క్లౌడ్‌ తో జర భద్రం..!

16 Sep, 2014 22:59 IST|Sakshi
క్లౌడ్‌ తో జర భద్రం..!

 సేఫ్టీ
 
స్మార్ట్‌ఫోన్‌లు వాడటం ఎంత సౌలభ్యకరమో...అంతే స్థాయిలో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఖరీదైన గాడ్జెట్స్‌తో ఉన్న సౌకర్యాలే ఒక్కోసారి ఇబ్బందిగా మారతాయి. ఇలాంటి వాటిలో తాజాగా కొంతమంది సెలబ్రిటీలకు తలెత్తిన సమస్య ఏమిటంటే, ఫోటోలు చోరీకి గురవ్వడం. మరి వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్స్‌లోని ఫోటోలు ఎలా చోరీ అయ్యాయి..?! అంటే... ఇక్కడే ఉంది ఒక ఆసక్తికరమైన విషయం.
 
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు క్లౌడ్‌కంప్యూటింగ్‌ను వాడుకొనే అవకాశం ఉంటుంది. అంటే ఫోన్‌లోని డాటాను క్లౌడ్ సర్వర్‌లో దాచుకోవచ్చు. దానివల్ల ఫోన్‌కు కొంచెం మెమొరీ భారం తగ్గుతుంది. ఫోటోలతోనూ, తీసుకొన్న వీడియోలతోనూ ఫోన్‌లోని డాటాస్పేస్ నిండిపోయినప్పుడు క్లౌడ్ సర్వర్‌లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఐఫోన్ వినియోగదారులయితే ‘ఐ క్లౌడ్’లో ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకొని ఫోన్‌లోని డాటాను అందులోకి చేర్చవచ్చు. అవసరం అయినప్పుడు లాగిన్ అయ్యి, దీనిని వాడుకోవచ్చు. దీనికోసం ఐక్లౌడ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
 
మరి ఇక్కడే సమస్య తలెత్తుతోందిప్పుడు. ఐ క్లౌండ్‌లో అకౌంట్ సులభంగా హ్యాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రఖ్యాత హాలీవుడ్‌నటీమణులు జెన్నీఫర్ లారెన్స్, కేట్ ఆప్టన్‌ల ఐ క్లౌడ్ అకౌంట్‌లు హ్యాక్‌కు గురయ్యాయి. వారు క్లౌడ్‌లో దాచుకొన్న ఫోటోలను కొందరు కాపీ చేసుకొన్నారు. తద్వారా వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. మరి ఐ క్లౌడ్ వల్ల సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా బాధితులయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి అమ్మాయిలు ఈ విషయంలో అవగాహనతో వ్యవహరించాల్సి ఉంటుంది. టీనేజ్ గర్ల్స్‌లో చాలామంది తమ ఫొటోలను క్లౌడ్‌లో సర్దేయడం జరుగుతోంది. మరి ఇకపై వ్యక్తిగత సమాచారాన్ని క్లౌడ్‌కు ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
 
దీనికి నివారణ ఏముంది? అంటే... ఫోన్‌లో డాటాస్పేస్ నిండిపోయినప్పుడు క్లౌడ్‌స్పేస్‌లో దాచడం కంటే... డాటాకేబుల్ ద్వారా పర్సనల్ కంప్యూటర్‌లోకి మార్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను దాచడానికి క్లౌడ్‌స్పేస్‌ను వీలైనంత తక్కువగా వాడాలని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు