ఆట కదరా భరణీ

24 Nov, 2019 02:34 IST|Sakshi

కార్తీకం శివుడికి ప్రీతికరమైనది. భరణికి శివుడు  ప్రియాతిప్రియమైనవాడు. ‘ఆట కదరా శివా..!’ అనేంత అఫెక్షన్‌. ‘నావాడు’ అంటాడు. ‘నిను వీడను ఏనాడూ’ అంటాడు. కన్నప్ప శివుడికి కన్నిచ్చి భక్తకన్నప్ప అయ్యాడు. భరణి శివుడికి ఏమీ ఇవ్వలేదు. తనే శివుణ్ని లోపలికి లాగేసుకున్నాడు. శివుణ్ణే.. భక్తశివుణ్ణి చేసేసుకున్నాడు!   దేవుడా.. అంటే.. ‘అవును దేవుడే.. ఇంత ఫ్లెక్సిబిలిటీ నా శివయ్య దగ్గర నాకు ఉంది’ అంటాడు. భరణి శివుడి గురించి చెబుతున్నంతసేపూ.. ‘ఆట కదరా భరణీ’ అనిపించింది మాకు!!

కార్తీక మాసం అంటే శివుడికి ప్రత్యేకం. పైగా మీరు మాల కూడా ధరిస్తారు కాబట్టి ఆ విశేషాలు చెబుతారా?
తనికెళ్ల: మామూలుగా ఈ మాసంలో దీక్ష తీసుకుంటాను. దేవుడు, దైవకార్యాలు ఏమైనా కూడా ఆరోగ్యంతో లింక్‌ అయ్యుంటాయి. అంటే ఏడాది పొడవునా ముప్పూటలా తింటాం కాబట్టి.. మండలం (40 రోజులు) పాటు ఆహార నియమాలు పాటిస్తాం. మాల ధరించిన ఆ నలభై రోజులు మన జీవన విధానం ఓ క్రమ పద్ధతిలో ఉంటుంది. సైంటిఫిక్‌గా మనలో ఉన్న టాక్సిన్స్‌ అన్నీ 20 రోజులకు పోతాయి. చెత్త అంతా పోయాక అక్కడ్నుంచి శక్తి ఆరంభమవుతుంది. 40 రోజులు ముగిసేసరికి ఓ కొత్త శక్తి వస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. శివ దీక్ష, బాబా దీక్ష, అయ్యప్ప దీక్ష.. ఏ దీక్ష అయినా 40 రోజులు అని అందుకే నిర్ణయించారు.

కానీ కొందరు 20 రోజులు, 3 రోజులు... ఇలా కూడా దీక్ష తీసుకుంటుంటారు కదా?
దురదృష్టవశాత్తు వాళ్ల సౌకర్యం కోసం చేసేవాళ్లు ఉన్నారు. అసలు చేయపోతే నష్టం ఏంటి? చేస్తే 40 రోజులు.. లేకపోతే ఓ నమస్కారం పెట్టుకోండి. ఏ దేవుడూ నా దీక్ష తీసుకోకపోతే నేను ‘సర్వైవల్‌’ కాలేను అనడు కదా. నేనైనా, ఎవరైనా... దీక్ష తీసుకుంటే పాటించాల్సిన నియమం ఏంటంటే.. ఏకభుక్తం (ఒక పూట భోజనం, సాయంత్రం అల్పాహారం) భూశయనం (నేల మీద నిద్రపోవడం), బ్రహ్మచర్యం (కామ, క్రోధ, లోభాలకు దూరంగా ఉండాలి. అలాగే మందు.. పాన్‌పరాగ్‌ వంటి చెత్తాచెదారానికి దూరంగా ఉండటం). సౌకర్యంలోనే కాదు.. అసౌకర్యంలో కూడా ఉండగలను అనడానికి భూశయనం.

నడుము నొప్పి ఉన్నవారిని డాక్టర్‌ తలగడ లేకుండా కింద పడుకోమంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవి అలవాటు అయితే రేపు ఆస్పత్రికి వెళ్లే ఖర్మ ఉండదు. ఒక దీక్ష వెనకాల ఇంత అర్థం ఉంటుంది. దీన్ని చాలామంది అర్థం చేసుకోవడం లేదు. కొంచెం కఠినంగానే చెబుతున్నాను. రేపు మాల వేసుకుంటున్నాడంటే తెల్లవారు జాము వరకూ మందు తాగుతాడు. మాల తీసేసిన గంటకే పాన్‌ పరాగ్, సిగరెట్‌  మొదలుపెట్టేస్తాడు. ఇలా దీక్ష తీసుకోపోతే ఏం? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మూడ భక్తిని మనం ప్రచారం చేయొద్దు. అవకాశం ఉంటే ఖండిద్దాం. ఎందుకంటే ఈ మధ్య భక్తి పేరుతో వ్యాపారం చేస్తున్నారు.

ఇంకోటి ఏంటంటే.. సాయిబాబా అంటే ఫ్రెండ్లీగా, శివుడంటే కొంచెం భయంగా ఉంటుందని కొందరు అంటారు..
సాయిని తిరగేస్తే ‘యిసా’. యిసా అంటే శివుడే. వీడితో కూడా ఫ్రెండ్లీగా ఉండండి. దేవుడిని చూసి భయపడకండి. పాపాన్ని చూసి భయపడండి. మనకు ఉండాల్సింది దైవభక్తి, పాపభీతి. పాపం చేస్తే నాశనమవుతాం లేదా నరకానికి పోతాం అనే భయం ఉండాలి. అంతేకానీ దేవుడంటే భయం ఉండకూడదు. దేవుడు కరుణా సముద్రుడు. వాడంటే భయం ఎందుకు? దేవుడికీ దెయ్యానికీ తేడా తెలియకపోతే ఎట్లా? ఖర్మ.

దేవుడిని వాడు వీడు అనొచ్చా?
మనలోని మైనస్‌ పాయింట్లను  దేవుడికి అంటకట్టాం. దేవుడు తల్లివంటివాడు. మంచి స్నేహితుడు. వాడికి గౌరవం ఇచ్చి దూరం పెట్టకండి. దగ్గర చేసుకోండి.

అయ్యప్ప దీక్షకి అయితే ‘పీఠం’ పెడతారు. శివుడి దీక్షకు?
శివుడికి పీఠం పెట్టక్కర్లేదు. శివుడికి తక్కువ నియమాలు ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకుని, శబరిమలకే వెళ్లాలి. అయితే ‘సర్వం శివమయం’ అంటారు. శివ మాలను ఎక్కడైనా ఏ శివుడి గుడిలో అయినా తీయొచ్చు. అయ్యప్పకు చేసినట్లుగా ఇరుముడి అక్కర్లేదు. ‘ఇరుముడి’ అంటే రెండు ముడులు అని అర్థం. హోటల్స్‌ లేని కాలంలో ఒక మూటలో తమ వంట కోసం బియ్యం, పప్పు తీసుకెళ్లేవాళ్లు. మరో మూటలో దేవుడికి సమర్పించడానికి కొబ్బరికాయ, దానికి చిన్న చిల్లు పెట్టి, నెయ్యి పోసి తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఇరుముడి అవసరంలేదు. సంప్రదాయం రాను రాను ఓ స్టాంప్‌ అయిపోయింది.

శివమాల ఎప్పుడు మొదలుపెట్టారు?
1970ల్లో ఓ మలయాళీని చూసి మా గురువు రాళ్లపల్లిగారు అయ్యప్ప మాల వేసుకోవడం ప్రారంభించారు. ఆయన్ను చూసి నేనూ దీక్ష మొదలుపెట్టాను. ఓ పదిసార్లు శబరిమలకు వెళ్లాను. మదరాసు నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్‌ అయ్యాక ఓ తమాషా సంఘటన జరిగింది. నేను, నా మిత్రుడు సుబ్బారావు, దేవరకొండ కుమార్‌ మాల వేసుకున్నాం. వీళ్లలో ఒకరి బంధువులు పోయారు. మరొకరికి సెలవు దొరకలేదు. దాంతో విరమించుకున్నారు.

మన దగ్గర అప్పుడు రూపాయిలు లేవు (నవ్వుతూ). వీళ్లతో వెళ్తే ఖర్చులు కలిసొస్తాయనుకుంటే వీళ్లిద్దరూ డ్రాప్‌. అప్పుడు ఏం చేద్దాం అనుకొని సర్లే.. అయ్యప్ప దగ్గరకి ఏం వెళ్తాం. అయ్యప్ప అబ్బ దగ్గరకు వెళ్దాం అని శ్రీశైలం వెళ్లాను మాల విరమణకి. అక్కడ మూడు రోజులు ఉన్నాను. అప్పుడు నాలోకి శివుడు ప్రవేశించాడు. ఆ తర్వాత ఏడాదికి దాదాపు రెండుసార్లు శివమాల వేసుకుంటున్నాను. ఏదైనా కొత్తగా రాద్దాం అనుకున్నప్పుడు మాల వేసుకుంటాను. శివమాల దాదాపు 25 సార్లు వేసి ఉంటాను. ఈసారి న్యూజిల్యాండ్‌ తెలుగు మహాసభలకు వెళ్లాను. అక్కడే మాల విరమణ చేశాను.

