పులులు, పిల్లులపాటి చేయదా నా అమ్మ భాష

17 Dec, 2017 02:06 IST|Sakshi

పులులను రక్షించుకుందామంటున్నాం భాషకూ అభయమిద్దాం

అనవసర భయం వద్దు

బడుల స్థాయిలో సాహితీ కార్యక్రమాలు అవసరం

బతుకుదెరువుతో ముడిపెట్టాలి

ప్రభుత్వం తల్లిపాత్ర పోషించాలి

సాక్షితో తనికెళ్ల భరణి

‘పులులు అంతరిస్తున్నాయని గణనలు చేసి, వాటి పరరిక్షణ చర్యలు చేపట్టడం చూశాం. మరి ప్రపంచంలోనే గొప్ప సాహితీ ప్రక్రియలు తనలో ఇముడ్చుకున్న మన తెలుగు భాష ఆ పులులు, పిల్లుల పాటి చేయదా? పిల్లాడు సిగరెట్‌ తాగుతానంటే ‘వద్దు నాన్నా అనారోగ్యం, పాలు తాగు నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది’ అని అమ్మ అంటుంది కదా, అలాగే ఈ భాష పరిరక్షణలో ప్రభుత్వం ఆ అమ్మ పాత్ర పోషించాలి. ఎక్కడ కఠినంగా ఉండాలో, ఎక్కడ లాలించాలో ఆచితూచి వ్యవహరించాలి. అప్పుడు భాష ఎందుకు వికసించదో, విలసిల్లదో చూద్దాం’. తెలుగు చలనచిత్ర రంగంలో భాషాప్రావీణ్యం అద్భుతంగా ఉన్నవారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కవి, రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాట ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో 2012లో తిరుపతిలో జరిగిన సభల్లో లీనమైన ఆయన ఇప్పుడు భాగ్యనగరం వేదికగా అత్యద్భుతంగా జరుగుతున్న సభల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

మాతృస్తన్యం కాదని డబ్బాపాలు తాగితే...
‘‘మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఎన్ని భాషలు నేర్చినా, అమ్మభాషలో ఆయన ప్రావీణ్యం తగ్గించుకోలేదు. మనకు ఆసక్తి ఉండాలే కాని ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చు, నేర్పు చూపొచ్చు. కానీ అమ్మ ఒడి నేర్పిన భాషకు ఎప్పుడూ అగ్రతాంబూలమే దక్కాలి. అమ్మ స్తన్యం కాదని డబ్బాపాలు తాగితే ఆరోగ్యమొస్తుందా... ప్రతి ఇంట తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం.

ఆ మాటకు నేను విరుద్ధం...
పదిపదిహేనేళ్లుగా భాషపై వినిపిస్తున్న భయమొక్కటే, ఇది అంతరించే జాబితాలో ఉందని. కానీ మీరు గమనించండి.. గత రెండు దశాబ్దాల్లో తెలుగు నేలపై ఎన్నో అవధానాలు జరిగాయి, గతంలో లేని కొత్త రికార్డులు సృష్టించాయి. జనం విరగబడి ఆస్వాదించారు. భాష అంతరిస్తుంటే ఈ పరిస్థితి ఉండదు. భాష, అందులోని సాహితీప్రక్రియలపై మక్కువ ఉంది. నేటి తరానికి దాని మజా తెలియాలి. అది తెలిస్తే వారూ అక్కున చేర్చుకుంటారు. అందుకే... భాషకు ప్రమాదమనే భయానికి నేరు విరుద్ధం.

బడుల నుంచి మొదలు కావాలి... ఈ మహాసభలు బాహుబలి లాంటివే...
తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు నామమాత్రమే. అందుకే మన సినిమాకు అంతర్జాతీయ పురస్కారాలు ఉండవు. కానీ బాహుబలి  విడుదలై ప్రపంచవ్యాప్తంగా తెరపై మాయ చేయటంతో విదేశీయులూ సమ్మోహనంలో మునిగిపోయారు. ఇప్పుడు భారతీయ సినిమా అంటే ముందుగా తెలుగు సినిమాను పేర్కొంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు కూడా భవిష్యత్తులో తెలుగు భాషకు అలాంటి ప్రాభవమే తెస్తాయని ఆశిస్తున్నా.

తెలుగులో చదివితే ఉద్యోగాల్లో వాటా ఇవ్వండి...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 1 నుంచి 12 తరగతుల వరకు తెలుగును తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం 20 ఏళ్ల క్రితం తీసుకుని ఉంటే ఇప్పుడు భాషపై భయం, ఆందోళన ఉండేవి కాదు. కనీసం ఇప్పటికైనా గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు. ఇదే కోవలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలి. తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలి. జపనీయులు మాతృభాషలో చదివి ప్రపంచాన్ని ఏలటం లేదా? కాబట్టి తల్లిదండ్రులే తొలుత అమ్మభాషపై చిన్నచూపును దూరం చేసుకోవాలి. వారు పిల్లలకు నూరిపోస్తే వారు అలాగే తయారవుతారు. చప్పట్లకు రెండు చేతులుండాలి, ప్రభుత్వం–తల్లిదండ్రులు ఆ పాత్ర పోషించాలి.

