కృత్రిమ చక్కెరలతోనూ ఊబకాయ, మధుమేహ సమస్యలు!

24 Apr, 2018 00:33 IST|Sakshi

చక్కెర తెస్తున్న చిక్కుల పుణ్యమా అని ఈరోజుల్లో చాలామంది కృత్రిమ స్వీట్నర్స్‌ను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవి కూడా ఊబకాయం, మధుమేహం వంటి అనేక వ్యాధులకు కారణమవుతున్నట్లు తాజాగా ఓ పరిశోధన స్పష్టం చేసింది. మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ విస్‌కాన్సిన్, మారెక్యూట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన ఈ పరిశోధనల్లో ఈ కృత్రిమ చక్కెరలు శరీరంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయో విస్తృతంగా చర్చించారు. కృత్రిమ చక్కెరలను వాడటం మొదలై చాలాకాలమవుతున్నా.. ఊబకాయపు సమస్య ఏ కొంచెం కూడా తగ్గకపోవడం ఇక్కడ గమనార్హం. సాధారణ చక్కెరతోపాటు ఆస్పారటేమ్, అసిసూల్‌ఫేమ్‌ పొటాసియం వంటి కృత్రిమ చక్కెరలను ఎలుకలకు అందించినప్పుడు వాటి శరీరాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బ్రియన్‌ హాఫ్‌మాన్‌ తెలిపారు.

మూడు వారాల తరువాత జరిపిన పరిశీలనల్లో కీలకమైన రసాయనాలు, కొవ్వులు, అమినోయాసిడ్లలో తేడాలు నమోదయ్యాయి అని చెప్పారు. వీటన్నింటిని బట్టి ఈ కృత్రిమ చక్కెరలు మన శరీరం కొవ్వులను జీర్ణం చేసుకునే పద్ధతుల్లో మార్పులకు కారణమవుతున్నాయని.. కొన్ని కృత్రిమ చక్కెరలు రక్తంలో పేరుకుపోయి రక్తనాళాల్లోని కణాలపై దుష్ప్రభావం చూపుతాయని హాఫ్‌మాన్‌ తెలిపారు. కృత్రిమ చక్కెరలను మోతాదుకు మించి అది కూడా దీర్ఘకాలంపాటు తీసుకుంటే సమస్యలు తప్పవని తొలిసారి తమ పరిశోధన చెబుతోందని హాఫ్‌మాన్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు