకపోవడం  త్వరగా భావోద్వేగాలకు గురికావడం నలుగురితో కలవడానికి ఇష్టపడకపోవడం / హాబీలపై ఆసక్తి కోల్పోవడం  వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం (అంటే భోజనం చేయడంలో నిరాసక్తత, మందులు సమయానికి వేసుకోకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటివి). చికిత్స: పై నివారణ చర్యల తర్వాత కూడా డిప్రెషన్‌కు లోనైన వారికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఆర్ మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు కౌన్సెలింగ్ కూడా అవసరం.
 
 అధిగమించడం ఇలా... 
 వృద్ధాప్యంలో డిప్రెషన్‌ను నివారించే చర్యలవే
  వ్యాయామం: తమకు శారీరక శ్రమ కలిగించని రీతిలో వాకింగ్ వంటి వ్యాయామాల వల్ల డిప్రెషన్ దరిచేరదు. 
  నలుగురినీ కలవడం: వృద్ధాప్యంలో కలిగే తీరికను ఆసరాగా తీసుకుని నలుగురినీ కలుస్తుండటం వల్ల డిప్రెషన్ వృద్ధుల ఛాయలకే రాదు. పైగా డిప్రెషన్ నివారణలో ఈ అంశం చాలా బాగా పనిచేస్తుంది. 
  కంటి నిండా నిద్ర: కంటినిండా నిద్రపోవడం అన్నది డిప్రెషన్‌కు మంచి మందు. అయితే మితిమీరి మాత్రం నిద్రపోకూడదు. అంటే... నిద్రసమయం 7-9 గంటలు మించనివ్వవద్దు. 
  సమతుల ఆహారం: అన్ని పోషకాలు అందేలా తేలిగ్గా జీర్ణమయ్యే సమతుల ఆహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్ వద్దు. 
  హాబీలు: మనకు ఆసక్తి కలిగించే హాబీలను కొనసాగించవచ్చు. యుక్తవయసులో పని ఒత్తిడి, తీరిక లేని కారణం గా మానేసిన హాబీలను ఈ సమయంలో పునరుద్ధరించుకోవడం డిప్రెషన్ నివారణకు చాలా మేలు చేస్తుంది. 
  పెంపుడు జంతువులు: పెట్స్ ఆలనా-పాలనా డిప్రెషన్‌ను దరిచేరనివ్వవు. 
  కొత్తవిద్యలు/ నైపుణ్యాలు: వీటిని నేర్చుకోవడం డిప్రెషన్‌ను అధిగమించడానికి మేలు చేస్తుంది. వృద్ధాప్యంలో మెదడు పనితీరు, సామర్థ్యం తగ్గుతాయన్న దురభిప్రాయం మనలో చాలామందికి ఉంది. ఇది వాస్తవం కాదు. మెదడు సామర్థ్యంలో కొద్దిగా మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా, ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు. పైగా ఆ సమయంలో వేరే వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి అలా నేర్చుకోవడం సులభం కూడా. 
  హాస్యం: ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హాస్యప్రియత్వం కలిగి ఉండటం డిప్రెషన్‌కు మంచి మందు. 
 
 -నిర్వహణ: యాసీన్
 
మరిన్ని వార్తలు