ఆసక్తి రగిలించాలి...: ఆమధ్య నేను ఓ గ్రంథాలయానికి వెళ్లి ముఖ్యమైన పాత తెలుగు పుస్తకం తీస్తే వాటి మధ్య పాము గుడ్లు కనిపించాయి. లైబ్రరీలు ఈ దుస్థితిలో ఉంటే పుస్తకంపై ఆసక్తి ఎలా ఉంటుంది? ప్రత్యేక సందర్భాలప్పుడు పుష్పగుచ్ఛాల బదులు మంచి పుస్తకాలివ్వండి. 20 ఏళ్లుగా నేను దాన్ని ఆచరిస్తున్నా.

నాకు అదే స్ఫూర్తి...
తిరుపతి వెంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణలతో మా పూర్వీకులకు బంధుత్వం ఉంది. మా నాన్న కూడా సాహిత్యాభిమానే. అలా నాకు సాహిత్యంపై  అనురక్తి చిన్నప్పటి నుంచే ఉన్నా, ఓ సంఘటన మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఓసారి  మిత్రులతో కలిసి సినిమా చూసి వస్తూ మార్గమధ్యంలో ఉన్న కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయానికి వెళ్లాను. అక్కడ ఓ పదిమంది డబ్బాలో ప్రముఖుల పేరు రాసిన చిట్టీలు వేసి అది వచ్చినవారు ఆ ప్రముఖుడి గురించి రెండు నిమిషాలు మాట్లాడాలనే పోటీ పెట్టారు. నాకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు రావటంతో ఆయన గురించి మాట్లాడి తొలి బహుమతిగా మాస్తి వేంకటేశ అయ్యంగార్‌ రాసిన ‘వాయులీనం’ పుస్తకం అందుకున్నా. ఓరోజు ఆ పుస్తకం పోయింది. ఎక్కడ వెదికినా మరోటి దొరకలేదు. తర్వాత కాకినాడలో ఓ చోట పుస్తకం చూసి వెల రూ.2 ఉన్న ఆ పుస్తకానికి రూ.100 ఇచ్చి కొన్నా.

ఇంటర్‌లో ఉండగా గణతంత్ర దినోత్సవం రోజున తొలిసారి కవిసమ్మేళనంలో పాల్గొన్నా. కవికి ఉన్న గౌరవం గురించి ‘కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు, హలం తప్ప అంగుళమైనా పొలం లేనివాడు, గుడ్డలు మాసిన, గడ్డం మాసిన, తలమాసినవాడంటూ సమాజం వెలివేసిన వాడే కవి’ అని చెప్పా. దీనికి ప్రముఖ కవి ఉత్పల సత్యనారాయణాచార్య తనకు కప్పిన శాలువాను తీసి నాకు కప్పారు. అప్పటి నుంచి కవిత్వం మీద మనసుపెట్టా.

పుస్తకం లేకున్నా వద్దు దిగులు.. ఆన్‌లైన్‌ ఉన్నా చాలు...
పిల్లలు పుస్తకాలు చదవటం లేదని చాలామంది గగ్గోలు పెడతారు. కానీ ఆ ఆందోళన వద్దు. పలక పోయిందని బాధపడుతూ కూర్చుంటామా, తోలుబొమ్మలాటలు లేవని నిట్టూరుస్తామా... ఆధునికతను అందిపుచ్చుకుంటూనే భాషను బ్రహ్మాండంగా కాపాడుకోవచ్చు. ఆన్‌లైన్‌లో బోలెడన్ని గ్రంథాలున్నాయి. వాటిని చదివినా చాలు.. ఫలితాల్లో తేడాలేమీ ఉండవు. అంతా మంచే జరుగుతుంది. మరికొన్ని దశాబ్దాల తర్వాత కూడా తెలుగు వైభవాన్ని అద్భుతంగా స్మరించుకుంటా. భాషతో ఉంటూనే భేష్‌ అనిపించుకుంటా. పైన చెప్పిన సూచనలు పాటిస్తే చాలన్నది నా మాట. – గౌరీభట్ల నరసింహమూర్తి


తెలుగు అందమైన భాష
ఫ్రెంచ్‌ ప్రొఫెసర్‌ డేనియల్‌
30 ఏళ్లుగా తెలుగుతో అనుబంధం

‘‘ప్రపంచ తెలుగు మహాసభలు బాగా జరుగుతున్నాయి. నిన్న  ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గొప్పగా మాట్లాడారు. తన గురువుగారి గురించి చెప్పుకున్నారు. గురువు ద్వారా భాష విస్తారంగా అవగాహనకు వస్తుంది...’’ – ఫ్రెంచ్‌ ప్రొఫెసర్‌ డేనియల్‌ నేజర్స్‌ అచ్చ తెలుగులో పలికిన మాటలివీ!