ఓంకారం ప్రత్యేకత గురించి చెబుతారా?
ఓంకారం ‘అ ఉ మ’ అనే మూడు శబ్దాల సంకలనం. ఓంకారంకి సైంటిఫిక్‌గా చెప్పినది ఏంటంటే గుడి గంట కొట్టినప్పుడు ఆ ఘంటారావానికి కొన్ని కోట్ల క్రిములు, సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. నేల రాలిపోతాయి. సేమ్‌ ఎఫెక్ట్‌ ఓంకారానికి కూడా ఉంటుంది. ఓంకారం గనుక కరెక్ట్‌గా నేర్చుకొని చెబితే నీ చుట్టూ ఓ ‘ఆరా’ ఏర్పడుతుంది. వైబ్రేషన్స్‌ వల్ల నెగటివ్‌ ఎనర్జీ పోతుంది. రసూల్‌ çపుకుట్టి సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ అందుకున్నప్పుడు ‘ప్రపంచానికి ఓంకారం అందించిన దేశం నుంచి వచ్చాను’ అని చెప్పాడు. మంత్రం ఓంకార సహితమైనప్పుడు ఎనరై్జజ్‌ అవుతుంది. నమశ్శివాయ కన్నా ‘ఓం నమశ్శివాయ’ ఎక్కువ ఎఫెక్ట్‌. ఓంకారం దీపంలాంటిది. కార్తీక మాసంలో దీపం పెడతాం. అజ్ఞానం అనే చీకటిని దీపం తొలగిస్తుంది.

వన భోజనాల గురించి?
వనభోజనాలనేది అద్భుతమైన కాన్సెప్ట్‌. అందరం ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తలో చేయి వేసి వంట చేసుకుంటాం. అయితే వన భోజనం అంటే వనం ఉండాలి. ఇప్పుడు వనం లేదు. బయట క్యాటరింగ్‌ వాడికి చెప్పేసి భోజనాలు చేయిస్తున్నారు. అందులో ఉండే మూలాలు పోగేట్టేస్తున్నాం. ఇంకా ఘోరమైన విషయమేంటంటే కార్తీక భోజనాలు  కులపరంగా విడిపోవడం. వాళ్ల కార్తీక వనభోజనాలు.. వీళ్ల కార్తీక భోజనాలు... అంటూ విడిపోతున్నాం. అది దౌర్భాగ్యం.

ఫైనల్లీ.. శివుడితో మీకు ఉన్న మానసిక సంబంధం గురించి?
శివుడిని ఏ రూపంలో చూసినా అనుభూతి చెందుతాను. ఒళ్లు పులకరిస్తుంది. ఇలాంటి అనుభూతికి చాలామంది లోనవుతారనుకుంటున్నాను. దేవుడికి ఇంటెలిజెన్స్‌ కన్నా ఇన్నోసెన్స్‌ నచ్చుతుంది. నేను దేవుడిని ఫ్రెండ్‌లా ట్రీట్‌ చేస్తాను. ఫ్రెండ్‌తో ఉన్న అనుబంధం ఇచ్చే అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టం.
– డి.జి. భవాని

మాలధారణ సమయంలో పాటించే నియమాల వల్ల కలిగే మేలు గురించి కొంచెం వివరంగా చెబుతారా?
దీక్షలో ఉన్నప్పుడు తెల్లవారు జాము చన్నీటి స్నానం చేస్తాం. సైన్స్‌ పరంగా కానీ, ఆయుర్వేదం పరంగా కానీ చన్నీటి స్నానం వల్ల చాలా మేలు జరుగుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మ వ్యాధులు రావు. చెంబుడు చల్లని నీళ్లు శరీరం మీద పడగానే లోపల గిర్రున తిరగడం ప్రారంభిస్తుంది. అందుకే ఫస్ట్‌ చెంబుడు నీళ్లు చల్లగా ఉంటాయి. ఆ తర్వాత వెచ్చదనం మొదలవుతుంది. ఇలా మనవాళ్లు ఏం పెట్టినా ఆరోగ్యపరమైన కారణం ఉంటుంది.

మరిన్ని వార్తలు