విషాదాన్ని జయించాడు

26 Jun, 2018 00:05 IST|Sakshi

చెట్టు నీడ

రాయబారాలన్నీ విఫలమై, యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా బంధువుల్నీ, మిత్రుల్నీ సొంతవాళ్లనీ చంపి ఏం బావుకోవాలి?’ అనే భావన పుట్టుకొచ్చింది. ధనుస్సును, బాణాలను పక్కన పెట్టేశాడు. ‘ఇక్కడి నుంచి నన్ను వెనక్కు తీసుకుని వెళ్లు’ అని సారథి అయిన శ్రీకృష్ణుణ్ని అడిగాడు. ‘అలా చేయడం పిరికితనం కదా, నీకు అవతలివారిని చంపడానికి చేతులు రాక వెనక్కు మళ్లావని ఎవరూ అనుకోరు. వారిని చూసి భయపడి పారిపోతున్నావని అందరూ నిన్ను ఎద్దేవా చేస్తారు, కనుక నీవు యుద్ధంలో పాల్గొని తీరవలసిందే’ అన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ‘నాకేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకోవడంతో, శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపల బయట అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలన్నింటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలే తప్ప, వాటి ఫలితాల మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనం గా మాత్రమే పనిచెయ్యాలి. 

ఇక్కడ ఎవ్వరూ ఎవ్వరినీ చంపడం లేదు, చావడం లేదు కూడా. మార్పులకు గురయ్యే శరీరాలు మార్పులు పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావు లేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకుబెణుకు లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతను, నేను ఒకటే అనే భావాన్ని రూఢీ చేసుకొని, జీవితంలో సంఘర్షణలను నవ్వుతూ ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. ఒకరోజున కర్ణుడిని ఇంకా చంపలేదన్న కోపంతో ధర్మరాజు అర్జునుడితో, ‘నీ గాండీవాన్ని ఎవరికైనా ఇచ్చేసై’ అంటూ అవమానపరుస్తున్నట్లుగా అన్నాడు. అలా అన్నవాడిని చంపుతానని అర్జునుడి వ్రతం. అయితే ధర్మరాజును చంపితే తాను బతకలేడు. ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుణ్ని అడిగాడు అర్జునుడు. ‘పెద్దవాణ్ని తిట్టడం అతడిని చంపడంతో సమానం. తనను తాను పొగుడుకోవడం చావడంతో సమానం. ఈ రెండు పనులూ చేసి నీ ప్రతిజ్ఞ తీర్చుకో’ అని సలహా ఇచ్చాడు. ఆ తరువాత యుద్ధభూమికి వెళ్లి కర్ణుడిని సంహరించాడు అర్జునుడు. మొత్తం మీద భారతమంతటా ఆ కొద్ది సమయం తప్ప అర్జునుడి వీరత్వమే కనిపిస్తుంది. కృష్ణుడి కర్తవ్య బోధతో వెంటనే మేలుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తించి, నరనారాయణులలో ఒకడయ్యాడు.
 

మరిన్ని వార్తలు