తెలుగు అందమైన భాష అని, కొత్తవారికి పదాలు పలకడం కష్టమేనని, అందుకే తాను మాట్లాడుతుంటే పిల్లలు మాట్లాడినట్లుగా ఉంటుందని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.

30 ఏళ్ల తెలుగు ప్రస్థానం..
డేనియల్‌ తెలుగు ప్రస్థానం మొదలై 30 ఏళ్లయింది. 1986లో ఇండో– ఫ్రెంచ్‌ స్టూడెంట్స్‌ ఎక్సె్చంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్‌కు వచ్చారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘సామాజిక– సాంస్కృతిక శాస్త్రం’పై పీహెచ్‌డీ చేశారు. బుర్రకథ, తోలుబొమ్మలాట, హరికథలు, కంజెరి కథ, నాటకాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. రాష్ట్రం నలుమూలలా పర్యటించి తెలుగు నేర్చుకున్నారు. దక్షిణ భారతదేశమంతా పర్యటించి నాట్యశాస్త్రరీతులు, యక్షగానాలు, శాసనాలు, కళాచరిత్రలపై పరిశోధన గ్రంథాలు రాశారు. ఆరుగురు స్కాలర్స్‌ను కూడా గైడ్‌ చేశారు. వారిలో కొందరు పరిశోధన కోసం సంస్కృతం, తమిళం, తెలుగు భాషలు నేర్చుకున్నట్లు చెప్పారాయన. శెయర్‌జో జాకోవీ అనే విద్యార్థి నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ పాటలపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. ఆ పరిశోధన గ్రంథానికి తానే గైడ్‌ చేస్తున్నట్లు చెప్పారు.


తెలుగు..  దూకుతున్న అలుగు
కవిత్వంలో పద్యం, వచనం రెండు ప్రధాన అలంకారాలు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ ప్రభుత్వం ఓ పద్యం, ఓ వచనాన్ని అధికారికంగా సమర్పించింది. ఇందులో ప్రముఖ కవి డాక్టర్‌ ఎన్‌.గోపి ప్రభుత్వ పక్షాన సమర్పించిన వచన కవిత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది మీ కోసం...

అమ్మా! తెలంగాణ తల్లీ పాదాభివందనం నీకు. మాకు తెలుగు నేర్పించిన మట్టి సరస్వతివి నువ్వు. మా పొలాల్లోని కూలి జనుల పాటల్లోని నుడికారానివి నువ్వు. వారి గుండెల్లోని మమకారానివి నువ్వు. నీ మధురమైన యాస మా జీవితాల్లోని ఉచ్ఛ్వాస నిశ్వాస. తంగేడు పూలను ముద్దకొప్పులో ముడిచి బంగారాన్ని వెక్కిరించావు నువ్వు. బతుకమ్మలను పేర్చి అన్ని రకాల పుష్పాలకు కలిసి బ్రతకటం నేర్పించావు నువ్వు. ఇవాళ తెలుగు తెలంగాణ చెరువుల్లోంచి దూకుతున్న అలుగు. ఇవాళ తెలుగు తెలంగాణా వాకిళ్లలో ఎండబెట్టిన అస్తిత్వాల ఒరుగు.

ఇవాళ తెలుగు తెలంగాణా సంస్కృతిని తవ్విపోసే పారా పలుగు. ఇవాళ తెలుగు తెలంగాణా బిడ్డలకు కల్పించే బ్రతుకు దెరువు. అన్యభాషల జడివానలో తెలుగే కదా మన గొడుగు. తల్లిభాష ఒక దారం అన్ని భాషలకు అది ఆధారం. చనుబాలలోంచి వచ్చిందే వ్యాకరణం అన్నింటినీ ఇముడ్చుకోవటమే దాని మూలగుణం. కన్నీటికీ భాషవుంది దాని పేరు తెలుగు. కాలికి దెబ్బతగిల్తే పసివాడు ‘అమ్మా’ అని అరుస్తాడు అది అచ్చమైన తెలుగు. అన్నం పెట్టండి తెలుగు భాషకు అది పరబ్రహ్మంలా వెలుగుతుంది అఖండదీపంలా కాపాడుతుంది. ఇవాళ తెలుగు పల్లెలన్నీ భాగ్యనగరిలో కుప్పపడ్డాయి. ఇది సకలజనుల కళారాధన సబ్బండ వర్ణాల సంవేదన. రండి! తెలుగును ఉజ్వలంగా వెలిగిద్దాం. ఇదొక విరాట్‌ వివేచన ఇది తెలుగు వెలుగుల తెలంగాణ అవును! ఇది తెలుగు వెలుగుల తెలంగాణ..

మరిన్ని వార్తలు